Bairi Naresh: అయ్యప్ప స్వామి పుట్టుకపై అనుచిత వ్యాఖ్యలు చేసిన భైరి నరేశ్ అరెస్ట్
అయ్యప్ప స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బైరి నరేష్ ను ఎట్టకేలకు పోలీసులకు అరెస్ట్ చేశారు. వరంగల్ జిల్లాలో బైరి నరేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Bairi Naresh: అయ్యప్ప స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బైరి నరేష్ ను ఎట్టకేలకు పోలీసులకు అరెస్ట్ చేశారు. వరంగల్ జిల్లాలో బైరి నరేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయ్యప్ప స్వామి, హిందూ దేవీదేవతలపై, అయ్యప్ప మాలధారులపై అసభ్యకరమైన రీతిలో వ్యాఖ్యలు చేసినందుకు గానూ అతనిపై రాష్ట్రవ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ మేరకు పోలీసులు నరేష్ ను అరెస్ట్ చేశారు. అనంతరం అతన్ని కొడంగల్ స్థానిక మున్సిఫ్ కోర్టులో బైరి నరేష్ ను పోలీసులు హాజరుపరిచారు.
ఇటీవల కొడంగల్ వేదికగా జరిగిన అంబేద్కర్ సభలో భారత నాస్తిక సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు భైరి నరేష్ హిందూ దేవుళ్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దానితో ఆయనపై వికారాబాద్ జిల్లాలో కేసు నమోదు అయింది. కాగా గత మూడు రోజులుగా నరేష్ పోలీసులకు ముందు తప్పించుకు తిరుగుతున్నాడు. దీంతో పోలీసులు నాలుగు టీంలను ఏర్పాటు చేసి నరేష్ కోసం గాలింపు చేపట్టగా వరంగల్ జిల్లాలో నరేష్ ను అరెస్ట్ చేసినట్టు వికారాబాద్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి వెల్లడించారు.
ఇదిలా ఉంటే బైరినరేష్ వ్యవహారం రాజకీయ కోణాన్ని సంతరించుకుంది. హిందూ దేవుళ్లను కించపరిచిన బైరి నరేష్‌పై కఠినచర్యలు తీసుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ట్వీట్ చేశారు. అటు గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ కూడా నరేశ్ వ్యాఖ్యలపై మండిపడ్డారు. అతనిపై పీడీ యాక్ట్ పెట్టి జైలుకు పంపించాలని డిమాండ్ చేశారు. ఇకపోతే అంబేద్కర్ సభలో బైరి నరేష్ మేము నాస్తికులం. దేవుళ్లను నమ్మం. అంబేద్కర్ సభ అంటేనే నాస్తికుల సభ అని బహిరంగంగా వ్యాఖ్యలు చేశారు. ఇక అయ్యప్ప స్వామి పుట్టుక గురించి అవమానపరుస్తూ అసభ్యకర కామెంట్స్ చెయ్యడం రాష్ట్రవ్యాప్తంగా అగ్గిరాజేశాయి.
అయ్యప్ప జననంపై జుగుప్సాకర కామెంట్స్ చేసిన భైరి నరేష్‌పై పలు పోలీస్‌స్టేషన్‌లో కేసులు నమోదయ్యాయి. నరేష్‌పై 153A, 295A, 298, 505 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తే ఉపేక్షించబోమని వికారాబాద్ ఎస్పీ హెచ్చరించారు. హిందూ దేవుళ్లను అవమానపరిచిన బైరి నరేష్‌ను కఠినంగా శిక్షించాలంటూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటాయి. నరేష్ వివాదాస్పద వ్యాఖ్యలపై అయ్యప్ప స్వాములు, హిందూ సంఘాలు, మహిళలు మండిపడ్డారు. పలుజిల్లాలో అయ్యప్పస్వాములు, వీహెచ్‌పీ, భజరంగ్‌దల్, బీజేపీ నేతలు నడిరోడ్డుపై నరేష్ కు వ్యతిరేకంగా ధర్నాలు చేపట్టారు. మొత్తానికి బైరి నరేష్ వ్యాఖ్యలు తెలంగాణలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. పోలీసులు ఈ విషయంపై సీరియస్ యాక్షన్ చేపట్టారు.