Israel Attack: గాజాపై ఇజ్రాయెల్ దాడుల్లో 72 మంది మృతి

Gaza Strip: గాజాలో ఇజ్రాయెల్ మళ్లీ దాడులు చేసింది. శుక్రవారం రాత్రి నుంచి నిన్న ఉదయం వరకు నిరంతరాయంగా కాల్పులు జరిపింది. దాడుల్లో కనీసం 72 మంది మరణించారణి గాజా ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య వారం రోజుల్లో కాల్పుల విరమణ ఒప్పందం కుదురుతుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన కొన్ని గంటల్లోనే ఇజ్జాయెల్ దాడులు చేసింది.
ఈ ఏడాది జనవరిలో ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. అయితే హమాస్ ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ఆరోపిస్తూ మార్చిలో ఇజ్రాయెల్ మళ్లీ దాడులు ప్రారంభించింది. కాగా హమాస్ దగ్గర ఇంకా 50 మంది బందీలు ఉన్నారు. వాళ్లందరినీ విడిచిపెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని హమాస్ ప్రకటించింది. అయితే హమాస్ దగ్గరున్న ఆయుధాలన్నీ అప్పగించాలని, ఆ సంస్థను బహిష్కరించాలని ఇజ్రాయెల్ డిమాండ్ చేస్తోంది.
అయితే ఆహార పంపిణీ కేంద్రాల వద్దకు వచ్చే పాలస్తీనా ప్రజలపై కాల్పులు జరపాలని సైన్యానికి ఇజ్రాయెల్ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందని గాజా ఆరోపించింది. ఇలా ఇప్పటికే 500 మందిని చంపేసిందని తెలిపింది. ఆహారం కోసం సహాయక కేంద్రాల వద్దకు వెళ్తున్న తమపై ఇజ్రాయెల్ సైన్యం కాల్పులు జరుపుతోందని ప్రజలు వాపోయారని చెప్పింది.