Last Updated:

Chenchus: తెలుగు రాష్ట్రాల్లో నల్లమల్ల అటవీ ప్రాంతం.. వందల ఏళ్లుగా అడవిలోనే చెంచులు జీవనం

Chenchus: తెలుగు రాష్ట్రాల్లో నల్లమల్ల అటవీ ప్రాంతం.. వందల ఏళ్లుగా అడవిలోనే చెంచులు జీవనం

Chenchus Living at Nallamala Forest Since 100 Years: తెలుగు రాష్ట్రాల్లో విస్తరించిన నల్లమల్ల అటవీ ప్రాంతంలో వందల ఏళ్లుగా ఆదిమ మానవుడి ఆనవాళ్లున్న చెంచులు జీవిస్తున్నారు. మనదేశంలో బాగా వెనకబడిన తెగల్లో ఒకటైన చెంచులను వేగంగా అంతరించి పోతున్న తెగలలో ఒకటిగా యునెస్కో ప్రకటించింది. పేరుకు చెంచులు దక్షిణాసియా ఆదిమ తెగలలో ఒకరైనా, వీరి ఉనికి నల్లమలకే పరిమితమైందని చెప్పాలి. దేశంలోని చెంచుల సంఖ్య 80 వేలుగా ఉండగా, ఎగువ నల్లమల జిల్లాలైన ఉమ్మడి మహబూబ్ నగర్, దిగువనున్న కర్నూలు, ప్రకాశం జిల్లాలలో వీరి ఉనికి కనిపిస్తుంది. రాష్ట్రాల పరంగా ఆంధ్రప్రదేశ్‌లో 56 వేలు, తెలంగాణలో 20 వేల వరకు చెంచులున్నారు. తమిళనాడు, కర్ణాటక, ఒడిసా, కేరళ, పుదుచ్చేరి, మహారాష్ట్రలోనూ వీరి ఉనికి ఉన్నప్పటికీ అది 2 వేలకు మించి లేదు. తెలుగు రాష్ట్రాలు వీరిని షెడ్యూల్డు తెగలుగా గుర్తించగా.. ఒడిసా సంచార జాతుల్లోకి చేర్చింది.

మిగిలిన గిరిజన, ఆదివాసీలు దేశంలో పలు ప్రాంతాలలో కనిపిస్తుండగా, చెంచులు మాత్రం శ్రీశైలం అభయారణ్యపు పరిధికే పరిమితమయ్యారు. అత్యంత అవసరమైతే తప్ప ప్రధాన జీవన స్రవంతితో సంబంధాలు పెట్టుకోవటానికి ఇష్టపడని చెంచులు.. క్రూరమృగాలు జీవించే నల్లమల అభయారణ్యంలో నేటికీ తమదైన సంస్కృతిని నిలబెట్టుకుంటూ అచ్చమైన మనుషులుగా జీవనాన్ని కొనసాగిస్తున్నారు. చెంచులు ఏ పూటకాపూట వేటాడి తెచ్చుకున్నది తినటమే తప్ప రేపటి గురించి ఆలోచించటానికి, రేపటి కోసం దాచుకోవటానికి ఇష్టపడరు. బయటి వ్యక్తులతో మాట్లాడటానికి బిడియపడే ఈ తెగకు తమ కుటుంబం, బంధుత్వాలే లోకం.

ఎంతో అభివృద్ధి సాధించిన ఆధునికుల్లో నేటికీ ఆడపిల్లలంటే చెప్పలేనంత వివక్ష సాగుతోండగా, చెంచుల్లో ఇది ఇసుమంతైనా కనిపించదు. కుటుంబ నిర్వహణలో ఎవరి బాధ్యతలు వారివే. ఇక్కడ ఎవరు ఎక్కువ అనే ప్రశ్నే లేదు. వీరిలో బహుభార్యత్వమూ నేటికీ అమలవుతోంది. పెళ్లిలో కట్నకానుకలు అడిగే సంప్రదాయమూ లేదు. అనాదిగా వచ్చే ఆచారం ప్రకారం ఆ కుటుంబానికున్న పశుసంపద నుంచి ఆవుదూడనో, మేకపిల్లనో కట్నగా ఇవ్వటమే ఉంటుంది. పెళ్లి తర్వాత వారికి వేరే గుడిసె వేసి, స్వతంత్ర జీవనానికి అవకాశం కల్పిస్తారు. నల్లమల నుంచి సేకరించిన వంట చెరకునే నేటికీ వంటకు, క్రూర మృగాల నుంచి రక్షించుకోవటానికి నెగళ్లు వేసుకోవటానికి చెంచులు వాడుతున్నారు. అడవిలో విరిగిపడి, ఎండిన చెట్లనే కొట్టుకుంటారు తప్ప పచ్చని చెట్టు జోలికేపోరు. అటవీ సంపదను అవసరానికి మించి వాడుకోవటం, నాశనం చేయటం వీరికి సుతరామూ ఇష్టముండదు. పైగా, తమవంతుగా అటవీ సంపదకు, వన్యప్రాణులకు రక్షణ కల్పిస్తారు. నేటికీ మన నల్లమల్ల వందల ఏళ్లుగా నిత్యనూతనంగా వర్థిల్లుతోందంటే అదంతా చెంచుల పుణ్యమే. నల్లమల ప్రాంతంలోని 3728 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని కేంద్రం ఎన్‌టీసీఏ(నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ)కి అప్పగించటం, దేశంలో అతిపెద్ద టైగర్ రిజర్వ్ కూడా ఇదే కావటంతో ఆ ప్రాంతంలోని చెంచులు.. అటవీ అధికారుల ఆంక్షలకు లోబడి జీవించాల్సి వస్తోంది.

