Eruvaka Pournami Pooja: ఈ రోజే విశ్వావసు ఏరువాక పౌర్ణమి.. పూజా విధానం, ప్రత్యేకతలు!
Eruvaka Pournami Today: పుణ్యభామి, కర్మభూమి, బంగారు భూమి మన జన్మభూమి. పాడి పంటలతో, పసిడి రాసులతో కళకళలాడే ఈ పవిత్ర భూమిలో అధిక శాతం మందికి సాయం అందించేది వ్యవసాయమే. నాగలితో నమస్కరించి, పారలతో ప్రణమిల్లి గుప్పెడు ధాన్యం చల్లతే..పాల పొంగులా నదీమ తల్లులు జలసిరులు అందిస్తాయి. కుప్పలు తెప్పలుగా మన ధరణి పంటలు అందిస్తుంది. రామపాదంలా భావించే రైతుపాదం బంగరు భూమిపై పడే పవిత్ర దినమే ఏరువాక పున్నమి. గతంలో ఓ సినీ గేయ రచయిత అన్నదాత గురించి అద్భుత రీతిలో రచన చేశారు. ఓ తెలుగు చలన చిత్రంలో ఈ పద సంపద అంతా ఉపయోగించి అన్నదాత వైభవాన్ని తెలియజేశారు.
అన్నదాతకు, ఏరువాక పౌర్ణమికి అవినాభావ సంబంధం ఉంది. జేష్ట శుద్ద పౌర్ణమి రోజున ఏరువాక పౌర్ణమి వేడుకలతో అన్నదాతలు వ్యవసాయ పనులకు శ్రీకారం చుడతారు. కాడెద్దులకు ప్రత్యేక పూజలు చేసి..దుక్కి దున్నడానికి రైతన్నలు ఉద్యుక్తులవుతారు. తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి వత్సరం జేష్ట శుద్ధ పౌర్ణమి పర్వదినాన్ని ఏరువాక పౌర్ణమిగా కీర్తిస్తాం. వ్యవసాయ ప్రధాన దేశంలో సాగుకు సంబంధించి ప్రధానం రెండు పర్వదినాలు ఉంటాయి. ఒకటి ఏరువాక పౌర్ణమి కాగా రెండోది మకర సంక్రమణ పర్వదినాల్లో వచ్చే కనుమ పండుగ. మూగజీవాలకు ప్రత్యేక పూజలు, అలంకరణలు చేసి..కర్షకులు తమ పంటలు పండించడానికి సంసిద్ధం అవుతారు.ప్రకాశవంతమైన పూర్ణ చంద్రుని కాంతివంత రూపాన్ని పౌర్ణమి అంటారు. శుక్ల పక్షంలో చంద్రుడు నిండు శోభతో దర్శనమిచ్చే తిథి పౌర్ణమి.
రోమన్ చక్రవర్తుల పేరిట వచ్చిన ఆంగ్ల క్యాలెండర్లను మనం పాటిస్తున్నాం. జూలియస్ సీజర్.. జూలై నెల అని, ఆగస్టీయన్ ఆగస్ట నెల అని..ఇలా ఆంగ్ల క్యాలెండర్ ఆ నాటి రోమ్ సామ్రాజ్య చక్రవర్తుల పేరిట వచ్చిందని చరిత్ర మనకు చెబుతోంది. అయితే, ఈ క్యాలెండర్లో తేదీలు, వారాలు తప్ప.. తిథులు, వారాలు, నక్షత్రాలు అన్ని మనకు చెందినవే ఉంటాయి. ఈ తిథులు, వార, నక్షత్రాలు, యోగ, కరణాలు అనుసరిస్తూ మనం పండుగలు, పర్వదినాలు చేసుకుంటున్నాం. ఈ రీతిన చేసుకునే పండువల్లో రైతుల పండువ, పశువుల పండువ, ప్రక్రుతి పండువ, తొలకరి జల్లుల పండు ఏరువాక పౌర్ణమికి గొప్పపేరు ఉంది.
