Andhrapradesh: ఏపీలో ఈ ఒక్కరోజే లబ్దిదారుల ఖాతాల్లో సంక్షేమ పథకాల నిధుల జమ.. ఎందుకో తెలుసా?

విద్యా దీవెన, చేయూత, ఆసరా, ఈబీసీ నేస్తం పథకాల నిధులను ఈ నెల 11 నుంచి 13వ తేదీ వరకు లబ్ధిదారులకు జమచేయవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. శుక్రవారం అనగా 10 వ తేదీ ఒక్కరోజు మాత్రమే లబ్దిదారుల ఖాతాల్లో నిధులు విడుదల చేయాలని కోరింది.

  • Written By:
  • Publish Date - May 10, 2024 / 01:13 PM IST

Andhrapradesh: విద్యా దీవెన, చేయూత, ఆసరా, ఈబీసీ నేస్తం పథకాల నిధులను ఈ నెల 11 నుంచి 13వ తేదీ వరకు లబ్ధిదారులకు జమచేయవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. శుక్రవారం అనగా 10 వ తేదీ ఒక్కరోజు మాత్రమే లబ్దిదారుల ఖాతాల్లో నిధులు విడుదల చేయాలని కోరింది.

నిధుల పంపిణీ ప్రసారం చేయవద్దు.. (Andhrapradesh)

దీనికి సంబంధించి ఈసీ ఈనెల 9న జారీ చేసిన ఉత్తర్వులను 10 వరకు తాత్కాలికంగా పక్కనపెట్టింది. నిధుల పంపిణీకి ఏవిధంగాను ప్రసార మాధ్యమాల ద్వారా ప్రచారం చేయవద్దని స్పష్టం చేసింది. ఎన్నికల సంఘం జారీ చేసిన ప్రవర్తన నియమావళిని అతిక్రమించేలా వేడుకలు నిర్వహించవద్దని తేల్చిచెప్పింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బి.కృష్ణమోహన్‌ గురువారం రాత్రి ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. ప్రధాన వ్యాజ్యాలపై కౌంటర్‌ వేయాలని ప్రతివాదులను ఆదేశించారు. విచారణను జూన్‌ 27కి వాయిదా వేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏజీ శ్రీరామ్‌ వాదనలు వినిపిస్తూ.. ఇవేవీ కొత్త పథకాలు కావన్నారు. నిధుల లభ్యతను బట్టి సొమ్మును లబ్ధిదారుల ఖాతాల్లో జమచేస్తామన్నారు. నిధుల పంపిణీకి అనుమతి కోరుతూ స్క్రీనింగ్‌ కమిటీ పంపిన ప్రతిపాదనకు సకాలంలో నిర్ణయం వెల్లడించకుండా ఈసీ జాప్యం చేసిందన్నారు. నిధుల జమకు అనుమతివ్వాలని కోరారు.

ఈ నెల 13న పోలింగ్‌ తేదీ ముగిసే వరకు రైతులకు పెట్టుబడి రాయితీ, విద్యా దీవెన, చేయూత, ఆసరా, ఈబీసీ నేస్తం పథకాల సొమ్ము రూ.14,165 కోట్లను లబ్ధిదారుల ఖాతాల్లో జమచేయకుండా నిలువరిస్తూ ఈ నెల 9న ఈసీ తీసుకున్న నిర్ణయాన్ని, అంతకు ముందు ఈసీ జారీచేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ హైకోర్టులో పలువురు వ్యాజ్యాలు దాఖలు చేశారు. వీటిపై గురువారం హైకోర్టులో సుదీర్ఘ విచారణ జరిగింది.ఈసీ తరఫున సీనియర్‌ న్యాయవాది అవినాష్‌ దేశాయ్‌ తన వాదనలు వినిపిస్తూ ఈ నెల 13 తర్వాత రైతులకు పెట్టుబడి రాయితీ, విద్యా దీవెన, చేయూత, ఆసరా, ఈబీసీ నేస్తం పథకాల నిధులను జమచేస్తే అభ్యంతరం లేదన్నారు. ఎన్నికల ప్రక్రియ ముగిసేవరకు అంటే జూన్‌ 6 వరకు నిధులను జమచేయవద్దని గతంలో నిర్ణయం తీసుకున్నామని, రాష్ట్ర ప్రభుత్వం తాజాగా సమర్పించిన వివరాలను పరిశీలించాక పోలింగ్‌ ముగిసిన మరుసటి రోజు జమచేయవచ్చని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు జూన్‌ 6 వరకు ఉన్నప్పటికీ.. ఓటింగ్‌ అయిన మరుసటి రోజే సొమ్ము జమకు అనుమతి ఇచ్చామన్నారు. వివిధ పథకాల కింద లబ్ధిదారులకు రూ. 14,165 కోట్ల పంపిణీకి రాష్ట్రప్రభుత్వం అనుమతి కోరిందన్నారు.