Gudivada Sarath Theatre: గుడివాడలో ఇన్నాళ్లూ అక్రమంగా శరత్ థియేటర్‌ను అక్రమించుకుని ఏర్పాటు చేసిన వైసీపీ కార్యాలయాన్ని ఖాళీ చేయించారు. స్థానిక ఎమ్మెల్యే వెనిగండ్ల రాము. థియేటర్లో వైసీపీ ఫ్లెక్సీలు, కొడాలి నాని ఫోటోలను తొలగించింది థియేటర్ యజమాన్యం. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే శరత్ థియేటర్‌ను స్వాధీనం చేసుకుంది యాజమాన్యం. శరత్ టాకీస్ యాజమాన్యంలో ఒకరైన మున్సిపల్ మాజీ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు ఆహ్వానం మేరకు టీ పార్టీకి వెళ్లారు ఎమ్మెల్యే రాము.
శరత్ టాకీస్ యాజమాన్యం తమకు జరిగిన అన్యాయంపై తనను కలిశారని చెప్పారు ఎమ్మెల్యే రాము. గుడివాడ నడిబొడ్డులో ఇన్నాళ్లు అరాచకానికి అడ్డాగా వైసీపీ కార్యాలయం నిలిచిందన్నారు. ఇక్కడకు రావాలంటే ప్రజలు భయపడే పరిస్థితి ఉండేదని.. ఆఖరుకు ముగ్గురు హక్కుదారులు థియేటర్‌కు వస్తే బెదిరింపులు ఎదుర్కొనే పరిస్థితి ఉండేదని చెప్పారు. గుడివాడ వ్యాప్తంగా కొడాలి నాని అనుచరులు.. పేద, మధ్యతరగతి వర్గాల ఆస్తులను కబ్జా చేశారని ఆరోపించారు. వారందరికీ కూడా న్యాయం చేస్తామని చెప్పారు. తాము అధికారంలోకి వచ్చిన 24 గంటల్లోనే కొడాలి నాని కబ్జాలో ఉన్న తొమ్మిది ఎకరాల స్థలాన్ని హక్కుదారులకు అప్పగించామని గుర్తుచేశారు.
శరత్ టాకీస్‌లో 75 శాతం వాటా ఉన్న తాము..తమ కష్టాన్ని ఎమ్మెల్యే రాము దృష్టికి తీసుకువెళ్లి న్యాయం చేయమని కోరామన్నారు యలవర్తి శ్రీనివాసరావు. ఇన్నాళ్లూ తమను బెదిరించి తమ ఆస్తిని కొడాలి నాని అక్రమంగా వాడుకున్నారని ఆరోపించారు. తమ విజ్ఞప్తి మేరకు టీ పార్టీకి వచ్చిన ఎమ్మెల్యే రాముకు ధన్యవాదాలు చెప్పారు.