Medchal: సీఎంఆర్ కాలేజ్ దగ్గర ఉద్రిక్తత.. లేడీస్ హాస్టల్‌లోకి వెళ్లిన ఎన్ఎస్‌యూఐ నేతలు!
CMR Engineering College Girls Hostels issue: మేడ్చల్ జిల్లాలోని సీఎంఆర్ కాలేజ్ దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది. లేడీస్ హాస్టల్‌లోకి ఎన్ఎస్‌యూఐ కార్యకర్తలు వెళ్లారు. అయితే హాస్టల్‌లో ఎన్ఎస్‌యూఐ నేతలు వెళ్లడంతో సీఎంఆర్ యాజమన్య సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో విద్యార్థి సంఘం నేతలకు సిబ్బందికి మధ్య వాగ్వాదం జరిగింది. సమాచారం తెలుసుకున్న ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి కాలేజ్ వద్దకు చేరుకున్నారు. అనంతరం పేరెంట్స్, స్టూడెంట్స్‌తో ఏసీపీ మాట్లాడారు.
కాగా, సీఎంఆర్ కాలేజ్ విద్యార్థినులు ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో కాలేజీకి విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు చేరుకున్నారు. మరోవైపు కాలేజీ దగ్గర భారీ పోలీసు బందోబస్తు కొనసాగుతోంది. బాత్ రూమ్ వీడియోలు తీశారంటూ కాలేజీ విద్యార్థినులు ధర్నా చేపట్టారు. అయితే వీడియోలు తీసినట్లు వెంటిలేటర్‌పై చేతి గుర్తులు ఉన్నట్లు ఆరోపిస్తున్నారు. కాలేజీలో సరైన భద్రత లేదని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కండ్లకోయ సీఎంఆర్ కాలేజ్ దగ్గర టెన్షన్ వాతావరణం నెలకొంది. బాత్రూంలో వీడియోలు రికార్డు చేశారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. అయితే బాత్రూం వెంటిలేటర్‌పై ఉన్న చేతిగుర్తులు స్పష్టం చేస్తున్నాయి. బయట నుంచి కెమెరా పెట్టినట్లు విద్యార్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని వార్డెన్ వద్దకు తీసుకెళ్తే.. మాపై ఆరోపణలు చేస్తున్నారు. తర్వాత లోపలికి వచ్చిన తమ తల్లిదండ్రులకు తమ గోడును విద్యార్థులు వెళ్లబోసుకుంటున్నారు.
హాస్టల్ వద్ద భద్రతపై ఆందోళన నెలకొంది. రాత్రి సమయాల్లో అబ్బాయిలు హాస్టల్ వద్దకు వస్తున్నారని విద్యార్థినులు చెబుతున్నారు. హాస్టల్ వద్ద సరైన సెక్యూరిటీ లేదంటున్నారు. లేడిస్ హాస్టల్, వర్కర్స్‌కు మధ్య అడ్డుగోడ లేదని, ఫిర్యాదు చేస్తే బాధితులను చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అయితే, ఉద్దేశపూర్వకంగానే తాము ఇచ్చిన ఆధారాలను తప్పు పడుతున్నారని, సరైన యాజమాన్యం లేదని ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా హాస్టల్ వద్ద వార్డెన్ వ్యవస్థ సరిగ్గా ఉండడం లేదని విద్యార్థులు అంటున్నారు. అయితే మేనేజ్ మెంట్ నిర్లక్ష్యం ఉందని పోలీసులు నిర్ధారించారు. బాత్రూం దగ్గర వీడియోతీసేందుకు అవకాశం ఉందని ఏసీపీ వెల్లడించారు. ఇప్పటివరకు ఐదుగురిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అలాగు 11 ఫోన్లు స్వాధీనం చేసుకొని అందులో ఉన్న వీడియోలను పరిశీలించారు. అందులో ఎలాంటి అభ్యంతరకర వీడియోలు లేవని నిర్దారించారు. వెంటిలేటర్‌పై ఉన్న ఫింగర్ ప్రింట్స్‌ను క్యాట్‌కు పోలీసులు పంపించారు.