Service Sector:సేవారంగాన్నీ సమూలంగా సంస్కరించాల్సిందే..!
Service Sector in India: మన దేశం ముందున్న అతిపెద్ద సమస్యల్లో నిరుద్యోగం ఒకటి. ఒకవైపు పెరుగుతున్న జనాభా, మరోవైపు అదే రీతిలో పెరుగుతున్న గ్రామీణ నిరుద్యోగ సమస్యను గుర్తించిన మన ప్రభుత్వాలు మూడు దశాబ్దాలుగా సేవారంగం మీద ఎక్కువగా దృష్టిపెడుతూ వస్తున్నాయి. ఏ దేశ ఆర్థిక వ్యవస్థలోనైనా మూడు ప్రధాన రంగాలుంటాయి. అవి.. ప్రాథమిక రంగం. వ్యవసాయం, పాడి పరిశ్రమ, మత్స్యపరిశ్రమ, గనుల వంటివి దీనికిందికి వస్తాయి. ఇక.. రెండవది ద్వితీయ రంగం. దీనినే వస్తు తయారీ రంగం అని కూడా అంటారు. కుటీర పరిశ్రమల మొదలు.. భారీ పరిశ్రమల వరకు ఈ రంగం కిందికి వస్తాయి. మూడవది.. సేవారంగం. ఐటీ, టెలికాం, ఈ కామర్స్, బీపీఓ, టూరిజం, ఆతిథ్య రంగం, వైద్య చికిత్సలు, స్థిరాస్తి, నిర్మాణ సర్వీసులు, ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్, రిటైల్, హోల్‌సేల్ ట్రేడ్, ట్రాన్స్‌పోర్టేషన్, లాజిస్టిక్స్, ఈ-కామర్స్, ఐటీ, ఔట్ సోర్సింగ్, నిర్వహణ, కన్సల్టెన్సీ సేవలు.. ఇవన్నీ ఈ రంగంలోనివే. సోషలిష్టు భావనల కారణంగా మనదేశంలో 1952- 1991 మధ్యకాలంలో పరిశ్రమల మీదనే ఎక్కువగా ఫోకస్ పెంచి, అవే ఉద్యోగాలిస్తాయని పాలకులు నమ్ముతూ వచ్చారు. అయితే, ప్రపంచీకరణ తర్వాత సేవారంగం వాటా పెరుగుతూ పోవటంతో నేడు ప్రపంచమంతా సేవారంగానికి ఊతమిచ్చే చర్యలకు దిగుతోంది. ప్రపంచపు అతిపెద్ద జనాభా గల మనదేశ జీడీపీలో సేవారంగం వాటా జీడీపీలో 56 శాతంగా ఉండగా, జనాభాలో ఏకంగా 30.7 శాతం ఉద్యోగాలను ఈ రంగం కల్పిస్తోంది. ఈ రంగపు సేవలను విదేశాలకు అందించటం వల్ల మనదేశం భారీగా పెద్దమొత్తంలో విదేశీ మారకద్రవ్యాన్నీ ఆర్జిస్తూ.. జీడీపీపి పెంచుకుంటోంది.
