Sridhar Babu: సమ్మిళిత అభివృద్ధికి కృషి.. అత్యుత్తమ ఎంఎస్ఎంఈ పాలసీ తీసుకొచ్చాం
Minister Sridhar Babu: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోనే అత్యుత్తమ ఎంఎస్ఎంఈ పాలసీని తీసుకొచ్చామని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. విధానాలను ఆచరణలో పెట్టడమే అతిపెద్ద సవాల్ అన్నారు. గచ్చిబౌలిలోని టీహబ్ లో బ్యాక్ వర్డ్ క్లాసెస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ (బిక్కి)ఆధ్వర్యంలో అవార్డ్స్-2024 కార్యక్రమం నిర్వహించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. బలహీన వర్గాలకు చెందిన పారిశ్రామిక వేత్తల కోసం బిక్కి ఏర్పాటు అభినందనీయమన్నారు. సమ్మిళిత అభివృద్ధి కోసమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఉపాధి కులాల వారీగా అందాలనే ఉద్దేశంతో కులగణన చేస్తున్నామన్నారు. సవరణ అవసరమైతే చట్టాల మార్పు కోసం కేంద్ర సాయం తీసుకుంటామన్నారు. వెనుకబడిన వర్గాల పారిశ్రామిక వేత్తల కోసం ప్రత్యేక ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు చేస్తామన్నారు.
బలహీన వర్గాలకు అన్యాయం చేయం..
ప్రభుత్వ ప్రతినిధిగా ప్రభుత్వంలో భాగస్వామిగా బలహీన వర్గాల మంత్రిగా ఇప్పుడున్న పాలసీల కంటే మంచి పాలసీ తీసుకొని బలహీన వర్గాలకు ఎక్కడ అన్యాయం జరగకుండా చూసుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. దేశంలోనే మొదటిసారి సామాజిక ఇంటింటి కుల సర్వే జరుగుతుందన్నారు. సర్వే గురించి అందరికీ సమాచారం ఇవ్వండి… ఎవరైనా సర్వేలో పాల్గొనకపోతే భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. బలహీన వర్గాలు పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవడానికి బ్యాంకుల తో సడలింపు ఇచ్చేలా డిఫాల్టర్ కాకుండా ట్రేడింగ్ ఎంటర్ప్రైజర్ పెంచుకుంటూ ముందుకు పోవాలని సూచించారు. ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకునేలా వ్యవహరిస్తానన్నారు. బలహీన వర్గాల నుంచి నా గొంతు వినిపిస్తానని చెప్పారు. ప్రభుత్వంలో న్యాయం చేసుకునేలా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. రెండు రోజుల్లో ఎంఎస్ఎంఈ పాలసీలో చేర్చాల్సిన అంశాలపై కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బలహీన వర్గాలకు పారిశ్రామికంగా ప్రోత్సహించడానికి అందులో ఏం చేర్చలేదు అనేదానిపై చర్చిస్తామన్నారు.