Vishwambhara: మామయ్య కోసం త్యాగం చేస్తున్న మెగా మేనల్లుడు.. ?

Vishwambhara: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం విశ్వంభర. వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ నిర్మిస్తుంది. ఇక ఈ సినిమాలో చిరు సరసన త్రిష నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ భారీ అంచనాలను నెలకొల్పేలా చేశాయి. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా కోసం హై బడ్జెట్ పెడుతున్నారని టాక్ . కేవలం విఎఫ్ ఎక్స్ కోసమే రూ. 72 కోట్లు అయ్యాయని ఇన్ సైడ్ టాక్. సరే ఎంతైనా పర్లేదు.. సినిమా మాత్రం అనుకున్నట్లు రావాలని మేకర్స్ సైతం ఎంత అడిగితే అంత డైరెక్టర్ చేతిలో పెడుతున్నారట.
ఇక ఇవన్నీ పక్కన పెడితే.. విశ్వంభర రిలీజ్ డేట్ పై తీవ్ర సందిగ్దత నెలకొంది. జూన్ 24 న ఈ సినిమా రిలీజ్ అవుతుందని ఎప్పటి నుంచో వార్తలు వినిపిస్తున్నాయి. కానీ, ఆ డేట్ కు విశ్వంభర వచ్చేలా కనిపించడం లేదు. విఎఫ్ఎక్స్ ఇంకా పూర్తి కాలేదని, దానికే ఇంకా టైమ్ పడుతుందని చెప్తున్నారు. అంతేకాకుండా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా మొదలేపెట్టలేదని తెలుస్తోంది. ఇప్పటివరకు ఈ సినిమా రిలీజ్ డేట్ పై మేకర్స్ సైతం క్లారిటీ ఇచ్చింది లేదు.
అయితే అందుతున్న సమాచారం ప్రకారం విశ్వంభర.. సెప్టెంబర్ 25 కి వాయిదా పడిందని వార్తలు వస్తున్నాయి. ఆ డేట్ ను లాక్ చేయడానికి మేకర్స్ శతవిధాలా కష్టపడుతున్నారట. ఇక ఆ డేట్ నే బాలయ్య అఖండ 2 కూడా రిలీజ్ అవుతుంది. అంతేకాకుండా ఆ వారంలోనే దసరా వస్తుంది. పండగకు బాలయ్య సినిమా రావడం ఆనవాయితీగా మారింది. ఇక చిరు సైతం బాలయ్యతో పోటీ పడడానికి రెడీ అవుతున్నాడట. అయితే ఈ రెండు సినిమాల మధ్యలో కొట్టుమిట్టాడుతున్నాడు మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్.
తేజ్ హీరోగా నటిస్తున్న సంబరాల ఏటిగట్టు కూడా సెప్టెంబర్ 25 న రరిలీజ్ కు రెడీ అవుతోంది. రోహిత్ కెపి దర్శకత్వం వహిస్తున్న సినిమాపై తేజ్ చాలా ఆశలు పెట్టుకున్నాడు. తేజ్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా కావడంతో అభిమానులు కూడా సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా.. ? అని ఎదురుచూస్తున్నారు. ఇక మెగా మామయ్య అదే రోజున వస్తున్నాడు అంటే.. తన డేట్ ను త్యాగం చేసే పనిలో ఉన్నాడని టాక్. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.