Last Updated:

Brain Tumor : బ్రెయిన్ ట్యూమర్ పై స్పెషల్ స్టోరీ.. ఏపీలో అందుబాటులో ఉన్న అత్యాధునిక వైద్యప్రక్రియలు

మెదడు పనిచేయడం లేదు.. బుర్ర హీటెక్కింది.. అనే మాటలు వింటుంటాం. మానవ శరీరం మొత్తంలో మెదడుకు ఉన్న ప్రాధాన్యత అలాంటిది. చూసే కళ్లు.. నడిచే కాళ్లు అన్నీ మెదడు ఆధీనంలో ఉంటాయి. రుచి, వాసన, స్పర్శ, వినడం లాంటి అన్ని పనులు మెదడు కణాలు చేసేవే. ఆకలి, దాహం లాంటివి కూడా మెదడు కణాల ద్వారానే

Brain Tumor : బ్రెయిన్ ట్యూమర్ పై స్పెషల్ స్టోరీ..  ఏపీలో అందుబాటులో ఉన్న అత్యాధునిక వైద్యప్రక్రియలు

Brain Tumor : మెదడు పనిచేయడం లేదు.. బుర్ర హీటెక్కింది.. అనే మాటలు వింటుంటాం. మానవ శరీరం మొత్తంలో మెదడుకు ఉన్న ప్రాధాన్యత అలాంటిది. చూసే కళ్లు.. నడిచే కాళ్లు అన్నీ మెదడు ఆధీనంలో ఉంటాయి. రుచి, వాసన, స్పర్శ, వినడం లాంటి అన్ని పనులు మెదడు కణాలు చేసేవే. ఆకలి, దాహం లాంటివి కూడా మెదడు కణాల ద్వారానే తెలుసుకుంటాం. చేతులు, కాళ్లు, కళ్లు, చెవులు, నాలుక.. ఇలా శరీరం అవయవాల్లోని ఏ అవయవం పనిచేయాలన్నా దానికి మూలాధారం మెదడు. శరీరంలోని అణువణువునూ నియంత్రిస్తూ, శాసిస్తూ అన్నీ తానై నడిపిస్తుంది మన మెదడు. మన శరీరమంతా మెదడు ఆధీనంలో ఉంటుంది. మెదడు ఎంత కీలకమో, అంతే సున్నితం. అలాంటి మెదడులో గడ్డ (ట్యూమర్) ఏర్పడితే అది. ఎంతో ప్రమాదకరం. మెదడులోని ఒక అవయవాన్ని నియంత్రించే భాగంలో గడ్డ ఏర్పడితే అది ఆ నియంత్రణ కేంద్రంపై ప్రభావం చూపుతుంది. దాంతో ఆ అవయవం చచ్చుబడిపోయే ప్రమాదం ఉంటుంది. మెదడులోని గడ్డలు వ్యక్తి ఆరోగ్యం, కదలికలు, మురుకుదనం, జ్ఞాపకశక్తి వంటి ఎన్నో కీలక అంశాలపై ప్రభావం చూపుతుంది.

బ్రెయిన్ ట్యూమర్ అంటే ఏంటీ..?

మెదడులో అసాధారణంగా పెరిగే కణజాలాన్ని గడ్డ(ట్యూమర్) అని అంటారు. మెదడులో ఏ ప్రాంతంలో కణితి ఏర్పడినా అది మెదడు సాధారణ పనితీరును దెబ్బతీస్తుంటుంది. మెదడులో ఏర్పడిన కణతుల వల్ల మెదడుపై ఒత్తిడి పెరిగి, ఆరోగ్యవంతమైన మెదడు కణాలు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. మన శరీరంలో ఎక్కడ గడ్డలు ఏర్పడితే వెంటనే తెలుసుకోగలుగుతాం. అదే మెదడులో గడ్డలు ఏర్పడితే మాత్రం అంత సులువుగా తెలుసుకోలేం. కొన్ని లక్షణాలను, శరీరంలో కనిపించే అసాధారణ మార్పులను బట్టి బ్రెయిన్ ట్యూమర్ గా (Brain Tumor) అనుమానించాలి. బ్రెయిన్ ట్యూమర్ను ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది. ఆలస్యం చేస్తే మాత్రం చాలా ప్రమాదకరం. మెదడు కణతులు సాధారణ కణతులు, క్యాన్సర్ కణతులు అని రెండు రకాలుగా ఉంటాయి. కణితి రకాన్ని బట్టి చికిత్స ఆధారపడి ఉంటుంది.

