Allu Arjun-Sreeleela: అల్లు అర్జున్, శ్రీలీలపై పోలీసులకు ఫిర్యాదు – క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్

AISF Complaint on Allu Arjun and Sreeleela: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, శ్రీలీలలు వివాదంలో చిక్కుకున్నారు. ఐఐటీ-జేఈఈ ఫలితాల నేపథ్యంలో కొర్పొరేట్ కాలేజీలు స్టార్స్‌తో ప్రకటనలు చేయిస్తున్న సంగతి తెలిసిందే. అయితే పలు కార్పొరేట్ విద్యాసంస్థలు అల్లు అర్జున్, శ్రీలీలలు బ్రాండ్ అంబాసిడర్లుగా ఉంటూ ఐఐటీ, జేఈఈ ఫలితాల విషయంలో విద్యార్థులను, తల్లిదండ్రులను తప్పుదోవ పట్టిస్తున్నారని వారిపై వామపక్ష పార్టీల విద్యార్థి విభాగం ఎ.ఐ.ఎస్.ఎఫ్ (AISF) సీరియస్ అయ్యింది.
వెంటనే అల్లు అర్జున్, శ్రీలీలపై చర్యలు తీసుకోవాలని, క్రిమినల్ కేసు నమోదు చేయాలని AISF డిమాండ్ చేస్తూ తెలంగాణ డీజీపీకి ఫిర్యాదు చేసింది. కాగా కార్పొరేట్ కాలేజీలకు బ్రాండ్ అంబాసిడర్స్‌గా వ్యవహరిస్తూ.. ఆయా కాలేజీలను ప్రమోట్ చేస్తున్నారని, జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో తప్పుడు ర్యాంకులను ప్రచారం చేస్తున్నట్టు ఆరోపించింది. శ్రీచైతన్య, నారాయణ విద్యాసంస్థల యాజమాన్యాలపై కూడా చీటింగ్ కేసు నమోదు చేయాలని AISF డిమాండ్ చేసింది. వీరు నటించే యాడ్స్ కారణంగా విద్యార్థుల జీవితాలు నాశనం అవుతున్నాయని, తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం అల్లు అర్జున్, శ్రీలీలపై చర్యలు తీసుకోవాలని ఎ.ఐ.ఎస్.ఎఫ్. ఫిర్యాదులో పేర్కొంది.