Site icon Prime9

TTD Chairman BR Naidu: సీఎం రేవంత్‌ను కలిసిన టీటీడీ చైర్మన్.. పలు అంశాలపై చర్చ!

TTD Chairman BR Naidu meets CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్ రెడ్డిని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడు కలిశారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఉన్న సీఎం రేవంత్ నివాసానికి వెళ్లి ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు ఆయనను శాలువాతో సత్కరించి పుష్పగుచ్ఛం అందజేశారు.

కాగా, ఇటీవల టీటీడీ చైర్మన్‌గా బీఆర్ నాయుడు నియమితులయ్యారు. ఈ మేరకు ఆయనను సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ నాయుడు శ్రీవారి ప్రసాదాలు అందజేశారు. అనంతరం సీఎం నివాసంలో సమావేశమయ్యారు. ఇందులో భాగంగా తిరుమలలో తీసుకోవాల్సిన పలు అంశాలను చర్చించినట్లు తెలుస్తోంది.

తిరుమల తిరుపతిలో శ్రీవారి దర్శనం విషయంలో తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖలను అనుమతి ఇవ్వకపోవడంపై అసంతృప్తి నెలకొంది. ఈ విషయంపై కొంతకాలంగా చర్చలు జరుగుతూనే ఉన్నాయి.. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి, బీఆర్ నాయుడు సమావేశం కావడంతో ఇక తెలంగాణ నుంచి ప్రజాప్రతినిధుల లేఖలపై పరిష్కారం లభించనుందని భక్తులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

బీఆర్ నాయుడు టీటీడీ చైర్మన్‌గా బాధ్యతలు తీసుకున్న తర్వాత ప్రముఖులను మర్యాదపూర్వకంగా కలుస్తున్నారు. బుధవారం మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను సైతం మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించారు. అలాగే తిరుపతి ప్రసాదాలతో పాటు వేంకటేశ్వరుడి ఫోటోను బహుకరించారు.

Exit mobile version