Sankatahara Chaturthi: వినాయక చవితి ఓకే.. మరి సంకట హర చతుర్థి ఏంటి?
Sankatahara Chaturthi on June 14: పత్రం, పుష్పం, ఫలం, తోయం..ఈ పలుకులు కృష్ణయ్యవి.. పూజాదికాలు అందుకునేది గణపయ్య.. వినాయక చవితి ఓకే.. మరి సంకట హర చతుర్థి ఏంటి..?
వినాయక పూజలో ప్రక్రుతి సంపద అంతా వినియోగిస్తాం. మాచీ పత్రం, బిల్వపత్రం, అర్కపత్రం మారేడు పత్రం.. ఇలా ఎన్నో పత్రాలు.. మరెన్నో పుష్పాలు, నైవేద్యాలుగా ఫలాలు, పిండవంటలుగా కుడుములు, ఉండ్రాళ్లు, జిల్లేళ్లు..ఇలా అన్నింటితో వినాయక చవితి పర్వదినాన్ని ఘనంగా చేసుకుంటాం. భక్తితో పత్రమైనా, పుష్పమైనా, ఫలమైనా, జలమైనా, తీర్థమైనా.. తనకు సమర్పిస్తే..తాను దానిని స్వీకరించి అపార పుణ్యఫలాలు ఇస్తానని గీతాచార్యుడు చెబుతాడు. అయితే, ఏ దైవానికి సమర్పించనంతగా ప్రక్రుతిలో లభించే పత్రాలు, పుష్పాలు, ఫలాలతో బుజ్జి గణపతులను, బొజ్జ గణపయ్యలను ఆరాధిస్తాం. వినాయకచవితి జగద్వితమైన మహా పర్వదినం అని అందరికీ తెలుసు. మరి సంకట హర చతుర్థి గురించి తెలుసా..? వినాయక చవితి వ్రతానికి ఆలంబనగా ప్రతి నెలా నిర్వహించే నెలవారీ చవిత పండువ సంకట హర చతుర్థి.
పాహి పాహి గణాధిపా పార్వతి తనయా గణాధిపా అంటూ భక్తులు ఆది పూజలు అందుకునే గణేశుని పూజిస్తారు. గణేశ చతుర్థి ప్రతి ఏటా భాద్రపద శుద్ధ చవితి నాడు వస్తుంది. వినాయకచవితి నుంచి నవ దినాలు గణపతి నవరాత్రులను అత్యంత భక్తిపూర్వంగా చేసుకుంటాం. ప్రక్రుతి మాత అందజేసే పత్ర, పుష్ప, ఫలాలన్నీ గణనాథుని పూజలో వినియోగిస్తాం.
శివ శివ మూర్తివి గణనాథ,నీవు శివుని కుమారుడవు గణనాథ అని వేనోళ్ల బుజ్జి గణపతులను, బొజ్జ గణపతులను పూజిస్తాం. శివ దేవుడి మహత్తర, మహిమాన్విత పర్వదినం మహా శివరాత్రి. జన్మానికల్లా శివరాత్రి అనే రీతిలో ఏడాదికోసారి మహా శివరాత్రిని నిర్వహించకుంటాం. ఇక ప్రతి మాసంలోనూ శివరాత్రి చేసుకుంటాం. అదే మాస శివరాత్రి. ఇక గణపయ్య విషయానికి వస్తే..భాద్రపద మాసంలో విశ్వవ్యాప్తంగా వినాయక చవిత మహోత్సవాన్ని, గణపతి నవరాత్రి వేడుకలను నిర్వహించుకోగా.. ప్రతి నెలా సంకట హర చతుర్ధిని నిర్వహించుకుంటాం. పార్వతి అమ్మవారి ముద్దుల తనయుడు బుజ్జి వినాయకుడు.
