Site icon Prime9

KTR: అదానీతో చేసుకున్న చీకటి ఒప్పందాలు బయట పెట్టాలి.. కేటీఆర్ డిమాండ్

KTR tweet about adani: అదానీ గ్రూప్స్‌ అధినేత గౌతమ్‌ అదానీ అగ్రరాజ్యం అమెరికానే మోసం చేయాలని చూసిన ఘనుడు.. కేంద్ర ప్రభుత్వ అధికారులకు లంచం ఇవ్వజూపిన మోసగాడని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ విమర్శించారు. ఈ మేరకు కేటీఆర్ ఆసక్తికర ట్వీట్‌ చేశారు. అదానీపై యూఎస్‌ అభియోగాలు నమోదు కాగా.. కంపెనీ అధికారులకు లంచాలు ఇవ్వజూపడంతోపాటు ఇన్వెస్టర్లకు తప్పుడు సమాచారంతో నిధుల సమీకరణకు పాల్పడినట్లుగా న్యూయార్క్‌ ఫెడరల్‌ ప్రాసిక్యూటర్లు ఆరోపించారు.

మూసీలో అదానీ వాటా ఎంత..?
అదానీతో కాంగ్రెస్‌, బీజేపీ అనుబంధం దేశానికి అవమానం, అరిష్టమని కేటీఆర్ ఆరోపించారు. యాదాద్రి జిల్లా రామన్నపేటలో సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం ఎంత ఇవ్వజూపిండో, మూసీలో ఆయన వాటా ఎంతో అంటూ ప్రశ్నించారు. ఇలాంటి మోసగాడికి తెలంగాణలో పెట్టుబడుల అనుమతులు ఎలా ఇచ్చారంటూ మండిపడ్డారు.

వెంటనే అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ అనుమతులు రద్దు చేయాలి..
అదానీ గ్రూప్‌‌‌‌ ఆధ్వర్యంలో 2022లో రామన్నపేటలో భూములను కొనుగోలు చేయగా, డ్రైఫ్రూట్స్‌‌‌‌ ఫ్యాక్టరీ పేరుతో కొనుగోలు చేసిన భూముల్లో అంబుజా సిమెంట్‌‌‌‌ ఫ్యాక్టరీ ఏర్పాటుకు వ్యతిరేకంగా ప్రజలు మొదటి నుంచి ఆందోళనలు చేస్తున్నారని గుర్తుచేశారు. వెంటనే ఫ్యాక్టరీ అనుమతులు రద్దు చేయాలన్నారు. అదానీతో చేసుకున్న చీకటి ఒప్పందాలను బయట పెట్టాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణలో ఆస్తులను కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. మీ భడే భాయ్ వాటాఎంత ? మీ అదానీ భాయ్ వాటా ఎంత? మీ హైకమాండ్ వాటా ఎంత? అంటూ కేటీఆర్‌ సోషల్‌ మీడియా వేదికగా నిలదీశారు.

ఏడుగురిపై అభియోగాలు..
గౌతమ్‌ అదానీ, అతడి బంధువు సాగర్‌తో పాటు మరో ఏడుగురిపై అభియోగాలు నమోదయ్యాయి. అదానీ, అనుబంధ సంస్థలు 20 ఏండ్లలో రెండు బిలియన్‌ డాలర్ల లాభం పొందేందుకు ప్రయత్నిస్తున్నారని, సోలార్‌ పవర్‌ ప్లాంట్‌ ఒప్పందాలను పొందడానికి కేంద్ర ప్రభుత్వ అధికారులకు 265 మిలియన్‌ డాలర్ల లంచాలు ఇవ్వ జూపినట్లుగా ప్రాసిక్యూటర్లు ఆరోపించారు. అమెరికాతోపాటు ఇంటర్నేషల్ ఇన్వెస్టర్లకు తప్పుడు సమాచారం ఇచ్చి నిధులు సమీకరణకు కంపెనీ ప్రయత్నించారని అభియోగాలు మోపారు.

యూఎస్‌ సెక్యూరిటీ చట్టాలు ఉల్లంఘన..
అదానీ గ్రీన్ ఎనర్జీలో అక్రమ మార్గాల ద్వారా కంపెనీ మూడు బిలియన్‌ డాలర్లకుపైగా రుణాలు, బాండ్లను సేకరించినట్లుగా ప్రాసిక్యూటర్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ కమిషన్‌ మరో సివిల్‌ కేసు నమోదు చేసింది. యూఎస్‌ సెక్యూరిటీ చట్టాలను ఉల్లంఘించి అదానీ గ్రీన్‌ ఎనర్జీ అమెరికా ఇన్వెస్టర్ల నుంచి 175 మిలియన్‌ డాలర్లకుపైగా సేకరించినట్లుగా ఆరోపించింది. వ్యవహారంపై వెంటనే దర్యాప్తు జరిపి జరిమానాతోపాటు కంపెనీపై ఆంక్షలు విధించాలని రెగ్యులేటర్‌ కోరింది.

Exit mobile version