ఏరువాక పౌర్ణమి వేడుక అనాదిగా వస్తోంది. వేదకాలం నుంచి ఈ వేడుక ఉన్నట్టు పురాణాలు చెబుతున్నాయి. అధర్వణ వేదంలో ఏరువాక ప్రస్తావన ఉండగా, విష్ణుపురాణం ఏరువాక వేడుకను సీతాయజ్ఞంగా తెలిపిందని పురాణ ప్రముఖులు తెలిజేస్తున్నారు. చారిత్రక ఆధారాలను బట్టీ ఏరువాక కు ఎంతో ప్రాధాన్యం ఉన్నట్టు తెలుస్తోంది. గాథాసప్తశతిలో ఏరువాక కథాగాథలు ఉన్నట్టు చరిత్ర పరిశోధకులు చెబుతున్నారు. రత్నాలు రాసులుగా పోసి విక్రయించే రాయల వారి కాలంలో రైతన్న ఏరువాక వేడుక ఉన్నట్టు చరిత్ర వెల్లడిస్తోంది. విశ్వావసు వత్సరంలో జూన్ 11 వ తేదీన జేష్ట పౌర్ణమి తిథి వచ్చింది. ఈ రోజునే రైతన్నలు ఏరువాక పౌర్ణమిని నిర్వహించుకుంటున్నారు.
ఏరువాక పౌర్ణమి విశిష్టత వేదాల్లో, పురాణాల్లో, ఇతిహాసాల్లో, ఉపనిషత్తుల్లో.. ఇలా అన్ని చోట్ల కనిపిస్తుంది. విష్ణుపురాణంలో ఏరువాక పౌర్ణమిని సీతా యజ్ఞంగా పేర్కొన్నారు. సీత అంటే నాగలి అనే అర్థం ఉందని, నాగలి యజ్ఞం అంటే వ్యవసాయ యజ్ఞం ఆరంభించే రోజు అని పండిత పెద్దలు తెలియజేస్తున్నారు. ఏరువాక పౌర్ణమి రోజున పాటించాల్సిన నియమాలను, పాటించకూడని పద్ధతులను పెద్దలు తెలియజేశారు.
ప్రక్రుతి శోభిత పౌర్ణమిగా పేరొందిన ఏరువాక పౌర్ణమి నాడు పూర్ణ చంద్రుడు ఉల్లాసంగా కన్పిస్తాడని మరియు భూమాత అనుగ్రహానికి చంద్రోత్సాహం దోహదం అవుతుందని పెద్దలు తెలియజేస్తున్నారు. త్రికరణశుద్ధిగా ఈ రోజున చేపట్టే పనులు విజయవంతం అవుతాయని, పనులు వాయిదా, సోమరితనం ప్రదర్శించడం అనర్థదాయకమని చెబుతున్నారు. ఏరువాక పౌర్ణమినాడు చేసే దైవ ప్రార్థనలకు ద్విగుణీక్రుత ఉత్తమ ఫలితాలు లభిస్తాయని తెలియజేస్తున్నారు. జేష్ట పూర్ణిమ రోజున జుట్టు కత్తిరింపు, గోళ్ల కత్తిరింపు చేయరాదని అంటున్నారు. ఈ రోజున ప్రతికూల ఫలితాలు ఇచ్చే రంగుల వినియోగం తగదని అంటున్నారు. నలుపు నిషేధమని ఆకుపచ్చ యోగ్యదాయకమని చెబుతున్నారు. తులసీవనంలో, తులసి కోట వద్ద ఈ పున్నమి దినా పూజలు చేయాలి తప్ప పత్రాలు తెంచరాదని అంటున్నారు.
పురాణపరంగా, చారిత్రకంగా, సాహిత్యపరంగా, ఆది కాలం నుంచి ఏరువాక పేరు ప్రముఖంగా వినబడుతోంది. రైతన్న కష్టం అందరికి అరిష్టం. అన్నదాత క్షేమం, అందరికి సంక్షేమం. రైతన్న దుక్కి, దున్ని వ్యవసాయం ప్రారంభించే దినం అందరికీ సుదినం. కోటి విద్యలు కూటి కోసమే, తిండి కలిగితే కండ కలుగుతుంది, కండ కలవాడే మనిషి..ఇలా, ఎందరో మహనీయులు అన్నదాత గొప్పదనాన్ని తమ దైన రీతిలో వర్ణించారు. దశాబ్దాల క్రితం ఎప్పుడో వచ్చిన చిత్రంలోని ఏరువాక పాట ఇప్పటికీ నిత్యనూతనంగానే కర్ణప్రియంగా వినబడుతూనే ఉంటుంది. అదే…ఏరువాక సాగారో రన్నో చిన్నన్నా, నీ కష్టమంతా తీరునురో రన్నో చిన్నన్నా… అనే గేయం. ఆకాశం నుంచి వర్షపు చినకులు రాలుతుంటే.. రైతన్న ఆనందభాష్పాలు రాలుస్తూ..దుక్కి దున్నడంలో లీనమయ్యాడు.