బాల గణపతికి ఏ చిన్ని కష్టం వచ్చినా, ఎవరైనా ఏ రీతినైనా అవహేళన చేసినా, చిన్నచూపు చేసిన అమ్మ ఆగ్రహం చెందుతుంది. అమ్మ దయ ఉంటే జయాలు కలుగుతాయి, అమ్మ దరి ఉంటే భయాలు తొలగుతాయని అని పురాణ పెద్దలు చెబుతారు. బొజ్జ వినాయకుడిని హేళన చేసి చంద్రుడు కోరి కష్టాలు తెచ్చుకుంటాడు. అమ్మ శాపానికి గురవుతాడు. అయితే, వెన్నలాంటి మనస్సున్న వినాయకుడిని ఆరాధిస్తే..గణనాథుని ఆశీస్సులతో పాటు జగన్మాత ఆశీస్సులు లభిస్తాయి. భక్తుల పాలిట వరదుడైన వినాయకుడిని సంకట హర చతుర్థి నాడు ప్రత్యేక రీతిలో ఆరాధిస్తే సంకటాలన్నీ తొలగిపోతాయి.
చాంద్ర మాసంలో చంద్రుడు క్షీణతకు గురయ్యే కృష్ణ పక్షంలో నాలుగో రోజు సంకట హర చతుర్ధి. వినాయక మాస పండుగైన సంకట హర చతుర్ధినాడు వినాయకుడిని భక్తిశ్రద్ధలతో పూజిస్తే అన్ని ఆటంకాలు, సంకటాలు తొలిగిపోతాయి. సర్వ శుభాలు సిద్దిస్తాయి. అన్ని సంకట హర చతుర్థుల కంటే అత్యంత ప్రధానమైనదిగా అంగారక చతుర్థిని పిలుస్తారు. అంగారక చతుర్థి నాడు గణేశునికి చేసే పూజలు ద్విగుణక్రుత ఫలాలు ఇస్తాయని పురాణ పెద్దలు, అర్చకస్వాములు చెబుతున్నారు.
పూజలు, అభిషేకాలు, ఉపవాసాలు, జాగరణలు, ఏకాహాలు, భజనలకు విశేష పుణ్య ఫలాలు లభిస్తాయని హిందూ పురాణాలు తెలియజేస్తున్నాయి. తెలిసి కాని తెలియకాని మహత్తర పర్వదినం రోజున మహోన్నత పుణ్యకార్యాన్ని చేసినవారికి పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయని పవిత్ర పురాణాలు చెబుతున్నాయి. మహా పాపాత్ములు ఈ రీతిన చిన్ని పుణ్యకార్యం చేసి నరకలోక చాయలకే వెళ్లకుండా పుణ్యలోకాలకు వెళ్లిన కథలు పవిత్ర కార్తీక పురాణంలో కన్పిస్తాయి. ఇదే రీతిన గణేశ పురాణంలోను ఘటనలు కన్పిస్తాయి. పాపాత్ములైవుండి..తెలియకుండా సంకట హర చతుర్థి నాడు పుణ్యకార్యం ఆచరించి పుణ్యగతులు పొందిన వ్యక్తి కథ ఇందులో కనిపిస్తుంది.
అన్ని పూజల్లో వినాయక పూజ మిన్న. ఎందుకంటే ఏ దైవాన్నయి పుష్పలతో పూజిస్తారు. కొందరు దైవాలను కొన్ని పత్రాలతో పూజిస్తారు. అయితే, ఆది పూజలు అందుకునే ఆదిమూల గణపతిని ఎన్నో పత్రాలు, ఎన్నెన్నో పుష్పాలతో పూజిస్తారు. పత్ర, పుష్ప, ఫల, తోయం..ఆది గల అన్నింటితో పూజాదికాలు, అభిషేకాలు అందుకునే లంబోదరుడు భక్తజన వరదుడు. పురాక్రుత ప్రారబ్ధం, సంచిత పాపకర్మలు, ప్రస్తుత జన్మలో చేసిన పాపాలు.. ఇలా చెడని పదార్ధంలో వెంటాడే పాపఫలాలను తొలగించేది, కష్టాల కడలి నుంచి బయట పడేసేది, భవతరణానికి నావ లాంటిది.. సంకటహర చతుర్థి వ్రతం. సంకటాలు తొలగించే సంకట హర చతుర్థి వ్రతాన్ని ప్రతి ఏటా భాద్రపద శుద్ద చవితి నాడు చేసుకునే వినాయక చవితి వ్రతానికి ఆలంబనగా ప్రతి నెలా నిర్వహిస్తారని అర్చకస్వాములు చెబుతున్నారు.