అంతర్జాతీయ మార్కెట్‌కు మన సేవారంగపు ఎగుమతులు పెరగటంతో 2009-10 నుంచి మన జీడీపీ కూడా మంచి వృద్ధి రేటును నమోదు చేస్తోంది. 2009-10లో మన సేవారంగపు ఎగుమతుల విలువ 9,580 కోట్ల డాలర్లుగా ఉండగా, 2023-24 నాటికి ఇది మూడున్నర రెట్లు పెరిగి 34,110 కోట్ల డాలర్లకు చేరింది. సేవా రంగ ఎగుమతుల్లో సాఫ్ట్‌వేర్ ఉత్పత్తుల వాటా సగంగా ఉండగా, 25శాతం అకౌంటింగ్ తదితర వ్యాపార సేవలు ఉన్నాయి. 2010లో వాణిజ్య సేవల ఎగుమతుల్లో భారత్ వాటా 3 శాతంగా ఉండగా, 2023లో అది 4.8శాతానికి చేరింది. ఇప్పుడిప్పుడే పర్యాటకం, హోటల్, వైద్య చికిత్సలు, స్థిరాస్తి, నిర్మాణ సర్వీసులు, ఈ-కామర్స్ తదితరాల వల్ల చేకూరే ఆదాయమూ పెరుగుతోంది. 2022 ఆర్థిక సంవత్సరంలో భారత్‌కు మొత్తం 8,480 కోట్ల డాలర్ల ఎఫ్‌డీఐ లభిస్తే, అందులో 710 కోట్ల డాలర్లు సేవా రంగానికి అందాయి. సేవా రంగ ఎగుమతుల్లో 70శాతానికి సమానమైన మొత్తం, అంటే 10,200 కోట్ల డాలర్లు విదేశాల్లోని భారతీయ కార్మికులు, నిపుణులు తమ కుటుంబాలకు పంపుతున్నారు. ఇక.. ఎఫ్‌డీఐలను అత్యధికంగా అందుకుంటున్న 20 దేశాల్లో భారత్ కూడా ఉంది. మరోవైపు, స్వదేశీ, విదేశీ పెట్టుబడులను పెద్దయెత్తున ఆకర్షించడానికి కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న ఏక గవాక్ష అనుమతి విధానం మంచి ఫలితాలను ఇస్తోంది. 2019- 2021 మధ్య కాలంలో ప్రపంచ పోటీ సూచిలో మన దేశం 43వ స్థానంలో ఉండగా, సేవారంగం కారణంగా 2023 నాటికి ఇది 40వ స్థానానికి ఎదగగలిగింది.
జీడీపీకి 56 శాతం వాటాను అందిస్తున్న సేవారంగం విస్తరణ అనేది సంతోషించాల్సిన విషయమే అయినా, మొత్తం ఉద్యోగాలలో ఈ రంగం వాటా కేవలం 30.7 శాతమేనని పాలకులు గుర్తించాలి. సేవా రంగంలో ఐటీకి దక్కుతున్న ప్రాధాన్యత రిటైల్, టూరిజం, వైద్యసేవలు, బ్యాంకింగ్, ఫైనాన్స్, విద్యావైద్యాలు, రవాణా, టెలికమ్యూనికేషన్లు, ఇంధన విభాగాలకు దక్కటం లేదు. మనదేశంలో మొత్తం 51 కోట్ల మంది ఉద్యోగులుండగా, వారిలో 16 కోట్ల మంది సేవారంగంలో ఉన్నారు. వీరిలో కేవలం 54 లక్షల మందే ఐటీ, ఐటీ ఆధారిత సేవల (ఐటీఈఎస్) రంగంలో పనిచేస్తున్నట్లు 2023-24 గణాంకాలు చెబుతున్నాయి. జీడీపీలో సేవారంగం వాటా 56శాతంగా ఉండగా, అందులో ఐటీ, అనుబంధ సేవల వాటా నేటికీ 8 శాతానికి మించి లేదని గమనించాల్సి ఉంది.
