Last Updated:

Water Crisis in India: తరుముకొస్తున్న జల సంక్షోభం.. దాహార్తితో అల్లాడుతున్న ప్రధాన నగరాలు!

Water Crisis in India: తరుముకొస్తున్న జల సంక్షోభం.. దాహార్తితో అల్లాడుతున్న ప్రధాన నగరాలు!

Water Crisis in India scorching heatwave and poor: జలం లేకుంటే జీవమే లేదు. సమస్త ప్రాణకోటి మనుగడకు నీరే ప్రధాన ఆధారం. ప్రపంచ నాగరికతలన్నీ నదీ తీరాల వెంటే విలసిల్లాయి. అయితే, ప్రతికూల వాతావరణ పరిస్థితులు, మానవ తప్పిదాల మూలంగా ప్రపంచ వ్యాప్తంగా నీటి వనరులు తగ్గిపోతూ వస్తున్నాయి. ప్రపంచపు అతిపెద్ద జనాభా గల మన దేశంలోనూ ఈ ముప్పు గతంలో కంటే ఇప్పుడు మరింత పెరుగుతోంది. వేసవి రావటానికి ఇంకా 3 నెలలుండగానే దేశంలోని రిజర్వాయర్లకు జలకళ తగ్గిపోతోంది. ఢిల్లీ, ముంబై తదితర ప్రధాన నగరాలు అప్పుడే దాహార్తితో అల్లాడుతున్నాయి. మరోవైపు, ప్రపంచపు అతిపెద్ద జనబలం గల దేశంగా, ప్రపంచ జనాభాలో 18 శాతం వాటా కలిగిన దేశంగా, ప్రపంచపు అతిపెద్ద ఐదవ ఆర్థిక శక్తిగా ఉన్న భారత్…ప్రపంచ జలవనరుల్లో కేవలం 4 శాతం వాటాను మాత్రమే కలిగి ఉంది. దీంతో ఏటా వేసవికి ముందే దేశంలోని పలు ప్రాంతాలు నీటి కటకటను ఎదుర్కొంటున్నాయి. 2050 నాటికి దేశంలో 40 శాతం మందికి నీరు దొరకని పరిస్థితి నెలకొంటుందని పర్యావరణ మార్పులపై ఏర్పాటైన ఇంటర్ గవర్నమెంట్ పానెల్(ఐపీసీసీ) 2023లో నివేదించింది. పర్యావరణ మార్పులు, పెరుగుతున్న డిమాండ్ ఇందుకు కారణాలని విశ్లేషించింది. మరోవైపు మన తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలలో జనవరిలోనే నీటి ఎద్దడి ఛాయలు కనిపిస్తున్నాయి.

ప్రపంచవ్యాప్తంగానూ తగినంత నీటి లభ్యత అనేది ఒక పెద్ద సమస్యగా మారుతోంది. ప్రస్తుతం మూడోవంతు మంది ప్రజలు నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారని గణాంకాలు చెబుతున్నాయి. గత రెండు దశాబ్దాల్లో ప్రపంచవ్యాప్తంగా తలసరి నీటి లభ్యత తగ్గుతూ వస్తోంది. 2001లో ఇది 1,816 క్యూబిక్ మీటర్లుగా ఉండగా, పదేళ్లు గడిచే సరికి అది 1,546 క్యూబిక్ మీటర్లకు పడిపోయింది. 2021 నాటికి తలసరి నీటిలభ్యత 1,367 క్యూబిక్ మీటర్లకు దిగజారటం ఖచ్చితంగా ఆందోళన కలిగించే విషయమే. రానున్న ఏడేళ్లలో తలసరి నీటిలభ్యత 750 క్యూబిక్ మీటర్లకు పడిపోతుందని ప్రపంచ బ్యాంక్ అంచనా. ఏటికేడు తగ్గుతున్న జలవనరుల మూలంగా 2050 నాటికి నీటి ఎద్దడి బారిన పడే దేశాలు తమ జీడీపీలో 6% కోల్పోతాయని కూడా ఆ సంస్థ హెచ్చరిస్తోంది.