చెంచులకు ప్రధానవృత్తి వేట. అయితే, అభయారణ్యంలో వేట నిషేధం కనుక వారు అటవీ ఉత్పత్తులను తమ ఆహారంలో భాగంగా చేసుకుంటున్నారు. అటవీ ప్రాంతంలో వాటిని సేకరించేందుకు వెళ్లే క్రమంలో ఆత్మరక్షణకు విల్లులు, గొడ్డళ్ల వంటివి వెంటతీసుకుపోతుంటారు. అడవిలో దొరికే విప్పపువ్వు, చింతకాయ, పలు దుంపలు, తేనె వంటివి సేకరించుకోని వాడుకోవటం, కోళ్లు, బాతులు, మేకలు, ఆవులు పెంచుకుంటూ తమ ఆహార అవసరాలు తీర్చుకుంటున్నారు. నల్లమల ప్రాంతమంతా ఐదో షెడ్యూల్ కిందకు రావటంతో, అక్కడి భూమిని గిరిజనులకూ పంపిణీ చేసే ఛాన్స్ లేదు. అయితే, 2008 నాటి భూపంపిణీ చట్టం ప్రకారం.. చాలామందికి చెంచులకు పండించుకుని తినండంటూ.. వారసత్వ పట్టాలు ఇచ్చారు. దీంతో పేరుకే వీరికి భూమి ఉంది. ఈ భూముల్లో కొందరు రాగులు, జొన్నలు, సజ్జలు, కొర్రలు పండించుకుంటున్నారు. అయితే, అడవి దుప్పులు, జింకలు, కోతులు, అడవి పందుల దెబ్బకి వారికి పెద్దగా దక్కేదేమీ ఉండకపోవటంతో 90 శాతం చెంచులు తమ భూములను ఏనాడో వదిలేశారు. కొన్నిచోట్ల గ్రామాలకు ఆనుకుని ఉన్న చెంచు పెంటల వద్ద కొందరికి సర్కారీ భూమి దక్కినా, అది ఏనాడో భూస్వాములు, వడ్డీ వ్యాపారుల పాలైంది. దీంతో చెంచుపెంటల వద్ద కల్పించే ఉపాధి హామీ పనులు, సేకరించే అటవీ ఉత్పత్తుల అమ్మకమే వీరికి ఆదాయ వనరుగా ఉంది.

ప్రకృతి మధ్య నివసించే చెంచులు తీవ్రమైన పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. అడవిలో నిరంతరం ఉండే దోమపోటు కారణంగా తరచూ మలేరియా, వైరల్ ఫీవర్లు, డెంగ్యూ బారిన పడుతున్నారు. ఇవిగాక క్షయ, చర్మవ్యాధులూ వీరిలో ఎక్కువగా ఉన్నాయి. తలాపిన కృష్ణమ్మ పారుతున్నా, నేటికీ వీరికి చెంచు పెంటల సమీపంలోని చెలమల్లోని నీటినే తాగుతున్నారు. ఇక సాయంత్రమైతే పురుషులంతా ఇప్పసారా తాగటం సర్వసాధారణం కావటంతో ప్రాణాంతక జబ్బుల బారినా పడి ప్రాణాలు కోల్పోతున్నారు. కుటుంబ నియంత్రణ అంటే పెద్దగా పట్టింపులేని కారణంగా చెంచుమహిళలు.. ఐదుగురి నుంచి ఎనిమిది పిల్లల్ని కనటంతో, మహిళల ఆరోగ్యం బాగా దెబ్బతింటోంది. మరోవైపు, సంప్రదాయ విద్య అంటే నేటికీ చెంచులు విముఖత చూపుతున్నారు. అందుకే చెంచు ప్రాంతాల్లో ప్రభుత్వం పెట్టిన పాఠశాలల్లో చెంచుల పిల్లలు పెద్దగా కనిపించరు. తమ పిల్లలు వేగంగా పరిగెడతారని, గురిచూసి బాణాలు ప్రయోగిస్తారని, కనుక క్రీడలు, అథ్లెటిక్స్ వైపు ప్రోత్సహించే పాఠశాలలు పెడితే బాగుంటుందని కాస్తో కూస్తో చదువుకున్న చెంచులు అభిప్రాయపడుతున్నారు. అలాగే, తమ ప్రాంతంలో ప్రభుత్వం బడులు పెడితే, చెంచులనే టీచర్లుగా నియమించాలని వారు కోరుతున్నారు. ప్రభుత్వం తమకేమీ ఇవ్వనవసరం లేదని, తమ మానాన తమను బతకనిస్తే చాలనే ధోరణిలోనే నేటికీ చెంచులు తమ జీవనయానం సాగిస్తున్నారు.