Last Updated:

Good Education for Students: భారం లేని బోధనతోనే విద్యార్థులకు భవిష్యత్తు

Good Education for Students: భారం లేని బోధనతోనే విద్యార్థులకు భవిష్యత్తు

Good Education for Students: పాఠశాల తరగతి గదిలోనే దేశ భవిష్యత్తు నిర్మితమవుతుందంటూ మాజీ భారత రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం చెప్పిన మాట అక్షర సత్యం. ఏ దేశాభివృద్ధి అయినా ఆ దేశ మానవ వనరుల నాణ్యతపైనే ఆధారపడి ఉంటుంది. నాణ్యమైన మానవ వనరులు కావాలంటే నాణ్యమైన విద్య, శిక్షణ అనివార్యం. దీనికోసం అన్నివర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందాల్సి ఉంది. మనిషి ఆలోచన, అవగాహన, ఆచరణ ఈ మూడింటికీ అవినాభావ సంబంధం ఉంది. బడిలో చేరిన చిన్నారి మనసులో ఏదైనా ఆలోచన వచ్చినప్పుడు, దానిని వివరించి చెప్పే ఓపిక, చెప్పాలనే సంకల్పం అక్కడి టీచర్లలో ఉండి తీరాలి. అదీ.. ఆ చిన్నారి ఆలోచనా పరిధిలోనే జరగాలి. ఆ వయసు పిల్లలకు సిద్ధాంతాలకు బదులు బొమ్మలు, ఇతర రూపాలలో చెబితే ఆ అంశం, దాని సారం సులువుగా చిన్నారుల బుర్రకెక్కుతుంది. అయితే, నేడు దేశవ్యాప్తంగా సాగుతున్న బోధన ఇందుకు భిన్నంగా ఉంటోంది. నిపుణుల లెక్క ప్రకారం.. ఎనిమిదేళ్లు నిండే సరికి మాతృభాషలోని సమాచారాన్ని స్పష్టంగా చదవగలగాలి. కానీ, దేశంలోని సగం మంది పదేళ్ల వయసు పిల్లలు సైతం అందులో విఫలమవుతున్నారు. దాదాపు 57 శాతం బాలబాలికలు ప్రాథమిక స్థాయిలో నేర్పించే లెక్కలు చేయలేక గుడ్లు తేలేస్తున్నారు. ఎల్‌కేజీ నుంచి ఇంగ్లిష్ మీడియంలో చదువుతున్న విద్యార్థులు సైతం వ్యాకరణ దోషాలు లేకుండా సులభమైన వాక్యాలు చెప్పలేకపోతున్నారు. సామర్థ్య లోపంతో పిల్లలు పాఠాలు నేర్వలేకపోతున్నారా? లేక వారికి బోధించే టీచర్ల లోపమా? అనే ప్రశ్న వేసుకుంటే.. నాసిరకం విద్యా బోధనే ఇందుకు కారణమని తేలుస్తోంది.

దేశంలోని ప్రాథమిక విద్యావ్యవస్థలో సమూల మార్పులు తెచ్చేందుకు జాతీయ విద్యావిధానంలో భాగంగా.. స్ట్రెంతెనింగ్ టీచింగ్ లెర్నింగ్ అండ్ రిజల్ట్స్ ఫర్ స్టేట్స్‌(స్టార్స్) అనే ప్రాజెక్టును కేంద్రం నాలుగేళ్ల నాడు తీసుకొచ్చింది. ప్రపంచ ప్రమాణాలు- భారతీయ విలువల కలగలుపుగా వచ్చిన ఈ ప్రాజెక్టు ద్వారా దేశంలోని చిన్నారులకు ఉత్తమ వ్యక్తిత్వం, మానవ విలువలు, ఉత్తమ పౌరుడి లక్షణాలు అలవడటంతో బాటు మార్కుల ఒత్తిడి లేకుండా చిన్నారి చదువును ఆస్వాదించగలిగే వాతావరణాన్ని కల్పించాలని కేంద్రం ఉద్దేశం. అదే సమయంలో టీచర్లు ఎలాంటి ఆంక్షలు విధించకుండా, ఆనందకరమైన బోధనా పద్ధతుల ద్వారా చిన్నారులకు చదువు నేర్పటం, తరగతిలో తాము బందీలుగా ఉన్నామనే భావన చిన్నారుల్లో కలగకుండా ఉండేందుకు సృజనాత్మకమైన పోటీలు, ఆటపాటలతో వారి శారీరక, మానసిక ఆరోగ్యం బాగుండేలా చూడటమూ మరో అంశం. అలాగే, పిల్లల క్రియేటివిటీ, భావవ్యక్తీకరణ నైపుణ్యాలను లింక్ చేసి, వృత్తి విద్యల దిశగా వారిని నడిపించాలనే సంకల్పమూ ఇందులో ఉంది. అయితే, ఈ ప్రాజెక్టు లక్ష్యం గొప్పదే అయినా, ప్రభుత్వ పాఠశాలల్లో అందుకు తగిన కనీస సౌకర్యాలు, ఆహ్లాదకరమైన వాతావరణం లేకపోవటంతో ఈ ప్రాజెక్టు ఆశించిన ఫలితాలను అందించలేకపోయింది.

