CJI Justice Sanjiv Khanna: సీజేఐగా జస్టిస్ సంజీవ్ ఖన్నా.. ప్రమాణం చేయించిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము
Justice Sanjiv Khanna takes oath as 51st Chief Justice of India: సుప్రీంకోర్టు 51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా సోమవారం ప్రమాణం చేశారు. రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రమాణం చేయించారు. కార్యక్రమానికి ప్రధాని మోడీ, ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్, కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ సహా తదితరులు హాజరయ్యారు. సీజేఐగా జస్టిస్ డి.వై.చంద్రచూడ్ పదవీకాలం ఆదివారంతో ముగియగా, ఆయన స్థానంలో బాధ్యతలు స్వీకరించారు. జస్టిస్ ఖన్నా ఆరు నెలలపాటు సీజేఐగా కొనసాగుతారు. ఆయన పదవీ కాలం వచ్చే ఏడాది మే 13వరకు ముగియనుంది.
న్యాయ వ్యవస్థతో సుదీర్ఘ అనుబంధం
జస్టిస్ సంజీవ్ ఖన్నాకు న్యాయ వ్యవస్థతో సుదీర్ఘ అనుబంధం ఉంది. ఖన్నా 1960 మే 14న జన్మించారు. తండ్రి జస్టిస్ దేవ్‌రాజ్ ఖన్నా ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. జస్టిస్ ఖన్నా ఢిల్లీలోని మోడ్రన్ స్కూల్‌లో చదువుకున్నారు. సెయింట్ స్టీఫెన్స్ కళాశాలలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన క్యాంపస్ లా సెంటర్‌లో న్యాయ విద్యనభ్యసించారు. 1983లో బార్ కౌన్సిల్ ఆఫ్ ఢిల్లీలో అడ్వకేట్‌గా చేరారు. తొలుత తీస్‌హజారీ కాంప్లెక్స్‌లోని జిల్లా కోర్టుల్లో, తర్వాత ఢిల్లీ హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు.
సీనియర్ స్టాండింగ్ కౌన్సిల్ సభ్యుడిగా..
ఆదాయపు పన్ను విభాగంలో సీనియర్ స్టాండింగ్ కౌన్సిల్ సభ్యుడిగా పనిచేశారు. నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (నల్సా) ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా సేవలందించారు. ఢిల్లీ హైకోర్టులో అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా, అమికస్ క్యూరీగా ఎన్నో క్రిమినల్ కేసుల్లో సమర్థంగా వాదించారు. 2005 జూన్ 24న ఢిల్లీ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2019 జనవరి 18న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు.
వివాదాస్పదంగా పదోన్నతి..
హైకోర్టు న్యాయమూర్తుల్లో ఖన్నా కంటే 32మంది సీనియర్లు ఉన్నారు. సీనియర్లను కాదని జస్టిస్ ఖన్నాకు పదోన్నతి దక్కడం వివాదాస్పదంగా మారింది. ఖన్నా నియామకాన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. పలు కీలక తీర్పులు ఇచ్చిన సుప్రీంకోర్టు ధర్మాసనాల్లో జస్టిస్ ఖన్నా సభ్యుడిగా ఉన్నారు. మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని రద్దు చేసిన ధర్మాసనంలో సభ్యుడు. ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లను కొట్టివేశారు.
ఈవీఎం వాడకాన్ని సమర్థించిన ఖన్నా..
ఎల్రక్టానిక్ ఓటింగ్ యంత్రాల వాడకాన్ని ఖన్నా సమర్థించారు. బ్యాలెట్ పేపర్ విధానంలో ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను తిరస్కరించారు. ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేశారు. పెండింగ్ కేసుల పరిష్కారంపై జస్టిస్ సంజీవ్ ఖన్నా ప్రత్యేక శ్రద్ధ చూపుతారని పేరు ఉంది. అనవసరమైన వాయిదాలకు తావు లేకుండా వేగంగా న్యాయం చేకూర్చడంలో దిట్ట అని న్యాయవాద వర్గాలు చెబుతాయి.