మన దేశంలో వర్షాలే ప్రధాన నీటివనరుగా ఉన్నాయి. ఏటా సమయానికి రుతుపవనాలు వస్తేనే మన సాగురంగం నిలకడగా ఉంటోంది. కానీ నాలుగైదేళ్లకోసారి రుతుపవనాలు గతి తప్పటం, వాటి రాకలో అనిశ్చితి, పర్యావరణ మార్పుల కారణంగా మన సాగురంగం కుదేలవుతోంది. మరోవైపు, దేశంలోని అన్ని ప్రాంతాలలో సగటు వార్షిక వర్షపాతం ఒకేలా ఉండటం లేదు. ఈశాన్య భారతంలో ఏటా 1000 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతోంటే.. పశ్చిమ రాజస్థాన్‌లో ఏటా కురిసే వర్షం 10 సెంటీమీటర్లకు మించటం లేదు. వర్షం, మంచుతో సహా 4000 బిలియన్ క్యూబిక్ మీటర్ల(బీసీఎం) వాననీరు లభ్యమవుతోంటే, అందులో 53.3% ఆవిరి రూపంలో పోగా నికరంగా మనకు మిగులుతున్నది 1869 బీసీఎంలే. ఇందులో మనం వాడుకుంటున్నది కేవలం 1123 బీసీఎంలే కాగా, ఆ మిగిలిన 433 బీసీఎంలు భూగర్భజలాలుగా, 690 బీసీఎంలు ఉపరితల జలాల రూపంలో ఉన్నట్లు నీతి ఆయోగ్ నివేదించింది. మరోవైపు.. వేసవిలోనర్మద, గోదావరి, కృష్ణా మొదలైన నదుల పరివాహకంలో పలుచోట్ల నీటి లభ్యత బాగా తగ్గిపోతోంది. కేవలం గంగా, బ్రహ్మపుత్ర నదీ పరివాహకంలోనే ఈ పరిస్థితి లేదు. నదీ పరివాహక ప్రాంతంలో మానవ కార్యకలాపాలు ముమ్మరం కావడం, నదుల్లో మేట పెరిగి, ప్రవాహాలు తగ్గుతున్నాయి. ఇసుక మేట వల్ల డ్యాంల నీటినిల్వ సామర్థ్యం ఏటా 0.95% చొప్పున తగ్గుతున్నట్టు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. వ్యవసాయాధారిత దేశమైనందున నీటివనరుల్లో 90% సాగుకే మళ్లుతోంది. ఎక్కువ నీరు అవసరమయ్యే చెరకు, వరి, అరటి వంటి పంటలూ దేశంలో పెరిగాయి. గత 40 ఏండ్లలో చెరకు సాగు 32%, వరి 6%, అరటి సాగు 129% మేర పెరిగింది.

ఐక్యరాజ్యసమితి గణాంకాల మేరకు బాటిల్డ్ వాటర్‌ను అత్యధికంగా వాడే దేశాల్లో భారత్ 14వ స్థానంలో ఉండగా, విలువపరంగా 12వ స్థానంలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా 2021లో 350 బిలియన్ లీటర్ల నీరు బాటిళ్ల ద్వారా అమ్ముడుపోగా, అందులో 40% అమ్మకాలు అమెరికా, చైనా, ఇండొనేసియాల్లోనే జరిగాయి. వచ్చే ఏడేళ్లలో ప్రపంచవ్యాప్తంగా వాటర్ బాటిల్ అమ్మకాల విలువ 500 బిలియన్ డాలర్లకు చేరనుందని వరల్డ్ బ్యాంక్ అంచనా వేస్తోంది. మరోవైపు, భారత్ సహా వర్థమాన దేశాల్లో బాటిల్డ్ వాటర్ మార్కెట్ పుంజుకుంటోంది. భూగర్భజలాలు వేగంగా పడిపోవటానికి ఇదీ ఓ కారణంగా ఉంది. దేశంలో 9.1 కోట్ల మందికి.. అంటే దాదాపు 6 శాతం జనాభాకు రక్షిత నీరు అందుబాటులో లేదనే వాస్తవాన్ని గుర్తించిన కేంద్రం.. దీనికోసం 2019లో జలశక్తి మంత్రిత్వశాఖను ఏర్పాటు చేసి, నీటికి సంబంధించిన విభాలన్నింటినీ దీని పరిధిలోకి తీసుకొచ్చింది. దేశంలోని 4,378 పట్టణాల దాహార్తిని తీర్చేందుకు 2021-22 బడ్జెట్‌లో ఏకంగా రూ.2.87లక్షల కోట్లు కేటాయించింది. ఇక జల్ జీవన్ మిషన్ పథకం ద్వారా గ్రామాల్లో స్వచ్ఛమైన నీటిని అందించేందుకు 2023-24 బడ్జెట్‌లో రూ. 77,223 కోట్లు కేటాయించింది. భూగర్భజలాల పరిరక్షణ, నదుల అనుసంధానం, వృధాగా సముద్రంలో కలిసే నదీ జలాల వినియోగం మీద కూడా కేంద్రం ఫోకస్ పెంచింది. అయితే, కేంద్రం ప్రకటించిన పథకాలను అందిపుచ్చుకోవటంలో రాష్ట్రాలు విఫలమవటం కూడా దేశంలో నీటి ఎద్దడికి కారణమవుతోంది. వేసవి సమీపిస్తున్న వేళ.. దేశంలో పెరుగుతున్న నీటి అవసరాలు, తగ్గుతున్న జల వనరులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వాలు ఇప్పటినుంచే వేసవి నీటి ఎద్దడి మీద చర్యలు ఆరంభించాల్సి ఉంది. అదే సమయంలో వర్షపు నీటిని ఒడిసిపట్టటం, నీటి వృధాని అరికట్టటం, నీటి పునర్వినియోగం మీద మన దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చైతన్యం రావాల్సి ఉంది. ఆ చైతన్యం మాత్రమే మన దేశాన్ని ఈ సమస్య నుంచి బయటపడేయగలదు.