మరోవైపు.. తొలిసారిగా బడిలో అడుగు పెట్టే పిల్లలకు దేశంలోని పాఠశాల్లో అనుకూలమైన, ఆకట్టుకునే వాతావరణం లోపిస్తోంది. అప్పటివరకు అమ్మ ఒడిలో ఆటపాటలతో కాలం గడిపిన చిన్నారికి బడిలో తాను స్వేచ్ఛను కోల్పోతున్నాననే బెంగ వేధిస్తుంది. తోటి పిల్లలు పరిచయమై, వారితో సావాసం ఏర్పడే వరకు ఆ దిగులుతోనే పిల్లలు బడికి పోమని మారాం చేస్తుంటారు. ఈ దిగులు తీరి, ప్రాథమిక విద్యకు వచ్చేసరికి వీపున పుస్తకాల బరువు, మార్కులు ఒత్తిడి పెరుగుతున్నాయి. కొందరు తోటి పిల్లలు అభ్యసనంలో బాగా ముందుకు పోతుంటే తమకు ఆ విషయం అర్థం కాక, అది అర్థం కాలేదని ధైర్యంగా చెప్పలేక, ఏదోలా బట్టీ పట్టి తమ చదవును అంతంతమాత్రంగా నెట్టుకుపోతున్న విద్యార్థుల సంఖ్య ప్రాథమిక స్థాయిలోనే సగానికి పైగా ఉంది. ఏ వయసు పిల్లలకు ఎంత చదువు అవసరం? దానిని వారికి ఒత్తిడిలేకుండా బోధించటం ఎలా? అనే అంశంపై మన ప్రభుత్వాలు గత ఎనిమిది దశాబ్దాల కాలంలో నిపుణుల చేత నివేదికలు తెప్పించుకున్నప్పటికీ, ఆ నివేదికల్లోని ఏ ఒక్క సలహా, సూచన కూడా వందశాతం అమలులోకి రాకపోవటం దురదృష్టం. పద్నాలుగేళ్ల నాడే.. 2010లో కేంద్రీయ విద్యాలయ సంఘటన్ దేశంలో 891 పాఠశాలల్లో సంచుల బరువు లేకుండా చూసే ప్రయత్నాన్ని ప్రారంభించినా, అది ఆశించిన మేర ఆచరణలోకి రాలేదు.

మార్కులకే తప్ప జీవికకు పనికి రాని విద్య నేడు.. మన సమాజానికి పెద్ద తలనొప్పిగా మారుతోంది. పాఠాలు బట్టీ కొట్టి అప్పటికి.. అప్పజెప్పటం, రాయటానికే నూటికి సగం మంది విద్యార్థులు అలవాటు పడిపోతున్నారు. దీనిమూలంగా క్రమంగా సమాజంలో సొంతగా ఆలోచించగల వారి సంఖ్య తగ్గిపోతోంది. మార్కులు, ర్యాంకుల ఒత్తిడి ముందు పిల్లలోని సహజత్వం, సున్నితమైన ఆలోచనలు, సృజనాత్మకత మాయమై వారు యాంత్రికంగా విద్యను అభ్యసిస్తున్నారు. మరో దురదృష్టకరమైన అంశం ఏమిటంటే.. పాఠాలను సరిగా అర్థం చేసుకోవటం, పరీక్షల్లో మంచి మార్కులు పొందడం అనేవి రెండు వేర్వేరు అంశాలని, ఈ రెండింటికీ లింకు పెట్టటం సరికాదనే అవగాహన టీచర్లు, తల్లిదండ్రులకూ లేకుండా పోవటం. దీంతో తమ పిల్లలకు మంచి మార్కులు రావటం లేదంటూ ..తల్లిదండ్రులు టీచర్ల మీద ఒత్తిడి తీసుకురావటం, ఆ ఒత్తిడిని తట్టుకోలేక.. ఆ విద్యార్థి సామర్థంతో నిమిత్తం లేకుండా టీచర్లు రొడ్డకొట్టుడు చదువులను పిల్లల మీద రుద్దటం జరుగుతోంది. దీంతో పిల్లల మానసిక వికాసం, అవగాహనా సామర్థ్యం అడుగంటిపోతోంది. అలాగే, తమ ఆసక్తికి తగిన కోర్సులను చదువుకునే అవకాశం పిల్లలకు లేకుండా పోవటం, అయిష్టంగా తల్లిదండ్రుల కోసం ఏదో అంశానికే వారు పరిమితం కావటం జరుగుతోంది. ఈ పరిస్థితిని గుర్తించి, విద్యార్థులు, టీచర్లు, తల్లిదండ్రులు, నిపుణులను సమన్వయ పరచే ప్రయత్నం నేడు జరగాల్సిన అవసరం ఎంతో కనిపిస్తోంది. అదే సమయంలో టీచర్లు సైతం నిత్యం కొత్త విషయాలు తెలుసుకుని, వాటిని పిల్లలకు చెప్పే ప్రయత్నమూ నిజాయితీగా అన్ని స్థాయిలలో జరగాలి. దీనిని తమ సామాజిక బాధ్యతగా టీచర్లు గుర్తించాలి. పరీక్షల్లో మార్కులు, ర్యాంకుల కంటే.. విద్యార్థుల మెదళ్లలో కొత్త ఆలోచనల మొలకలు వచ్చేలా మన బోధన మారాల్సి ఉంది. ఈ కొత్త ఏడాదిలోనై ఈ ప్రయత్నం జరుగుతుందని ఆశిద్దాం.