సేవారంగంలో ఐటీ పరిశ్రమ జోరు సాగుతున్న వేళ.. దేశంలో కంప్యూటర్లు, సంబంధిత హార్డ్‌వేర్‌కు గిరాకీ బాగా పెరుగుతోంది. అయితే, డిమాండ్‌కు తగిన తయారీ లేకపోవటంతో మన ప్రభుత్వం.. చైనా వంటి దేశాల నుంచి వాటిని సులభంగా దిగుమతి చేసుకునేలా నిబంధనలను సడలించింది. 2016-17లో 689 కోట్ల డాలర్లుగా ఉన్న ఈ దిగుమతులు 2022-23కల్లా 1414 కోట్ల డాలర్లకు చేరటంతో మన ప్రభుత్వం భారీగా విదేశీ మారక ద్రవ్యాన్ని ఖర్చుపెట్టాల్సి వస్తోంది. ఈ ప్రమాదాన్ని 1968లోనే ఊహించిన హోమీ భాభా కమిటీ దేశీయంగానే కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌ల వంటి హార్డ్‌వేర్ తయారీకి రెడీ కావాలని సిఫార్సు చేసినా, దానిని పట్టించుకోకపోవటంతో ఈ దుస్థితి తలెత్తింది. మరోవైపు.. దేశంలో కంప్యూటర్ హార్డ్‌వేర్ ఉత్పత్తిని పెంచడానికి కేంద్రం..‘ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహక పథకం (పీఎల్‌ఐ) పేరుతో అనేక రాయితీలు ఇస్తున్నా.. వాటిని మన కంపెనీల కంటే.. హెచ్‌పీ, లెనోవో వంటి విదేశీ సంస్థలే సద్వినియోగం చేసుకుంటున్నాయి. పైగా, ఈ విదేశీ కంపెనీలు తమ దేశాల్లో చేసిన విడిభాగాలు తెచ్చి, ఇక్కడ కంప్యూటర్లను బిగించి అమ్ముతున్నాయి తప్ప ఇక్కడే ఆ విడిభాగాలను తయారుచేసేందుకు ముందుకు రావటంలేదు. దీనివల్ల కూడా మనం భారీగా విదేశ మారక ద్రవ్యాన్ని కోల్పోతున్నాము. ఇక.. సాఫ్ట్‌వేర్ రూపకల్పనలోనూ మనదేశం వెనకబడే ఉంది. నేటికీ మన సాఫ్ట్‌వేర్ మార్కెట్లో మైక్రోసాఫ్ట్, శాప్, ఏక్రోబాట్ వంటి విదేశీ కంపెనీల ఆధిపత్యమే నడుస్తోంది. ఈ కంపెనీలన్నీ అతిపెద్ద మార్కెట్‌గా ఉన్న మనదేశంలో తమ ఉత్పత్తులను అమ్ముకుంటూ వాటిపై వచ్చిన లాభాలను, పొందుతున్న రాయల్టీలను తిరిగి తమ దేశాలకు తరలిస్తున్నాయి తప్ప ఇక్కడే పెట్టుబడిగా పెట్టటం లేదు. ఈ నేపథ్యంలో మనం దేశీయంగా నూతన హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ ఉత్పత్తుల రూపకల్పన దృష్టి పెట్టాలి.
మరోవైపు, మన దేశంలో పరిశ్రమల రంగం వాటా కూడా 24.77 శాతానికి పెరిగింది. ఈ నేపథ్యంలో మన ప్రభుత్వం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఎఐ), క్లౌడ్ కంప్యూటింగ్, డేటా అనలిటిక్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఒటి), ఈ- కామర్స్ వంటి అంశాల మీద ఫోకస్ పెట్టాలని, పరిశ్రమలు- సేవారంగం మధ్య సమన్వయం పెరిగితే, ఈ రెండు రంగాలు ఊపందుకుంటుదని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. పరిశ్రమల రంగానికి ఐటీ, ఏఐ వంటి సాంకేతికతలు తోడైతే, ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా మన పారిశ్రామిక ఉత్పత్తులు ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వస్తాయని వారు చెబుతున్నారు. ఇదే సమయంలో గత మూడు దశాబ్దాలుగా పరిశ్రమల రంగం మీద పెట్టుబడులు తగ్గించిన మన ప్రభుత్వాలు, ఆ ఆలోచనను విరమించుకుని ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతోనైనా భారీ పరిశ్రమలను స్థాపిస్తే, అటు ఉద్యోగాల సృష్టి, ఇటు ఐటీయేతర సేవారంగ విభాగాల మీద ఫోకస్ పెరుగుతుందని, దీనివల్ల దేశంలో నిరుద్యోగం తగ్గి, తలసరి ఆదాయం స్థిరంగా పెరుగుతుందని వారు భరోసా ఇస్తున్నారు. ఈ వాస్తవాలను గమనించిన తర్వాతైనే ప్రభుత్వాలు సేవారంగం మీద మరోసారి సమీక్షకు సిద్ధం కావాల్సి ఉంది.