Bandi Sanjay: కేసీఆర్ కుటుంబానికి రేవంత్ సర్కారు రక్షణ కవచంలా మారిపోయింది. బండి సంజయ్

Bandi Sanjay Comments On Kcr And Revanth Reddy : కాళేశ్వరం విషయంలో ఏం జరుగుతుందో అందరికీ తెలుసని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. కేసీఆర్ కుటుంబానికి రేవంత్‌రెడ్డి సర్కారు రక్షణ కవచంలా మారిపోయిందంటూ ఆరోపించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఏ ఒక్క స్కామ్‌లో కనీస చర్యలు లేకపోవడమే అందుకు సాక్ష్యమన్నారు. అందుకే వచ్చే ఎన్నికల్లో బీజేపీకి అవకాశం ఇవ్వాలని తెలంగాణ ప్రజలు డిసైడ్ అయ్యారని తెలిపారు.
కాళేశ్వరం కేసీఆర్ కుంటుంబానికి ఏటీఎంలా మారిందని ఆరోపించారు. నిజాయితీగా 11 ఏళ్ల నుంచి మోదీ పాలన చేస్తున్నారని తెలిపారు. మోదీ నుంచి అమిత్ షా వరకు కాళేశ్వరం ఏటీఎంలా మారిందని చెప్పారన్నారు. కాళేశ్వరం అవినీతి, అక్రమాలతో కూడిన ప్రాజెక్టు అని ఆరోపించారు. కాళేశ్వరంలోని పనిచేసిన అధికారులే 100 కోట్లు సంపాదించుకున్నారన్నారు. అవినీతిపై విచారణను రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అధికారులకే పరిమితం చేయొద్దని కోరారు. సీడబ్ల్యూసీ 1986 నుంచి 2013 వరకు 160 టీఎంసీల నీటి లభ్యత ఉందని, కేసీఆర్ కుటుంబానికి నీటి లభ్యత ఎందుకు కనిపించలేదని బండి ప్రశ్నించారు.
రిపోర్టు ప్రకారం కాళేశ్వరం ప్రాజెక్టు కడితే 38 వేల కోట్లలో కడితే, ఇవాళ లక్షా 20 వేల కోట్లు అయ్యేవా?. జాతీయ హోదా ఇస్తే కేంద్రం పరువు పోయేదన్నారు. సిగ్గు లేకుండా జాతీయ హోదా అడుగుతున్నారని ఫైర్ అయ్యారు. ఎన్డీఎస్ఏ తాగి కూర్చున్న కమిటీ కాదని, చట్టబద్ధంగా ఏర్పడిన కమిటీ అన్నారు. కేబినెట్‌లో ఎప్పుడు పెట్టారు?. ఎప్పుడు సబ్ కమిటీ నివేదిక ఇచ్చింది?. ఎప్పుడు ప్రాజెక్టు ప్రారంభించారో రేవంత్‌రెడ్డి సర్కారు ఎందుకు బయటపెట్టడం లేదన్నారు. కాళేశ్వరం లేకున్నా ఇవాళ పంట దిగుబడి ఎందుకు పెరిగిందో బీఆర్ఎస్ చెప్పాలని డిమాండ్ చేశారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత విచారణ చేయరని, సీబీఐకి అప్పగించరని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.