Srinidhi Shetty: సీత పాత్రను పోగొట్టుకున్న హిట్ 3 భామ.. వచ్చి ఉంటేనా..?

Hit 3 Heroine Srinidhi Shetty Loose Seetha Role in Bollywood Ramayana: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అమ్మ వస్తుంది అంటూ కేజీఎఫ్ 2 సినిమాలో ఆమె చెప్పిన డైలాగ్ ను ఫ్యాన్స్ ఎప్పటికీ మర్చిపోలేరు. అంత పెద్ద హిట్ సినిమాలో నటించినా కూడా శ్రీనిధికి ఒరిగింది ఏం లేదు. ఆ సినిమాతో వచ్చిన స్టార్ డమ్ అవకాశాలను తీసుకొచ్చి పెట్టిందేమో కానీ, విజయాలను మాత్రం అందించలేకపోయింది.
ఇక ప్రస్తుతం ఈ చిన్నది తెలుగులో హిట్ 3 సినిమాతో అడుగుపెడుతోంది. మొదట అమ్మడు తెలుసు కదా సినిమాలో ఎంట్రీ ఇచ్చింది. కానీ, దానికన్నా ముందే హిట్ 3 రిలీజ్ అవుతుంది కాబట్టి. ఇదే ఆమె మొదటి తెలుగు సినిమా. గత కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా శ్రీనిధినే కనిపిస్తుంది. హిట్ 3 ప్రమోషన్స్ లో నానితో పాటు అమ్మడు చాలా యాక్టివ్ గా తిరుగుతుంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో శ్రీనిధి.. బాలీవుడ్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న రామాయణంలో సీత పాత్రను కోల్పోయినట్లు చెప్పుకొచ్చింది.
రణబీర్ కపూర్ రాముడిగా.. సాయిపల్లవి సీతగా.. యశ్ రావణుడిగా నటిస్తున్న ఈ సినిమాపై బాలీవుడ్ మాత్రమే కాదు.. టోటల్ చిత్రపరిశ్రమ మొత్తం ఎదురుచూస్తుంది.ఇక ఈ సినిమాలోని సీత పాత్రకు శ్రీనిధి కూడా ఆడిషన్స్ వెళ్లిందట. రెండు మూడు సీన్స్ ప్రాక్టీస్ చేసి మరీ .. అమ్మడు ఆడిషన్స్ కు వెళ్లిందట. తనతో పాటు అలియా భట్ ను కూడా సీత పాత్రకు తీసుకోవాలని మేకర్స్ అనుకున్నారట. కానీ, చివరికి సీత పాత్ర సాయిపల్లవికి దక్కింది. దీంతో శ్రీనిధి ఆశలు అడియాశలు అయ్యాయి. అయినా కూడా శ్రీనిధి బాధపడలేదట. సాయిపల్లవి సీత పాత్రకు బెస్ట్ ఛాయిస్ అని అనుకున్నట్లు ఆమె తెలిపింది.
ఒకవేళ సీత పాత్ర కనుక ఈ చిన్నదానికి దక్కి ఉంటే.. కేజీఎఫ్ లో రొమాన్స్ చేసిన యశ్, శ్రీనిధి.. ఈ సినిమాలో బద్ద శత్రువులుగా కనిపించేవారు. సీతను ఎత్తుకుపోయిన రావణుడు… చివరకు రాముడి చేతిలో హతమవుతాడు. అంటే శ్రీనిధికి యశ్ శత్రువే కదా. ఏదిఏమైనా ఒక మెతుకు మీద తినేవారి పేరు రాసిపెట్టి ఉంటుందని అన్నట్లు.. ఏ పాత్ర ఎవరికి రాసి ఉంటుందో వారికే దక్కుతుంది అని చెప్పొచ్చు. మరి శ్రీనిధి హిట్ 3 తో హిట్ అందుకొని తెలుగులో సెటిల్ అవుతుందో లేదో చూడాలి.