Iran- Israel War: అమెరికా దాడులతో పెరిగిన చమురు ధరలు

Crude Oil Prices Hike: ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. ఇరుదేశాల మధ్య యుద్ధంలోకి తాజాగా అమెరికా ఎంట్రీ ఇవ్వడంతో వాతావరణం మరింత ఉధృతంగా మారింది. ఇరాన్ లోని అణుకేంద్రాలే లక్ష్యంగా అగ్రరాజ్యం బాంబుల వర్షం కురిపిస్తోంది. హర్మూజ్ జల మార్గాన్ని మూసివేసేందుకు ఆ దేశం సమాయత్తమవుతోంది. ప్రపంచ చమురు మార్కెట్ కు అడ్డాగా ఉన్న హర్మూజ్ జలసంధిని మూసివేయాలని ఇరాన్ నిర్ణయించుకుంది. అందుకు ఆ దేశ పార్లమెంట్ ఆమోదం తెలిపింది. దీనిపై సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.
తాజా పరిణామాలతో చమురు ధరలు 2 శాతానికి పైగా పెరిగాయి. ప్రస్తుతం బ్రెంట్ ఆయిల్ ధర 2.7 శాతం పెరిగి బ్యారెల్ కు 79.12 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. అయితే అమెరికాలో ముడి చమురు ధర 2.8 శాతం పెరిగి 75.98 డాలర్లకు చేరుకుంది. అలాగే ఇరాన్- ఇజ్రాయెల్ యుద్ధం, అమెరికా ప్రవేశంతో ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్లు తీవ్రంగా ఒత్తిడికి గురవుతున్నాయి. ముఖ్యంగా ఆసియా మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు భారత్ పై కూడా ప్రభావంపై ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి.
కాగా హర్మూజ్ జలసంధి ప్రపంచ ఇంధన వనరులకు అత్యంత కీలకమైన మార్గం. దీనిద్వారా అత్యధికంగా చమురు రవాణా అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా రోజువారీ చమురు, గ్యాస్ అవసరాల్లో 20 శాతం ఈ హర్మూజ్ ద్వారానే రవాణా అవుతుంది. అరేబియా సముద్రంలో ఒమన్ కు చెందిన ఓ ద్వీపకల్పానికి, ఇరాన్ కు మధ్య ఉన్న ఇరుకైన జలసంధే హర్మూజ్ జలసంధి. ఈ మార్గం గుండా రోజు సగటున రెండు కోట్ల బ్యారెళ్ల చమురు, 29 కోట్ల క్యూబిక్ మీటర్ల ఎల్ఎన్జీ వివిధ దేశాలకు రవాణా అవుతుంది. ముఖ్యంగా సౌదీ అరేబియా, ఇరాన్, అరబ్ ఎమిరేట్స్, కువైట్, ఇరాక్ నుంచి ఎగుమతి అయ్యే చమురు ఈ మార్గం నుంచి పంపుతారు.