ఎలా వస్తుంది..?

జన్యుపరమైన కారణాలతో బ్రెయిన్ ట్యూమర్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కుటుంబంలోగానీ, వంశంలోగానీ బ్రెయిన్ ట్యూమర్ వచ్చిన దాఖలాలు ఉంటే వారు జాగ్రత్తగా ఉండాలి. దాంతో పాటు ఎక్కువగా రేడియేషన్ ప్రభావానికి గురయ్యే వారిలో బ్రెయిన్ ట్యూమర్ వచ్చే అవకాశాలు ఉన్నాయని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే సెల్ఫోన్ల వినియోగం వల్ల కలిగే రేడియేషన్ బ్రెయిన్ ట్యూమర్కు దారితీస్తుందా..? లేదా..? అనే అంశంపై అనేక వాదనలు ఉన్నాయి. కచ్చితంగా సెల్ఫోన్ వల్ల కలిగే రేడియేషన్ వల్ల బ్రెయిన్ ట్యూమర్ వస్తుంది అని చెప్పలేకపోయినా, ఎక్కువ సమయం సెల్ఫోన్లో మాట్లాడటం అంత మంచిది కాదు.

ఈ లక్షణాలు కనిపిస్తే అనుమానించండి..

  • మెదడులో కణితి ఏర్పడిన ప్రాంతాన్ని బట్టి లక్షణాలు ఉంటాయి.
  • సాధారణంగా తలనొప్పి వచ్చి, క్రమంగా పెరుగుతూ ఉండడం
  • ఉదయం లేవగానే తలనొప్పి ఎక్కువగా ఉండటంతో పాటు వాంతులు కావడం
  • వాంతి చేసుకోగానే తలనొప్పి నుంచి ఉపశమనం పొందినట్లు అనిపించడం
  • తలనొప్పి తగ్గగానే సాధారణంగా అనిపించడం
  • చూపులో తేడా రావడం, అస్పష్టంగా కనిపించడం
  • కొన్ని సందర్భాలలో పక్షవాతం రావడం
  • మెదడులో కణితి ఏర్పడిన భాగాన్ని బట్టి శరీరంలో భాగాలు బలహీనపడతాయి.

నిర్ధారణ పరీక్షలు..

బ్రెయిన్ ఎంఆర్ఎస్ఐ ద్వారా బ్రెయిన్ ట్యూమర్ను నిర్ధారించవచ్చు. అందుబాటులో అత్యాధునిక చికిత్సా విధానాలు మెదడులో ఏర్పడిన కణితి రకం, పరిమాణాన్నిబట్టి చికిత్స అధారపడి ఉంటుంది. సాధారణ కణితి అయితే రేడియో సర్జరీ లేదా శస్త్రచికిత్స చేసి కణితిని తొలగిస్తారు. కణితి పరిమాణం 3 సెంటీ మీటర్ల కంటే తక్కువగా ఉంటే శస్త్రచికిత్స లేకుండా రేడియే సర్జరీ ద్వారా కణితిని తొలగించవచ్చు. కణితి పరిమాణం 3 సెంటీ మీటర్ల కంటే ఎక్కువగా తప్పనిసరిగా శస్త్రచికిత్స అవసరమవుతుంది. క్యాన్సర్ కణితులను తొలగించడానికి తప్పనిసరిగా శస్త్రచికిత్స నిర్వహించాల్సి ఉంటుంది. దాంతో పాటు కీమోథెరఫీ, రేడియేషన్ వంటివి అవసరమవుతాయి.

సర్జరీలలో విప్లవాత్మక మార్పులు..

మెదడుకు ఆపరేషన్ అంటే గతంలో ఎన్నో భయాలు.. మరెన్నో అపోహలు ఉండేవి. సర్జరీ తర్వాత మాట పడిపోతుందని, పక్షవాతం వచ్చే అవకాశం ఉంటుందని అనుకునేవారు. ప్రస్తుతం సురక్షితమైన శస్త్రచికిత్స ప్రక్రియలు అందుబాటులోకి వచ్చాయి. గతంతో పోల్చితే బ్రెయిన్ సర్జరీలలో శస్త్రచికిత్స ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం అత్యాధునిక న్యూరో నావిగేషన్ విధానంలో శస్త్రచికిత్స నిర్వహించడం. ద్వారా మెదడులోని ఇతర భాగాలు దెబ్బతినకుండా కణితిని తొలగించగలుగుతున్నారు. న్యూరో నావిగేషన్ విధానంలో సర్జరీకి ఒక రోజు ముందే ఆపరేషన్ థియేటర్లో అమర్చి ఉన్న అత్యాధునిక ఇన్ఫ్రా డెడ్ కెమెరాలలో రోగి మెదడులో ఎక్కడెక్కడ ఏయే ప్రాంతాలు ఎలా ఉన్నాయి..? ఏ ప్రాంతంలో కణితి ఉందో తదితర వివరాలన్నింటినీ ఒక మ్యాప్లోగా అమర్చుతారు. సర్జరీ రోజున రోగిని ఆపరేషన్ థియేటర్కు తీసుకెళ్లగానే తలకు కెమెరాలను అనుసంధానించిన ఫ్రేము అమరుస్తారు. దాంతో మెదడు ఏ ప్రాంతంలో ఉన్నారో సర్జన్ కచ్చితంగా తెలుసుకోగలుగుతారు. కాబట్టి మెదడులోని మిగతా భాగాలు దెబ్బతినకుండా సురక్షితంగా కణితిని తొలగించగలుగుతారు. ఈ విధానంలో తప్పు జరిగే ఆస్కారమే ఉండదు. గతంలో చిన్న కణితులను తొలగించాల్సి ఉన్నా, తల మీద పెద్ద ప్రాంతం తెరవొచ్చి వచ్చేది. ఇప్పుడు నావిగేషన్, సహాయంతో కచ్చితంగా కణితి ఉన్న ప్రాంతం ఎక్కడో గుర్తించి, అక్కడే తెరిచి సురక్షితంగా దానిని తొలగించవచ్చు.

రోగితో మాట్లాడుతూనే సర్జరీ..

మెదడులోని కీలకమైన ప్రాంతంలో శస్త్రచికిత్స నిర్వహించాల్సి వస్తే, రోగిని స్పృహలో ఉంచి, రోగితో మాట్లాడుతూ సర్జరీ నిర్వహిస్తారు. సర్జరీకి కొన్ని రోజుల ముందుగానే రోగికి పూర్తిగా కౌన్సిలింగ్ ఇచ్చి సర్జరీ సమయంలో ఎలా మాట్లాడాలో శిక్షణ ఇస్తారు. సర్జరీ ప్రారంభించే ముందు రోగికి మత్తు మందు ఇచ్చి మెదడులోని కణితి తొలగించవసిన ప్రాంతాన్ని తెరుస్తారు. అనంతరం సర్జరీ సమయంలో ప్రత్యేక మందులు ఇచ్చి రోగిని స్పృహలోకి తీసుకువచ్చి, రోగితో మాట్లాడుతూ, చేతులు, కాళ్లు కదపమని, అంకెలు లెక్కించమని సూచిస్తూ శస్త్రచికిత్స నిర్వహిస్తారు. సర్జరీ సమయంలో రోగి మాటల్లో తేడా కనిపిస్తే వెంటనే వైద్యులు అప్రమత్తమవుతూ సురక్షితంగా మెదడులోని మిగతా భాగాలు దెబ్బతినకుండా శస్త్రచికిత్స నిర్వహించగలుగుతారు. మెదడులోని కీలకమైన ప్రాంతానికి చేరుకునే సమయంలో ప్రత్యేక మందుల ద్వారా రోగికి స్పృహలోకి తీసుకువచ్చి మాట్లాడిస్తారు. ఆ ప్రాంతంలో శస్త్రచికిత్స పూర్తయిన వెంటనే మళ్లీ రోగి మత్తులోకి వెళ్లేలా ప్రత్యేక మందులు ఇస్తారు. ఈ విధానంలో ఒక పక్క సర్జరీ చేస్తూ మరో పక్క రోగితో మాట్లాడుతూ మెదడులోని ఆ భాగం నియంత్రించే పనులు సమర్థవంతంగా జరుగుతున్నాయా.? లేదా..? తెలుసుకుంటారని విజయవాడలోని డాక్టర్ కామినేని ఆస్పత్రి.. సీనియర్ న్యూరోసర్జన్..  సాలుమూరి ప్రేమ్ చంద్ వివరించారు.