కరోనా : భారత్‌కు ముంచుకొస్తున్న ముప్పు… వేగంగా వ్యాపిస్తున్న కరోనా బీఎఫ్ 7 వేరియంట్
Corona : కోవిడ్ మళ్లీ భయపెట్టేందుకు రెడీ అయ్యింది. కరోనా ఫోర్త్ వేవ్ ప్రమాదం పొంచి ఉందన్న సంకేతాలు వినిపిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ కేసులు పెరుగుతుండడంతో భారత్ అప్రమత్తమైంది. ఇప్పటి నుంచే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, తద్వారా కోవిడ్ ను నియంత్రించవచ్చని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది.
తాజాగా పరిస్ధితులపై ఇప్పటికే కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించగా… ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. గతంలో కోవిడ్ కేసులు అధికంగా ఉన్న సమయంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ… నేరుగా పర్యవేక్షించడంతో పాటు… అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సంప్రదించిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో దేశంలో తాజా పరిస్థితులపై అత్యున్నత స్థాయి అధికారులతో పీఎం మోదీ సమీక్ష నిర్వహించనున్నారు. దేశంలో నమోదవుతున్న కేసులు, పరీక్షలు జరుగుతున్న తీరును ప్రధాని అధికారులను అడిగి తెలుసుకోనున్నారు. కరోనా నియంత్రణకు తీసుకోవల్సిన చర్యలపై ప్రధాని మోదీ దిశానిర్ధేశం చేసే అవకాశం ఉంది. ఈ క్రమంలో కోవిడ్ ఫోర్త్ వేరియంట్ కు సంబంధించి కోవిడ్ కేసులను జినోమ్ సీక్వెన్సింగ్ చేయాలని దేశంలోని అన్ని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలను కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆదేశాలు జారీ చేసింది.
చైనా, దక్షిణ కొరియా, జపాన్ అమెరికా దేశాల్లో కోవిడ్ కేసులు పెరుగుతుండటంతో భారత్ అప్రమత్తమైంది. ఇప్పటికే కోవిడ్ నియంత్రణకు అవసరమైన చర్యలను తీసుకుంటున్న కారణంగా తీవ్ర ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్య, ఆరోగ్య నిపుణులు వెల్లడించారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మాత్రం ప్రమాదం పొంచి ఉందంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా వారానికి దాదాపు 35 లక్షల కొత్త కేసులు నమోదవుతుండగా… దేశంలో వారానికి 1200 కేసులు నమోదవుతున్నట్లు కేంద్ర ప్రభుత్వ గణాంకాలు తెలియజేస్తున్నాయి. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, లేకపోతే రెండేళ్ల నాటి పరిస్థితులు తప్పవని వైద్యులు హెచ్చరిస్తున్నారు.