RRR: “ఆర్ఆర్ఆర్” కు ఇంటర్నేషనల్ అవార్డు
దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి లేటెస్ట్ మూవీ “ఆర్ఆర్ఆర్” నెట్ ఫ్లిక్స్ లో వరల్డ్ నంబర్ వన్ గా చాలా వారాలు నిలిచింది. ఈ సినిమా పై ఎంతో మంది హాలీవుడ్ ప్రముఖులు కూడా ప్రశంసల వర్షం కురిపించారు.
Tollywood: దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి లేటెస్ట్ మూవీ “ఆర్ఆర్ఆర్” నెట్ ఫ్లిక్స్ లో వరల్డ్ నంబర్ వన్ గా చాలా వారాలు నిలిచింది. ఈ సినిమా పై ఎంతో మంది హాలీవుడ్ ప్రముఖులు కూడా ప్రశంసల వర్షం కురిపించారు. తాజాగా ఈ సినిమా జపాన్ లో విడుదల అవడంతో సినిమాను ప్రమోట్ చేసేందుకు ఎన్టీఆర్, రామ్‌చరణ్‌తోపాటు చిత్ర దర్శకుడు ఎస్.ఎస్ రాజమౌళి అక్కడికి వెళ్లారు. ఇప్పుడు ఈ సినిమా తొలి అంతర్జాతీయ అవార్డును కైవసం చేసుకుంది.
“సాటర్న్ అవార్డ్స్” 50వ వార్షికోత్సవంలో ఆర్ఆర్ఆర్ ఉత్తమ అంతర్జాతీయ చిత్రం అవార్డును కైవసం చేసుకుంది. శాటర్న్ అవార్డ్స్ ది అకాడమీ ఆఫ్ సైన్స్ ఫిక్షన్, ఫాంటసీ & హారర్ ఫిల్మ్స్ ద్వారా రూపొందించబడింది. ఇది కళా ప్రక్రియలో అత్యుత్తమమైన వినోదాన్ని సత్కరిస్తుంది. ఈ అవార్డుల కార్యక్రమంలో గుర్తింపు పొందడం చాలా పెద్ద విజయంగా భావిస్తారు. దీనిపై రాజమౌళి హర్షం వ్యక్తం చేసారు. ఆర్ఆర్ఆర్కు ఉత్తమ అంతర్జాతీయ చిత్రం అవార్డు లభించినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇది నా రెండవ సాటర్న్ అవార్డు, బాహుబలి: ది కన్క్లూజన్కి నేను మొదటిసారి అవార్డు గెలుచుకున్నాను. నేను ఆర్ఆర్ఆర్ను ప్రమోట్ చేయడానికి జపాన్‌లో ఉన్నందున, దురదృష్టవశాత్తు, నేను ఈవెంట్‌కు వ్యక్తిగతంగా హాజరు కాలేకపోతున్నాను అని అన్నారు.
మరోవైపు ఆర్ఆర్ఆర్ ఆస్కార్‌కు నామినేట్ కావడానికి ప్రయత్నిస్తోంది. అదే సమయంలో ఇది అనేక ఇతర ప్రముఖ అవార్డులు మరియు ఫిల్మ్ ఫెస్టివల్స్‌కు పంపబడుతోంది. ఈ చిత్రం భవిష్యత్తులో మరిన్ని అవార్డులను అందుకునే అవకాశముంది.