Published On:

IDF : ఇరాన్‌పై దాడులు మరింత తీవ్రం చేస్తాం : ఇజ్రాయెల్‌ రక్షణ మంత్రి కాట్జ్

IDF : ఇరాన్‌పై దాడులు మరింత తీవ్రం చేస్తాం : ఇజ్రాయెల్‌ రక్షణ మంత్రి కాట్జ్

Iran-Israel: ఇరాన్-ఇజ్రాయెల్‌ ఇరుదేశాల మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు శుక్రవారం మాట్లాడారు. ఇరాన్‌లోని న్యూక్లియర్‌ స్థావరాలపై దాడులు చేసేందుకు అమెరికా ఆదేశాల కోసం వేచి చూడలేమని తేల్చిచెప్పారు. తాజాగా ఇజ్రాయెల్‌ రక్షణమంత్రి కాట్జ్ ఐడీఎఫ్‌ సిబ్బందికి కీలక ఆదేశాలు జారీచేశారు. ఇరాన్‌ పాలనను అస్థిర పరచడానికి దాడులను మరింత తీవ్రం చేయాలని సూచించారు.

 

ఇరాన్‌ ప్రభుత్వ కేంద్రాలు, సంస్థలు, మౌలిక సదుపాయాలు, ఆస్తులను లక్ష్యంగా చేసుకోవాలన్నారు. టెహ్రాన్‌లోని బాసిజ్, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ వంటి కేంద్రాలను ధ్వంసం చేయాలని సూచించారు. ఆపరేషన్‌ లక్ష్యాలతో సహా ఇరాన్ ఆయుధ కార్యక్రమంతో సంబంధమున్న అణు కేంద్రాలు, శాస్త్రవేత్తలపై దాడులు కొనసాగించాలని ఆదేశించారు. ప్రజలను టెహ్రాన్‌ నుంచి ఇతర ప్రాంతాలకు తరలించాలని పేర్కొన్నారు.

 

ఇరాన్‌-ఇజ్రాయెల్‌ మధ్య యుద్ధాన్ని ఆపడానికి తీసుకోవాల్సిన దౌత్యపరమైన నిర్ణయాలపై చర్చలు జరిపేందుకు యూరోపియన్ విదేశాంగ మంత్రులు శుక్రవారం ఇరాన్‌ విదేశాంగ శాఖతో సంప్రదింపులు జరపనున్నారు. మరోవైపు తమపై ఇజ్రాయెల్‌ దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో అమెరికాతో ఎలాంటి అణు ఒప్పంద చర్చలు జరిపేది లేదని ఇరాన్‌ ఇప్పటికే తేల్చి చెప్పింది.

 

మరోవైపు రెండుదేశాలు దాడులు కొనసాగిస్తున్నాయి. శుక్రవారం ఇజ్రాయెల్‌లోని బీర్షెబాను ప్రాంతంలో ఇరాన్‌ క్షిపణి దాడుల్లో పలు భవనాలు ధ్వంసమయ్యాయి. దీంతో 7గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షిపణి దాడులతో పలు భవనాలు అగ్నికీలల్లో చిక్కుకున్నాయి. మంటలు ఆర్పడానికి అగ్నిమాపక సిబ్బంది శ్రమిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఇజ్రాయెల్‌ ఇరాన్‌లోని అణు కేంద్రాలు, కీలక నేతలే లక్ష్యంగా భారీగా క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడుతోంది.

ఇవి కూడా చదవండి: