Batla House Encounter Case: బాట్లా హౌస్ ఎన్‌కౌంటర్ కేసులో ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2008 బాట్లా హౌస్ ఎన్‌కౌంటర్ కేసులో ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. 15 ఏళ్ల నాటి ఈ కేసులో ఉరిశిక్ష పడిన దోషి, ఇండియన్ ముజాహీదిన్ ఉగ్రవాది ఆరిజ్‌ఖాన్ మరణశిక్షను ధ్రువీకరించేందుకు ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది.
Batla House Encounter Case: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2008 బాట్లా హౌస్ ఎన్‌కౌంటర్ కేసులో ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. 15 ఏళ్ల నాటి ఈ కేసులో ఉరిశిక్ష పడిన దోషి, ఇండియన్ ముజాహీదిన్ ఉగ్రవాది ఆరిజ్‌ఖాన్ మరణశిక్షను ధ్రువీకరించేందుకు ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది. అతడి శిక్షను జీవిత ఖైదుగా మారుస్తున్నట్టు వెల్లడించింది. దిల్లీ పోలీసు ఇన్‌స్పెక్టర్ మోహన్‌చంద్ హత్య, ఇతర అభియోగాలపై రెండేళ్ల క్రితం దిల్లీలోని ట్రయల్ కోర్టు ఆరిజ్‌ఖాన్‌ను దోషిగా తేల్చి మరణశిక్ష విధించిన విషయం తెలిసిందే.
2018లో అరెస్టయిన ఆరిజ్ ఖాన్..(Batla House Encounter Case)
2008 సెప్టెంబరు 13న దిల్లీలోని ఐదు ప్రదేశాల్లో బాంబు పేలుళ్లు జరిగాయి. ఆ ఘటనలో 39 మంది మృతిచెందగా.. మరో 150 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటన జరిగిన ఆరు రోజులకు దిల్లీ స్పెషల్ పోలీసులు కేసు దర్యాప్తులో భాగంగా ఓ ఆపరేషన్ చేపట్టారు. ఇండియన్ ముజాహిదీన్ సంస్థకు చెందిన ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో.. జామియా నగర్‌లోని బాట్లా హౌస్ ప్రాంతంలోని ఓ భవనానికి వెళ్లారు. పోలీసులను చూసి వెంటనే ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఇందులో ఇన్‌స్పెక్టర్ మోహన్‌చంద్ శర్మ అమరుడయ్యారు. పోలీసుల కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మృతి చెందారు. సంఘటనా స్థలం నుంచి ఆరిజ్‌ఖాన్, షాజాద్ అహ్మద్ పరారయ్యారు. ఇందులో షాజాద్‌ను 2010లో పోలీసులు అరెస్టు చేశారు. 2013 జులైలో అతనికి న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. పరారీలోని ఆరిజ్‌ఖాన్‌ను పదేళ్ల తర్వాత 2018లో నేపాల్‌లో అరెస్టు చేసి కోర్టు ముందు హాజరుపర్చారు.
ఆ తర్వాత ఈ కేసుపై విచారణ జరిపిన దిల్లీ ట్రయల్ కోర్టు.. ఆరిజ్‌ఖాన్‌ను దోషిగా తేల్చింది. ఇది అరుదైన కేసుల్లో ఒకటిగా పేర్కొన్న న్యాయస్థానం.. అతడికి మరణశిక్షను ఖరారు చేసింది. దీంతో పాటు 11లక్షల జరిమానా కూడా విధించింది. ఇందులో 10లక్షలను మోహన్‌చంద్ శర్మ కుటుంబానికి ఇవ్వాలని ఆదేశించింది. అయితే, ట్రయల్ కోర్టు ఏ దోషికైనా ఉరిశిక్ష విధిస్తే ఆ తీర్పును హైకోర్టు పరిశీలించి శిక్షను ధ్రువీకరించాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే ఆరిజ్ ఖాన్ శిక్షను ధ్రువీకరించేందుకు హైకోర్టుకు రిఫరెన్స్ రాగా అతడి శిక్షను జీవితఖైదుకు తగ్గిస్తూ నేడు తీర్పు వెలువరించింది.