AP Ministers: ఉచిత బస్సుపై కసరత్తు షురూ.. బెంగళూరులో ఏపీ మంత్రుల పర్యటన
AP Ministers Raids In Bangalore Free Buses: ఏపీలో మహిళలకు ఉగాది నుంచి ఉచిత బస్సు ప్రయాణం అందించాలనే సంకల్పించిన కూటమి ప్రభుత్వం అందుకు వడివడిగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ముగ్గురు మంత్రులతో ఒక కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ శుక్రవారం కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ పథకం అమలును పరిశీలించింది. ఇక.. తెలంగాణ ప్రభుత్వం కూడా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అందిస్తున్నందున, ఇటీవల ఏపీ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి.. ఇటీవల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. తెలంగాణలో ఈ పథకం అమలుపై ఆయన సీఎంను అడిగి వివరాలు తెలుసుకున్న సంగతి తెలిసిందే.
కర్ణాటకలో పర్యటన
శుక్రవారం ఈ కమిటీ సభ్యులైన మంత్రులు రాంప్రసాద్ రెడ్డి, వంగలపూడి అనిత, సంధ్యారాణి శుక్రవారం బెంగళూరులోని ఆర్టీసీ ప్రధాన డిపోలను పరిశీలించారు. అనంతరం వీరు కర్ణాటక ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేశారు. ఆ తర్వాత వారంతా రాష్ట్ర రవాణా మంత్రి రామలింగారెడ్డి, సీనియర్ అధికారులతో సబ్ కమిటీ సభ్యులు భేటీ అయ్యారు.
పలు వర్గాల సూచనలు
ఈ సందర్భంగా మంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ.. ఏపీలో మహిళలకు ఉచిత బస్సు హామీ అమలుకు కర్ణాటకలో అధ్యయనం చేస్తున్నామని తెలిపారు. కర్ణాటకలో అమలవుతున్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై అధ్యయనంలో భాగంగా ప్రయాణికులు, అధికారులు, ప్రజా ప్రతినిధుల అభిప్రాయలను సేకరిస్తున్నామని తెలిపారు. అలాగే, సాయంత్రం సీఎం సిద్దరామయ్యను కూడా కలిసి ఉచిత బస్సు ప్రయాణ పథకంపై ఆయన సూచనలు, సలహాలు స్వీకరించనున్నట్లు తెలిపారు.