Srisailam Hydropower Station: శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో వాటర్ లీకేజీ.. ప్రమాదంపై నిపుణులు ఏం చెబుతున్నారంటే?
Water Leak At Srisailam Hydropower Station: శ్రీశైలం ఎడమ గట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో వాటర్ లీకేజీ కలకలం రేగుతోంది. గత కొంతకాలంగా చిన్న చిన్న డ్రాప్ మోతాదులో లీకేజీ జరుగుతుండగా.. తాజాగా, ఆ లీకేజీలు మరింత పెరిగిపోయాయి. దీంతో ఈ లీకేజీలపై అనుమానాలు రేకిత్తిస్తున్నాయి. వివరాల ప్రకారం.. గత వారం రోజులుగా శ్రీశైలం ఎడమ గట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో వాటర్ లీకేజీ జరుగుతోంది. ఈ అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
శ్రీశైలం ఎడమ గట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రంలోని ఒకటో యూనిట్‌లో డ్రాఫ్ట్ ట్యూబ్ జీరో ఫ్లోర్ నుంచి వారం రోజులుగా నీరు లీకవుతోందని అధికారులు గుర్తించారు. గతేడాది కిందట ఇదే ప్రాంతంలో సెప్టెంబర్ 18న సన్నని లీకేజి గుర్తించినా.. దానంతట అదే ఆగిపోయింది. అయితే నెల రోజులుగా నిరంతర విద్యుత్ ఉత్పాదనతోపాటు పంప్ మోడ్ పద్ధతితో శ్రీశైలం డ్యాంలోకి నీటి మళ్లింపు కొనసాగుతుంది.
అయితే ప్రస్తుతం పంపు మోడ్‌లో మోటార్లు నడుస్తున్నప్పుడు, టర్బయిన్లు వేగంగా తిరుగుతున్నప్పుడు డ్రాప్ట్ ట్యూబ్ జీరో ఫ్లోర్ నుంచి డిసెంబర్ 25న పంప్ మోడ్ జరిగే సమయంలో నీటి లీకేజీ అధికంగా ఉందని అధికారులు గుర్తించారు. ఇందుకోసం ఆ ప్రాంతంలో జెన్ కో అధికారులు ప్రత్యేకంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.
ఎడమగట్టు విద్యుత్ కేంద్రాన్ని 24 ఏళ్ల క్రితం నిర్మించగా.. లీకేజీ నీటి ఆధారాలను అరికట్టకపోతే జీరో ఫ్లోర్ స్లాబ్ కూలిపోయే ప్రమాదం ఉందని కొంతమంది ఇంజినీర్లు, మాజీ ఉద్యోగులు చెబుతున్నారు. కాగా, నీరు లీకవుతున్న ప్రాంతాన్ని హైదరాబాద్ విద్యుత్ సౌధ అధికారులు పరిశీలించారు. దీనిపై పూర్తి వివరాలతో నివేదికను రూపొందించాలని స్థానిక ఇంజనీర్లను ఆదేశించినట్లు తెలుస్తోంది.
మరో వైపు పంపు మోడ్ ను ఆపి లీకేజీని పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం ఆ లీకేజీ కారణాల్ని గుర్తించాలంటే టర్బయిన్లలో పూర్తిగా నీటి నిల్వ లేకుండా చూడాలి. నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ నిండుగా ఉండటంతో ఇప్పుడు ఖాళీచేసే పరిస్థితి లేదు. నీటిమట్టం తగ్గినప్పుడు ప్లాంట్ సాధారణ నిర్వాహణలో భాగంగా ఇలాంటి లీకేజీలను గుర్తించి మరమ్మత్తులు చేస్తారు. ప్రస్తుతానికి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని శ్రీశైలం జల విద్యుత్ కేంద్రం చీఫ్ ఇంజినీర్ రామసుబ్బారెడ్డి స్పష్టం చేశారు.