Published On:

Padi Kaushik Reddy : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డికి బెయిల్‌ మంజూరు

Padi Kaushik Reddy : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డికి బెయిల్‌ మంజూరు

BRS MLA Padi Kaushik Reddy: ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డికి ఊరట లభించింది. కౌశిక్‌రెడ్డి రిమాండ్‌ను న్యాయస్థానం తిరస్కరించింది. అతడికి షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. క్వారీ యజమానిని బెదిరించిన కేసులో పోలీసులు అతడిని అరెస్టు చేశారు. వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం కాజీపేట రైల్వే కోర్టులో హాజరుపర్చారు. 41ఏ నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చేశారని కౌశిక్‌రెడ్డి తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఇరువైపులా వాదనలు విన్న న్యాయమూర్తి కౌశిక్‌రెడ్డికి షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేశారు.

 

అంతకు ముందు కౌశిక్‌రెడ్డికి కాజీపేట రైల్వే కోర్టులో చుక్కెదురైంది. గ్రానైట్‌ క్వారీ యజమాని మనోజ్‌రెడ్డిని బెదిరించిన కేసులో 14 రోజులపాటు రిమాండ్‌ విధించగా, దీంతో ఎమ్మెల్యేను ఖమ్మం జైలుకు తరలించారు.

 

నాటకీయ పరిణామాల మధ్య..
నాటకీయ పరిణామాల మధ్య శనివారం ఉదయం ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని శంషాబాద్ ఎయిర్‌పోర్టులో వరంగల్ సుబేదారీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వరంగల్‌కు తరలించారు. ఎంజీఎం ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం కౌశిక్‌ను కాజీపేట రైల్వే కోర్టుకు తరలించారు. అక్కడ వాదనలు విన్న న్యాయస్థానం రిమాండ్‌ విధించింది.

 

కేసు నేపథ్యం..
మనోజ్‌రెడ్డి అనే వ్యక్తి కమలాపూర్ మండలంలోని వంగపల్లిలో గ్రానైట్ క్వారీ నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి తనను రూ.50 లక్షలు ఇవ్వాలని బెదిరించినట్లు మనోజ్‌రెడ్డి భార్య ఉమాదేవి సుబేదారీ పోలీస్ స్టేషన్‌లో చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. బీఎన్‌ఎస్‌లోని సెక్షన్‌ 308 (2), 308 (4), 352 కింద కేసులు నమోదైయ్యాయి. ఈ క్రమంలో సుబేదారీ పోలీసులు శనివారం తెల్లవారుజామున శంషాబాద్ విమానాశ్రయంలో కౌశిక్‌‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.

 

సుబేదారి పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి అరెస్టుతో సుబేదారి పీఎస్ ఎదుట తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, కౌశిక్‌రెడ్డి భార్య శాలిని, కౌశిక్ సోదరుడు ప్రతీక్‌రెడ్డి పలువురు బీఆర్ఎస్ నేతలు ఆయనను పరామర్శించేందుకు తరలివచ్చారు. ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ పోలీసులతో గొడవకు దిగారు. న్యాయవాదితో కలిసి పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. బీఆర్ఎస్ నేత రాకేష్‌రెడ్డి పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేశారు. దీంతో పోలీస్ స్టేషన్ చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేశారు.

ఇవి కూడా చదవండి: