Telangana Congress: రసాభాసగా కాంగ్రెస్ సమీక్షా సమావేశం.. మంత్రి పదవి కావాలని మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ డిమాండ్
Ex MP Anjan Kumar Yadav Demand for Minister position: హైదరాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం గాంధీభవన్‌లో ఏఐసీసీ తెలంగాణ ఇన్ చార్జీ దీపాదాస్ మున్షీ నిర్వహించిన సమీక్షా సమావేశం రసాభాసగా ముగిసింది. ఈ సమావేశంలో మాట్లాడుతూ.. ముస్లింలు కాంగ్రెస్‌లో ఉంటూనే ఎంఐఎంకు ఓటేస్తారని కాంగ్రెస్ సీనియర్ నేతలు వీహెచ్, అంజన్ కుమార్ యాదవ్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ మైనారిటీ నేతలు మండిపడ్డారు.
నాకు బెర్త్ ఇవ్వాల్సిందే..
ఈ సందర్భంగా మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ స్పందించారు. తాను చేసిన వ్యాఖ్యల్లో అబద్ధమేమీ లేదని స్పష్టం చేశారు. గతంలో తనకు ఎదురైన అనుభవాలనే తాను చెప్పానని క్లారిటీ ఇచ్చారు. ఆరునూరైనా ఈసారి తనకు మంత్రి పదవి ఇచ్చి తీరాల్సిందేనని ఆయన గట్టిగా ప్రకటించారు. కాగా, అంజన్ కుమారుడికి రాజ్యసభ ఎంపీగా అవకాశం ఇచ్చారని, ఇంకా మంత్రి పదవా అంటూ కొందరు నేతలు నిలదీయగా.. ‘ఒక కుటుంబానికి ఒకే పదవి అనే రూల్ ఏమైనా ఉందా?’ అని అంజన్ కేకలేశారు. ఒకవైపు మైనారిటీ నేతల నినాదాలు, మరోవైపు అంజన్ అనుచరుల వీరంగాల మధ్య సమావేశం రసాభాసగా మారగా, దీనికి హాజరైన తెలంగాణ ఇన్‌చార్జ్ దీపాదాస్ మున్షీ సీరియస్ అయ్యారు.
గ్రేటర్‌లో దమ్మున్న లీడరే లేడు: మున్షీ
అనంతరం ఆమె మాట్లాడుతూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. గ్రేటర్ హైదరాబాద్‌లో దమ్మున్న కాంగ్రెస్ లీడర్ ఒక్కరూ లేరని, కేటీఆర్, హరీష్ రావులకు కౌంటర్ ఇవ్వడం ఎవరికీ చేతకావటం లేదని మండిపడ్డారు. దీనికి కొనసాగిస్తూ… హైదరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ చాలా వీక్‌గా ఉంది. ఇక్కడి పబ్లిక్ కూడా చాలా చీప్‌గా ఉన్నారు. వంద, రెండు వందలిస్తే మీటింగ్‌కు వచ్చేస్తారు అని దీపాదాస్ మున్షీ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.