Narasapuram MPDO: పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం ఎంపీడీవో వెంకటరమణ అదృశ్యమైనట్లు కృష్ణాజిల్లా పెనమలూరు పోలీస్‌స్టేషన్‌లో ఆయన భార్య ఫిర్యాదు చేశారు. నర్సాపురం మాధవాయిపాలెం ఫెర్రి పాటదారుడి నుంచి బకాయిలు వసూళ్ల విషయంలో ఒత్తిడికి గురైన ఎంపీడీవో రమణారావు.. జులై మూడో తేదీ నుంచి మెడికల్ లీవ్‌పై వెళ్లారు. నిన్న ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లిన రమణారావు రాత్రి అయినా తిరిగి రాకపోవడంతో ఆయన భార్య పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
పుట్టినరోజే చచ్చిన రోజంటూ..(Narasapuram MPDO)
నా పుట్టినరోజైన జూలై 16 వ తేదీయే నేను చనిపోయే రోజు అంటూ భార్య ఫోన్ కు మెసేజ్ పంపించినట్లు తెలుస్తోంది. వైసీపీకి చెందిన ముఖ్యనాయకుడు పెర్రి పాటదారుడు కావడంతో.. సుమారు 55 లక్షల రూపాయలు బకాయిలు పెండింగ్‌లో ఉండిపోయాయి. ఐతే.. ఎన్నికల నేపథ్యంలో అధికారులు ఎవరూ పట్టించుకోలేదు. దీంతో బకాయిదారుడు ఆ మొత్తం ఎగవేస్తే తన ఉద్యోగం మీదకు వస్తుందనే..ఆందోళనతో రమణారావు నిత్యం టెన్షన్ పడుతూ ఉండేవారని కార్యాలయ సిబ్బంది అంటున్నారు. ఆయన మొబైల్ సిగ్నల్స్ ట్రేస్ చేసినపుడు ఏలూరు దగ్గర కాలువ సమీపంలో ఆగిపోయినట్లు తేలింది. దీనితో ఆయన సూసైడ్ చేసుకున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.