Site icon Prime9

Deputy CM Pawan Kalyan: చెత్త నుంచి సంపద సృష్టిపై డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ దృష్టి

Deputy CM Pawan Kalyan committed to creating wealth from waste: మనిషి భూమిని సొంతం చేసుకోవడం కాదు.. తిరిగి మనిషే భూమికి సొంతమవుతాడు’ అనే సత్యాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ప్రకృతి పట్ల, భూమి పట్ల అవగాహన, బాధ్యతతో వ్యవహరించాలి. మన భవిష్యత్‌ తరాలకు నిజమైన వారసత్వపు ఆస్తిగా… ప్రకృతిని, పర్యావరణాన్ని అందించాలి. ఇదే సంకల్పంతో ముందడుగు వేశారు.. ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం, అటవీ, పర్యావరణ శాఖామంత్రి పవన్‌ కల్యాణ్‌. ప్రకృతి పట్ల ప్రేమ, పర్యావరణ పరిరక్షణపై తన బాధ్యతను అడుగడునా ఆచరణలో చూపిస్తున్నారు. నిజమైన భూమి పుత్రుడిగా తనని తాను పునరంకితం చేసుకుంటున్నారు.

మనిషి జీవనానికి అత్యవస్యం.. పంచ భూతాలు. భూమి, గాలి, నీరు, నిప్పు, ఆకాశం.. మనిషి జీవనాన్ని శాసిస్తాయి. అయితే.. తన అవసరాలు, పంచభూతాలనే శాసించాలనే అత్యాసతో తన మనుగడను తానే ప్రశ్నార్థకంగా మార్చుకుంటున్నాడు. మన దేశంలో నదులు, ప్రకృతిని దైవంగా భావిస్తాం. పూజిస్తాం. నీటిని గంగాజలంగా ఆరాధిస్తాం. అయితే… ఆ నీటి వనరులు అన్నిటినీ కాలుష్య కాసారాలుగా మార్చేస్తున్నదీ మనిషే. గంగ మొదలు.. గుంటూరు పంట కాలువ వరకు.. మన నదులు, కాలువలు, చెరువులు, నీటి వనరులన్నీ వ్యర్థాలతో నిండిపోతున్నాయి. భూమిపై పొరలు, పొరలుగా ప్లాస్టిక్ పేరుకుపోయింది. చుట్టూ ఆవరించిన గాలి అంతా కాలుష్యమంగా మారింది. దీంతో విపరీతమైన ప్రకృతి విపత్తులకు మనిషే కారణమవుతున్నాడు. ఈ పరిస్థితిలో మార్పు తీసుకు వచ్చి, ప్రకృతిని, పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం, పర్యావరణ శాఖామంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచే పవన్‌ కల్యాణ్‌ ప్రత్యేక దృష్టి సారించారు. శాఖా పరంగా నిత్యం వీటిపై సమీక్షలు చేపట్టడంతో పాటు పర్యావరణ ప్రేమికుడిగా ప్రకృతిని కాపడటంలో తన బాధ్యతను చిత్తశుద్ధితో నిర్వర్తిస్తున్నారు.

చెత్తే కదా అని పడేయొద్దు..
ప్రతి ఇంట్లో, వ్యాపార సముదాయంలో, పరిశ్రమల్లో రోజువారీ వచ్చే చెత్తను ఏ వీధి మూలనో.. ఊరి చివరో పడేయడం పరిపాటిగా మారింది. వీటిని అరికట్టాల్సిన పంచాయతీ, మున్సిపల్‌ యంత్రాంగాలు సైతం.. కేవలం వాటిని తరలించడం తోనే చేతులు దులుపుకొంటున్నాయి. ఈ నేపథ్యంలో సమస్య మూలం నుంచే పని ప్రారంభించిన పవన్‌ కల్యాణ్‌… చెత్త సమస్యను పరిష్కరించడంతో పాటు దానితోనే ఆదాయాన్ని సృష్టించే మార్గాలపై దృష్టి సారించారు. దీనికి సంబంధించి బాధ్యతలు స్వీకరించిన నెల రోజుల్లోనే పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ప్రపంచంలోనే అత్యంత సుందర నగరాల్లో ఒకటిగా ఉన్న సింగపూర్‌ లో చెత్త వ్యర్థాల నుంచి విద్యుత్‌ ఉత్పత్తి సహా ప్రపంచ వ్యాప్తంగా చెత్త శుద్ధిపై చేపడుతున్న కార్యచరణపై సమీక్ష చేపట్టారు.

పిఠాపురం నుంచే మొదలు…
సాలిడ్‌ లిక్విడ్‌ రీసోర్స్‌ మేనేజ్‌మెంట్‌(ఎస్‌ఎల్‌ఆర్‌ఎం) విధానాన్ని రాష్ట్రంలో అమలు చేసేందుకు జనసేనాని పవన్‌ అమితాశక్తి కనబరిచారు. ముందుగా దీనిని తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గం నుంచే అమలు చేసేందుకు సంకల్పించారు. 54 పంచాయతీలు, గొల్లప్రోలు, పిఠాపురం మున్సిపాలిటీల్లో పైలెట్‌ ప్రాజెక్టుగా అమలుగా చేసేందుకు కార్యాచరణ రూపొందించారు. రోజుకి 2 సార్లు ఇంటింటికీ తిరిగి, చెత్త సేకరించి, ప్రాసెసింగ్‌ సెంటర్‌ కి పంపించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. దీని ఫలితాల ఆధారంగా లోపాలను సవరించుకొని, రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. తద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఏటా రూ.2,645 కోట్ల ఆదాయాన్ని సృష్టించవచ్చని వినూత్న విధానాన్ని తెరపైకి తీసుకొచ్చారు. అలాగే ప్రతి నెలా రూ.9 వేల చొప్పున వేతనంతో గ్రామీణ ప్రాంతాల్లో 2 లక్షల 50 వేల మందికి ఉపాధి కల్పించేందుకు అవకాశం ఉంటుందని పవన్‌ కల్యాణ్‌ వెల్లడించారు. ఈ కార్యాచరణతో ఘన, ద్రవ్య వ్యర్థాలతో నిరుద్యోగ సమస్యకు కూడా చెక్‌ పెట్టవచ్చని భావిస్తున్నారు.

