Last Updated:

China Auto Industry: మొత్తం వీళ్ల వాహనాలదే హవా.. ఈవీ మార్కెట్‌ను శాసిస్తున్న డ్రాగన్ కంట్రీ..!

China Auto Industry: మొత్తం వీళ్ల వాహనాలదే హవా.. ఈవీ మార్కెట్‌ను శాసిస్తున్న డ్రాగన్ కంట్రీ..!

China Auto Industry: గత పదేళ్లలో ప్రపంచ ఆటోమొబైల్ మార్కెట్లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఒకప్పుడు ప్రజలు డీజిల్, పెట్రోల్ వాహనాలను ఎక్కువగా కొనేవారు. ఆ తర్వాత వచ్చిన సిఎన్‌జిలు కూడా అనుకున్నంత స్థాయిలో విక్రయాలు జరిపేవి. అయితే ఇప్పుడు కొత్తగా విడుదల అవుతున్న వాటిలో ఎక్కువగా ఎలక్ట్రిక్ వాహనాలే ఉంటున్నాయి. తరచూ పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు భరించలేక తక్కువ ధరలో ఎక్కువ రేంజ్ అందించే ఈవీలను కొనడానికి ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం చాలా ఈవీ తయారీ సంస్ధలు మార్కెట్లో ఉన్నాయి. వీటిలో దిగ్గజ కంపెనీల నుంచి పలు మధ్యస్థ స్థాయి కంపెనీలు వరకు ఉన్నాయి. వాటన్నింటిలో చైనాకు చెందిన కంపెనీలు ముందంజలో ఉన్నాయి.

ఇటీవల విడుదల అయిన Rho Motion డేటా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలలో చైనా టాప్ ప్లేస్‌లో నిలిచింది. చైనాకి చెందిన ప్రముఖ ఈవీ బ్రాండ్లు గ్లోబల్ ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లో 76 శాతం వాటాను కలిగి ఉన్నాయి. ఇక్కడ మరో ముఖ్యమైన విశేషం ఏమిటంటే చైనా, యునైటెడ్ స్టేట్స్‌లో ఒక్క కారును కూడా అమ్మకుండానే ఈ మైలురాయికి చేరుకుంది.

సాధారణంగా వాహనాల వినియోగం అమోరికాలో ఎక్కువగా ఉంటుంది. అమెరికాలో చాలా కంపెనీలు తమ మోడళ్లను విక్రయిస్తున్నాయి. ఇది ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద కార్ల మార్కెట్‌. అలానే అత్యంత లాభాలను అందించే దేశం కూడా. అయితే చైనా కంపెనీలు అమెరికాలో తమ కార్లను విక్రయించకుండానే వేరే దేశాల్లో చేసిన అమ్మకాల ద్వారానే మొత్తం ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాల్లో ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలవడం విశేషం.

చైనా ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కంపెనీలు తమ ఫోకస్‌ను యునైటెడ్ స్టేట్స్‌లో కాకుండా ఇతర దేశాలపై పెట్టారు. ముఖ్యంగా తక్కువ అభివృద్ధి చెందిన దేశాల్లో అక్కడి ప్రజలకు అనుకూలంగా ఉండేలా బడ్జెట్ ధరల్లో తమ ఈవీ కార్లను విడుదల చేస్తున్నాయి. చైనా కంపెనీలు సక్సెస్ అవ్వడానికి ఇదే కారణం. ఇక్కడి విక్రయించి ఎక్కువ లాభాలను పొందాయి. చైనా తమ కంపెనీలను ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్నాయి.

భారత్‌లో కూడా చైనా ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీలు తమ ప్రాబల్యాన్ని చూపిస్తున్నాయి. ఇక్కడ మొత్తం ఈవీల అమ్మకాల్లో చైనా కంపెనీల వాటా దాదాపు 23 శాతం. గతేడాది జర్మనీలో అమ్ముడైన మొత్తం 578,000 ఈవీలలో డ్రాగన్ కంపెనీల వాటా 4 శాతం. యూకేలో 7 శాతం, బెల్జియంలో 3 శాతం, ఫ్రాన్స్‌లో 5 శాతంగా ఉన్నాయి.

అయితే కొన్ని దేశాల ఈవీ అమ్మకాల్లో చైనా వాటా ఏకంగా 90 శాతానికి పైనే ఉంది. ఇదే ప్రపంచ ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లో చైనా దూసుకుపోవడానికి ప్రధాన కారణం. ఆయా దేశాల్లో స్థానికంగా ఈవీ తయారీ లేకపోవడంతో డ్రాగన్ కంపెనీలు తమ కార్లను విదేశాలకు ఎగుమతి చేస్తున్నాయి.