Yogandhra 2025: యోగాంధ్ర బంపర్ హిట్..! ఆసనాలు వేసిన మోదీ, బాబు, పవన్.!

Yogandhra 2025: విశాఖ సాగరతీరాన 11వ అంతర్జాతీయం యోగ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తదితరులు యోగాసనాలు వేశారు. యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్ అనే నినాధాన్ని ప్రపంచానికి అందించారు మోదీ. ఏపీలో జరిగిన ఈ కార్యక్రమానికి యోగాంధ్ర 2025గా నిర్వహించారు. ప్రతీ సంవత్సరం జూన్ 21న యోగా డే గా కేంద్ర ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. తాజాగా ప్రధాని మోదీ ఏపీలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆర్ కే బీచ్ నుంచి భీముని పట్నం వరకు 26కిలోమీటర్లపొడవున యోగాసనాలు వేశారు. కార్యక్రమం అనంతరం ప్రధాని ఢిల్లీకి బయలుదేరారు.
ఈ కార్యక్రమం గిన్నీస్ బుక్ రికార్డును సృష్టించింది. యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న 3 లక్షల మంది పౌరులు పాల్గొనగా.. సూరత్ రికార్డును యోగాంధ్ర కార్యక్రమం అధిగమించింది. యోగాంధ్ర కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ అయ్యిందని సీఎం చంద్రబాబు అన్నారు. యోగాను విశ్వవ్యాప్తం చేయడంలో ప్రధాని నరేంద్ర మోదీ కృషి ఫలించిందని చంద్రబాబు అన్నారు.
ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు పిలుపు మేరకు రాష్ట్రంలో అన్ని పాఠశాలల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గ వ్యాప్తంగా పాఠశాలలలో యోగా కార్యక్రమాలు చేపట్టారు. పెద్దనాపల్లిలో ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి ఆధ్వర్యంలో యోగా చేపట్టారు. ఏలేశ్వరం బాలయోగి గురుకుల పాఠశాలలోని విద్యార్థులు ప్రత్యేక యోగాసనాలు వేశారు. తూర్పు లక్ష్మీపురం ప్రభుత్వ పాఠశాలలో మండల అభివృద్ధి అధికారి సూర్యనారాయణ ఆధ్వర్యంలో యోగ చేపట్టారు. మానవ జీవితంలో ఆరోగ్యంగా ఉండేందుకు యోగా ఎంతగానో దోహదపడుతుందని అన్నారు.
గుంటూరు జిల్లా తెనాలిలో మున్సిపల్ కార్యాలయం ఎదుట నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. యోగ సాధన చేసిన గురువులు చేత యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, విద్యార్థినీ విద్యార్థులు, ఉపాధ్యాయులు, యోగసాధకులు యోగాసనాలు ఆచరించారు. అనంతరం పలువురు యోగసాధకులను మంత్రి మనోహర్ సన్మానించారు. యోగాతో మానసిక ప్రశాంతత, ఆరోగ్యం లభిస్తుందని మంత్రి తెలిపారు. యోగాను ప్రపంచవ్యాప్తం చేసిన ఘన ప్రధాని మోదీకే దక్కుతుందని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు.
విశాఖలోని యోగాంధ్ర కార్యక్రమంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి క్రికెట్ స్టేడియంలో యోగాంధ్ర కార్యక్రమానికి అధిక సంఖ్యలో జనం వచ్చారు. కాగా యోగాంధ్ర మ్యాట్లు, ఇతర కిట్లు కోసం కొట్లాటకు దిగారు. దీంతో అరుపులు, కేకలు, తోపులాటతో ప్రశాంతమైన యోగా కేంద్రం రణరంగంగా మారింది.
నెల్లూరు నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో యోగాంధ్ర కార్యక్రమం వేడుకగా జరిగింది. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆనంద్, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, యువత పాల్గొని, యోగాసనాలు వేశారు. మానవ జీవితంలో యోగా ప్రాధాన్యతపై యోగ గురువులు వివరించారు. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో యోగాను దినచర్యగా మార్చుకోవాలని ఎంపీ వేమిరెడ్డి, ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి, కలెక్టర్ ఆనంద్ సూచించారు.
శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో జిల్లా స్థాయి యోగా కార్యక్రమం ఘనంగా జరిగింది. యోగా డేలో ముఖ్య అతిథులుగా పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, , కలెక్టర్ చేతన్, ఎస్పీ రత్న హాజరయ్యారు. యోగా గురువుల సూచనల మేరకు యోగాసనాలు వేశారు. యోగాలో పాల్గొనేందుకు వేల సంఖ్యలో జనం తరలివచ్చారు. జనాలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిర్వాహకులు భారీ ఏర్పాట్లు చేశారు.