వ్యర్థాలకు కొత్త అర్ధాలు…
దేశంలో, రాష్ట్రంలో చెత్త నిర్వహణను చిత్తశుద్ధితో అమలు చేస్తున్న స్వచ్ఛంద సంస్థలు ఎన్నో ఉన్నాయి. వాటి కార్యచరణ, క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలు, వాటిని అధిగమించి ఆదర్శంగా నిలుస్తున్న తీరుపై డిప్యూటీ సీఎం పవన్‌ ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు. ఈ మేరకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో చెత్త నిర్వహణపై పని చేస్తున్న స్వచ్ఛంద సంస్థలు, పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డ్‌ తో కలిసి ఇటీవల విజయవాడలో సమావేశమయ్యారు. పంట కాలువలు, నదులను డంపింగ్‌ యార్డ్‌ లుగా మార్చేశారని ఆవేదన పడ్డారు. ఇది ప్రజలు, ప్రభుత్వాల సమష్టి వైఫల్యమని నిర్మోహమాటంగా ఖండించిన ఆయన… కవర్లు ఎక్కడపడితే అక్కడ పడేయడం వల్ల మూగజీవాలు వాటిని తిని, అనారోగ్యాల బారిన పడుతున్నాయని, మరెన్నో మరణిస్తున్నాయని గుర్తుచేశారు. ఎన్ని ఆలోచనలు ఉన్నా, క్షేత్రస్థాయిలో వాటి అమలే అసలైన సవాల్‌ అని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా… పార్వతీపురం మున్సిపాలిటీ, పరిసర ప్రాంతాల్లో వ్యర్థాల నిర్వహణపై జట్టు సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పునర్వ్‌ సంస్థ కార్యకలాపాలు, అవనిగడ్డ సమీపంలోని స్వచ్ఛ సుందర చల్లపల్లి, దాని స్ఫూర్తితో చుట్టుపక్కల గ్రామాల్లో అమలు చేస్తున్న చెత్త శుద్ధి కార్యచరణ వంటివాటిని తెలుసుకున్నారు. చెత్తశుద్ధి సంకల్పంలో ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య అనుసంధానకర్తలు, కీలక భాగస్వాములుగా స్వచృంద సంస్థలు నిలవాలని ఆయన పిలుపునిచ్చారు.

పర్యావరణ హిత ఆర్థికాభివృద్ధి కావాలి..
ప్రకృతి, పర్యావరణం పట్ల బాధ్యతతో కూడిన అభివృద్ధి కావాలి అని ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ తన ఆకాంక్షను బయటపెట్టారు. చెత్త.. మనిషి దైనందిన జీవితంలో భాగం అయిపోయిందని విచారం వ్యక్తం చేసిన ఆయన… పరిశ్రమలు కూడా కర్చన ఉద్ఘారాలు, కాలుష్యాన్ని నియంత్రించేందుకు తమవంతు సహకారం అందించాలని కోరారు. చెత్త నిర్వహణపై ప్రజల్లో అవగాహన పెరగాలని, ఆ దిశగా ప్రభుత్వంతో పాటు స్వచృంద సంస్థలు, యూనివర్సిటీలు ముందడుగు వేయాలని సూచించారు. 12 గంటల్లోగా చెత్త సేకరిస్తే అదే సంపదగా మార్చవచ్చని… దీనిపై అంతా చిత్తశుద్ధితో భాగం కావాలని సూచించారు.

ఆర్‌ఆర్‌ఆర్‌ విధానంపై అవగాహన..
చెత్తను చిత్తుగా పాడేయడం కారణంగా పర్యావరణ కాలుష్యంతో పాటు రోగాలబారిన పడుతున్నామని పునర్వ్‌ సహ వ్యవస్థాపకురాలు వెనిగళ్ల పద్మజ అన్నారు. ఈ సమస్యను పరిష్కరించి, వ్యర్థాల నుంచే సంపద సృష్టించేందుకే పునర్వ్‌ సంస్థను స్థాపించాంమన్నారు. అధికారులు, సిబ్బంది, ప్రజా ప్రతినిధులు, వ్యాపారులు, ప్రజల సహకారంతో ఇంటింటా పొడి చెత్తను సేకరిస్తున్నామని తెలిపారు. అనంతరం దీనిని ప్రాసెసింగ్‌ చేసి, రీసైక్లింగ్ చేయడంతో పాటు ఇతర ఉత్పత్తులు తయారు చేస్తున్నామని, దీనిపై ఎప్పటికప్పుడు విద్యార్థులు, యువత, ప్రజలతో శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ప్లాస్టిక్‌ వినియోగంలో నియంత్రణ, పునర్వినియోగం, పునరుత్పాదన(రెడ్యూస్‌, రీ యూజ్‌, రీ సైక్లింగ్‌ (ఆర్‌ఆర్‌ఆర్‌)) విధానంపై విసృతంగా అవగాహన కల్పిస్తున్నట్లు వివరించారు.

Exit mobile version