Last Updated:

Visakhapatnam Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్‌కు ప్రత్యేక ప్యాకేజీ..రూ.11,500 కోట్లు ఇవ్వాలని కేంద్రం నిర్ణయం!

Visakhapatnam Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్‌కు ప్రత్యేక ప్యాకేజీ..రూ.11,500 కోట్లు ఇవ్వాలని కేంద్రం నిర్ణయం!

Central Govt Good News To Vizag Steel Plant: ఆర్థికంగా నష్టాల్లో ఉన్న రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌- పరిరక్షణకు కేంద్రం సిద్ధమైంది. అయితే విశాఖ స్టీల్‌ ప్లాంట్ ప్రస్తుతం ఆర్థికంగా, నిర్వహణ లో నష్టాలను చవిచూస్తోంది. దీన్ని అధిగమించేందుకు భారీగా సాయం అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర కేబినెట్‌ గురువారం సమావేశం జరగగా.. స్టీల్‌ ప్లాంట్‌ అంశంపై చర్చించారు. ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు సమాచారం.

రూ.11,500 కోట్ల ప్రత్యేక ప్యాకేజీ..
రూ.11,500 కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ప్రత్యేక ప్యాకేజీ ద్వారా స్టీల్‌ ప్లాంట్‌ను నడిపేందుకు సిద్ధమైనట్లు సమాచారం. విధివిధానాలను కేంద్ర ఉక్కుశాఖ మంత్రి కుమారస్వామి శుక్రవారం వెల్లడించే అవకాశం ఉంది. ఇటీవల సీఎం చంద్రబాబు ప్రధాని మోదీని కలిసినప్పుడు విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు ఆర్థిక ప్యాకేజీ అందించాలని కోరిన విషయం తెలిసిందే. స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేట్ పరం కాదని గతంలోనే కేంద్ర మంత్రి కుమారస్వామి వెల్లడించారు. స్టీల్‌ ప్లాంట్‌ పరిరక్షణ మార్గాలపై పలుమార్లు మంత్రిత్వశాఖ చర్చలు జరిపింది. కాగా, నష్టాలను ఎదుర్కొంటున్న విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేసేందుకు కేంద్రం నిర్ణయించగా.. దీనికి వ్యతిరేకంగా కార్మికులు గత కొంతకాలంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సెయిల్‌లో విలీనం చేయాలి..
సెయిల్‌లో విలీనం చేయాలన్న డిమాండ్‌ను కూడా కార్మిక సంఘాలు చేస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో ఎన్డీయే కూటమి అధికారంలోకి రావడంతో కార్మికుల ఆశలు చిగురించాయి. విశాఖ ఉక్కు పరిరక్షణకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని వివిధ సందర్భాల్లో సీఎం చంద్రబాబు ప్రకటించారు. స్టీల్‌ ప్లాంట్‌ పరిరక్షణకు కేంద్రం సిద్ధం కావడంతో ప్రత్యేక ప్యాకేజీ విధివిధానాలు ఎలా ఉంటాయన్న అంశంపై కార్మిక వర్గాల్లో ఆసక్తి నెలకొంది.