Fire accident in Hotel Park Hyatt: సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు బస చేస్తున్న పార్క్ హయత్‌లో అగ్నిప్రమాదం.. ఆందోళనలో ఫ్యాన్స్!

Fire accident in Park Hyatt hotel which SRH team Staying: హైదరాబాద్‌లోని బంజారా హిల్స్ పార్క్ హయత్ హోటల్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో పాటు వేగంగా వ్యాపించాయి. దీంతో గెస్టులు, హోటల్ సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఈ మేరకు అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు.
అయితే, ఐపీఎల్ 2025లో భాగంగా 18వ సీజన్ కొనసాగుతోంది. ఈ మేరకు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ప్రస్తుతం పార్క్ హయత్‌లో బస చేస్తుంది. కాగా, ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్ కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ టీం బయలుదేరేందుకు సిద్ధమయ్యారు. ఈ తరుణంలో మొదటి అంతస్తులో వైరింగ్ సమస్య కారణంగా మంటలు చెలరేగాయని అధికారులు చెబుతున్నారు. సమస్య వచ్చిన వెంటనే మంటలు ఎక్కువగా వ్యాపించకుండా పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చినట్లు వివరించారు. ప్రస్తుతం హోటల్‌లో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని వివరించారు.
ఇదిలా ఉండగా, ఐపీఎల్‌లో భాగంగా ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆడుతున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌ల కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు బంజారాహిల్స్‌లో ఉన్న పార్క్ హయత్ హోటల్‌లో బస చేస్తుంది. ఇక్కడే హోటల్‌లో బస చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు ఇటీవల ముంబైకు బయలుదేరేందుకు రెడీ అవుతున్నారు. ఆటగాళ్లంతా 6వ అంతస్తులో విశ్రాంతి తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా, ఈనెల 17న ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్న సంగతి తెలిసిందే.
ఈ అగ్ని ప్రమాదం నుంచి సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు సురక్షితంగా బయటపడ్డారు. మొదటి అంతస్తులో మంటలు చెలరేగగా.. వీరంతా ఆరో అంతస్తులో ఉన్నారు. అక్కడ ఉన్న సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. ఆటగాళ్లతో పాటు వారి కుటుంబ సభ్యులు, ఇతర సిబ్బందిని అక్కడి నుంచి పంపించారు.
పార్క్ హయత్ హోటల్‌లో అగ్ని ప్రమాదం జరిగిందనే విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ తీవ్ర ఆందోళనకు గురయ్యారు. హోటల్‌లో టూరిస్టులు, సిబ్బంది కొంతమంది ఏకంగా హోటల్ నుంచి భయాందోళనతో బయటకు పరుగులు తీశారు. దీంతో హైదరాబాద్ వ్యాప్తంగా అలజడి నెలకొంది.