TRS: ఐలమ్మ విగ్రహం సాక్షిగా.. టీఆర్‌ఎస్‌లో భగ్గుమన్న విభేదాలు
చాకలి ఐలమ్మ విగ్రహ ఆవిష్కరణ సాక్షిగా పటాన్‌చెరు టీఆర్ఎస్ రాజకీయం రసకందాయంలో పడింది. చిట్కుల్‌లో జరిగిన చాకలి ఐలమ్మ విగ్రహ ఆవిష్కరణకు మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు హజరు కాకపోవడం టీఆర్‌ఎస్‌లో గ్రూప్ విభేదాలను మరోసారి బట్టబయలు చేసింది.
Patancheru: చాకలి ఐలమ్మ విగ్రహ ఆవిష్కరణ సాక్షిగా పటాన్‌చెరు టీఆర్ఎస్ రాజకీయం రసకందాయంలో పడింది. చిట్కుల్‌లో జరిగిన చాకలి ఐలమ్మ విగ్రహ ఆవిష్కరణకు మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు హజరు కాకపోవడం టీఆర్‌ఎస్‌లో గ్రూప్ విభేదాలను మరోసారి బట్టబయలు చేసింది. టీఆర్‌ఎస్ నేత, చిట్కుల్ సర్పంచ్ నీలం మధును రాజకీయంగా దెబ్బకొట్టేందుకే మంత్రులు రాకుండా పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి చక్రం తిప్పారన్న టాక్ వినిపిస్తోంది.
పటాన్‌చెరు నియోజకవర్గంలోని చిట్కుల్‌లో చాకలి ఐలమ్మ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ప్రోగ్రామ్ సక్సెస్ కావడంతో టీఆర్‌ఎస్ నేత, సర్పంచ్ నీలం మధు వర్గంలో జోష్ పెరిగింది. సర్పంచ్ స్థాయి వ్యక్తే అయినప్పటికి పార్టీ కార్యకర్తలను, వివిధ సామాజిక వర్గాలను సభకు రప్పించడంలో నీలం మధు సక్సెస్ అయ్యారనే టాక్ వినిపిస్తోంది. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాటను కాదని, పార్టీకి చెందిన చాలామంది టీఆర్‌ఎస్ నాయకులు చాకలి ఐలమ్మ విగ్రహ ఆవిష్కరణకు కార్యక్రమానికి వెళ్లలేదు. దీంతో స్థానిక టీఆర్‌ఎస్‌లో గ్రూపు రాజకీయాలు చాకలి ఐలమ్మ విగ్రహం సాక్షిగా బయటపడ్డాయి. అయితే మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ ఆ కార్యక్రమానికి హజరుకావడం కూడా టీఆర్‌ఎస్‌లో ఉన్న విభేదాలను మరోసారి బయటపెట్టింది.
పటాన్‌చెరు నియోజకవర్గంలో చాకలి ఐలమ్మ విగ్రహ ఆవిష్కరణ ర్యాలిలో నీలం మధు చేసిన హంగామా స్థానికంగా చర్చనీయాంశమైంది. భారీ ర్యాలీతో పాటు మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు కటౌట్లు కార్యకర్తలతో జోష్ పెంచాయి. నీలం మధు అంతా తానై ఆ ప్రోగ్రామ్ నడిపించారు. అటుఫ్లెక్సీల తొలగింపులోనూ రాజకీయం చోటుచేసుకుంది. ఔటర్ రింగ్ రోడ్డులో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను జిహెచ్ఎంసి అధికారులు తొలగించడంతో నీలం మధు వర్గీయులు మండిపడుతున్నారు. రోజుల తరబడి ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, ఆయన సోదరుడి ఫ్లెక్సీలు రోడ్ల పై ఉన్నా అధికారులు పట్టించుకున్న పాపానపోలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నీలం మధు పెట్టిన మంత్రులు కేటీఆర్,హరీశ్‌రావు ఫ్లెక్సీలు తొలగించడం పై వారు అధికారులతో వాగ్వివాదానికి దిగారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆదేశాల మేరకే అధికారులు పనిచేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు.
మొత్తం మీద ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, నీలం మధు మధ్య పొలిటికల్ వార్ మరింత ముదిరింది. టీఆర్‌ఎస్‌లో గ్రూప్ రాజకీయాలను పీక్స్‌లోకి తీసుకెళ్తోంది. ఇప్పటికైనా టీఆర్‌ఎస్ అధిష్టానం జోక్యం చేసుకొని రెండు వర్గాల మధ్య సయోధ్య కుదుర్చాలని కార్యకర్తలు కోరుతున్నారు.