Nara Lokesh Padayatra: జనవరి 27 నుండి పాదయాత్ర చేస్తాను.. మంగళగిరి మీరే చూసుకోండి.. కార్యకర్తలతో నారా లోకేష్
వచ్చేఏడాది జనవరి 27 నుండి రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేపట్టేందుకు శ్రీకారం చుట్టనున్నట్లు మాజీ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు.
Padayatra: వచ్చేఏడాది జనవరి 27 నుండి రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేపట్టేందుకు శ్రీకారం చుట్టనున్నట్లు మాజీ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. మంగళగిరిలో తన పాదయాత్రపై లోకేష్ క్లారిటీ ఇచ్చారు.కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ వచ్చే ఏడాదంతా తాను రాష్ట్రం మొత్తం పాదయాత్ర చేపట్టనున్నానని… 400 రోజుల్లో కేవలం నాలుగురోజులు మాత్రమే మంగళగిరిలో వుండనున్నానని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 4 వేల కిలోమీటర్ల పాదయాత్ర ఉంటుందని అన్నారు.ఇప్పటికే మంగళగిరి నియోజకవర్గాన్ని టిడిపికి కంచుకోటగా మార్చానని… ఇక్కడ టీడీపీ బాధ్యతను కార్యకర్తలే తీసుకోవాలని లోకేష్ సూచించారు. నన్ను ఓడించేందుకు జగన్మోహన్ రెడ్డి అన్ని ఆయుధాలు వాడతాడు.వాటిని సమర్ధవంతంగా ఎదుర్కొని నిలబడదామని అన్నారు. ఇక మంగళగిరిని మీరే కాపుకాయాలని టిడిపి కార్యకర్తలకు లోకేష్ సూచించారు.
గతంలో టీడీపీ అధినేత చంద్రబాబు కూడా 2014 ఎన్నికలకు ముందు ‘వస్తున్నా మీ కోసం’ అంటూ పాదయాత్ర చేసి అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు అదే తరహాలో నారా లోకేష్ కూడా 2024 ఎన్నికలే లక్ష్యంగా ఈ పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. జనవరి 27న చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పం నుంచి లోకేష్ పాదయాత్ర ప్రారంభం కానుంది. ఏడాదికి పైగా యాత్ర ద్వారామొత్తం 175 నియోజకవర్గాలు కవర్ అయ్యేలా ప్లాన్ వేసుకున్నారు.
పార్టీ నేతలతో పాటు యువత ఎక్కువగా పాల్గొనేలా సన్నాహాలు చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే వచ్చే ఎన్నికల్లో 50 శాతం యువతకే ప్రాధాన్యత ఉంటుందని పార్టీ అధినేత వెల్లడించిన నేపథ్యంలో ఆ దిశగా పార్టీ అడుగులు వేస్తోంది. ప్రధానంగా పార్టీ కేడర్‌లో ఉత్సాహం నింపడమే కాకుండా ఎన్నికలకు కూడా సిద్ధమయ్యేలా లోకేష్ పాదయాత్ర ఉంటుందని తెలుస్తోంది.