Published On:

Ration Cards : ఏపీలో కొత్త రేషన్ కార్డులు.. ఎప్పటి నుంచి అంటే?

Ration Cards : ఏపీలో కొత్త రేషన్ కార్డులు.. ఎప్పటి నుంచి అంటే?

Ration Cards : ఏపీ ప్రజలకు కూటమి ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఈ ఏడాది మే నుంచి ఏటీఎం కార్డు సైజులో కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. ఈ నెల 30లోగా ఈకేవైసీ ప్రక్రియ పూర్తయిన వెంటనే కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని వెల్లడించారు. ఇవాళ మంత్రి ఏపీ సచివాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ప్రస్తుతం ఉన్న కుటుంబ రేషన్ కార్డును సైజు తగ్గించి అన్ని వివరాలతో జారీ చేస్తామని స్పష్టం చేశారు. కొత్త కార్డుల జారీ సమయంలోనే కుటుంబ సభ్యుల జోడింపు, తొలగింపు, స్ల్పిట్ కార్డుల కోసం ఆప్షన్లు ఇస్తామని తెలిపారు. క్యూఆర్ కోడ్ లాంటి భద్రతా ఫీచర్లతో కొత్త రేషన్ కార్డులు జారీ అవుతాయన్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలా ఎక్కడా వ్యక్తుల బొమ్మలు రేషన్ కార్డుపై ఉండబోవని స్పష్టం చేశారు. ఈకేవైసీ పూర్తయిన తర్వాత ఎంతమందికి కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలో స్పష్టత వస్తుందని మంత్రి నాదెండ్ల అన్నారు.

 

 

24 గంటల్లో నగదు జమ..
ఇవాల్టి నుంచి దీపం2 పథకం రెండో విడత సిలిండర్ బుకింగ్ ప్రారంభమైందని మంత్రి నాదెండ్ల ప్రకటించారు. కొత్తగా 2 లక్షల మంది గ్యాస్ కనెక్షన్లు తీసుకున్నట్లు చమురు కంపెనీలు ప్రకటించినట్లు తెలిపారు. వానకాలం సీజన్‌లో 35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని తెలిపారు. రైతుకు భరోసానిస్తూ 24 గంటల్లో వారి ఖాతాల్లో నగదు జమ చేశామన్నారు. రూ.8 వేల 279 కోట్లు ధాన్యం కొనుగోలు చెల్లింపులు చేశామని తెలిపారు.

 

 

రేషన్ బియ్యం స్మగ్లింగ్‌..
ఐదు గోదాముల్లో మధ్యాహ్న భోజన పథకానికి వినియోగించే బియ్యం నిల్వ చేసి ప్యాకింగ్ చేయిస్తున్నామని తెలిపారు. రబీలో కూడా ఖరీఫ్ బియ్యం కొనుగోలు కొనసాగుతుందని చెప్పారు. రేషన్ బియ్యం అక్రమ రవాణాపై కఠినంగా వ్యవహరిస్తున్నామన్నారు. పీడీ యాక్టులో రేషన్ బియ్యం స్మగ్లింగ్‌ను చేర్చామని తెలిపారు. గత జగన్ ప్రభుత్వం రూ.1600 కోట్లతో ఎండీయూలు కొనుగోలు చేసి దుర్వినియోగం చేసిందని ఆరోపించారు. ఎండీయూల కొనుగోలు పెద్ద కుంభకోణమని కామెంట్స్ చేశారు. దీనిపై విచారణ జరుగుతోందని, త్వరలో ఓ నిర్ణయం ప్రకటిస్తామని స్పష్టం చేశారు.

 

 

వైఎస్ జగన్ హయాంలో అవినీతి..
గత వైసీపీ ప్రభుత్వంలో ధాన్యం కొనుగోళ్లలో అవినీతి జరిగిందని ఆరోపించారు. రైతులు ధాన్యం అమ్ముకునేందుకు మిల్లుల వద్ద పడిగావులు కాయాల్సి వచ్చే పరిస్థితి నెలకొందన్నారు. ధాన్యం కొనుగోళ్లల్లో వాట్సాప్, జీపీఎస్‌లను సాంకేతికంగా ఉపయోగిస్తున్నామని తెలిపారు. రైతులే వారికి నచ్చిన మిల్లుల వద్ద ధాన్యం అమ్ముకునేలా అవకాశం కల్పించామని చెప్పారు. చివరి ధాన్యం గింజ వరకు కొనుగోలు చేస్తామని హామీనిచ్చారు. వైఎస్ జగన్ ప్రభుత్వలో మాదిరిగా ధాన్యం కొనుగోలు చేయలేదన్నారు.

 

 

రైతు సహాయక కేంద్రాల ఏర్పాటు..
రబీలో 13 లక్షలు 50 వేల మెట్రిక్ టన్నులు పంట వస్తుందని అంచనా వేశామని మంత్రి తెలిపారు. సివిల్ సప్లై నుంచి 10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తామని పేర్కొన్నారు. ఏపీ వ్యాప్తంగా 2900 రైతు సహాయక కేంద్రాలు ఏర్పాటు చేస్తామని హామీనిచ్చారు. 12 వేల మంది సిబ్బంది రైతులకు అందుబాటులో ఉంటారని స్పష్టం చేశారు. సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా దీపం 2 పథకం అమలు చేస్తున్నామని తెలిపారు.

 

 

సిలిండర్ బుక్ చేసుకోండిలా..
ఈ నెల 1వ తేదీ నుంచి దీపం 2 పథకం కింద రెండో సిలిండర్ బుక్ చేసుకోవచ్చని మంత్రి తెలిపారు. అర్హులైన లబ్ధిదారులకు దీపం 2 పథకం అందిస్తామని తెలిపారు. ప్రతిఒక్కరూ ఆధార్‌తో ఈ కెవైసీ లింక్ చేసుకోవాలని సూచించారు. గత వైఎస్ జగన్ ప్రభుత్వంలో వాహనాల కొనుగోళ్లలో కూడా అక్రమాలు జరిగాయని ఆరోపించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి 44 వేల 394 ప్రభుత్వ పాఠశాలలకు సూపర్ ఫైన్ బియ్యాన్ని మధ్యాహ్న భోజనానికి సరఫరా చేస్తామని మంత్రి స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి: