IPL 2025 : సమష్టిగా రాణించిన ఢిల్లీ బ్యాటర్లు.. గుజరాత్ లక్ష్యం 204

IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్‌లో జోరు మీదున్న ఢిల్లీ క్యాపిటల్స్ భారీ స్కోర్ చేసింది. అహ్మదాబాద్‌లో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న ఢిల్లీ బ్యాటర్లు సమష్టిగా రాణించారు. అక్షర్ పటేల్(39) కెప్టెన్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. ఓపెనర్ కరుణ్ నాయర్(31) మరోసారి మంచి ఇన్నింగ్స్ ఆడాడు. ఆఖరులో ఫినిషర్ అశుతోష్ శర్మ (37) సిక్సర్ల మోతతో జట్టుకు మంచి స్కోర్ అందించాడు. ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. ఇప్పటివరకు 198 రన్స్‌ను మాత్రమే ఛేదించిన గుజరాత్ ఈసారి రికార్డు సృష్టిస్తుందా? అనేది ఆసక్తికరంగా మారింది.
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఢిల్లీ బ్యాటర్లు చెలరేగారు. ఓపెనర్లు అభిషేక్ పొరెల్ (18), కరుణ్ నాయర్ (31) ఇద్దరు శుభారంభం అందించారు. అర్షద్ ఖాన్ డేంజరస్ పొరెల్‌ను ఔట్ చేసి గుజరాత్‌కు బ్రేక్ ఇచ్చాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన కేఎల్ రాహుల్ (28) ఉన్నంత సేపు బాగా ఆడాడు. కరుణ్‌తో కలిసి వేగంగా స్కోర్ బోర్డును నడిపిస్తున్న క్రమంలో రాహుల్‌ను ప్రసిధ్ కృష్ణ ఎల్బీగా ఔట్ చేశాడు. కాసేపటికే నాయర్‌ను ఔట్ చేసి ఢిల్లీకి షాక్ ఇచ్చాడు. ట్రిస్టన్ స్టబ్స్ (31) జతగా అక్షర్ పటేల్ (39) రెచ్చిపోయాడు. ఇద్దరూ ధాటిగా ఆడడంతో ఢిల్లీ 10 ఓవర్లకు 3 వికెట్ల నష్టానికి 105 రన్స్ చేసింది.
వరుస బంతుల్లో..
రషీద్ ఖాన్ బౌలింగ్‌లో వీరు తలో సిక్సర్ కొట్టారు. నాలుగో వికెట్‌కు 53 రన్స్ జోడించిన ఈ జంటను సిరాజ్ విడదీశాడు. టాప్ ఆర్డర్‌ను కూల్చిన ప్రసిధ్ 18వ ఓవర్లో వరుస బంతుల్లో అక్షర్, విప్రజ్ నిగమ్(0)లను ఔట్ చేసి ఢిల్లీని దెబ్బ కొట్టాడు. అదే ఓవరులో రెచ్చిపోయిన అశుతోష్ శర్మ (37) లెగ్ సైడ్, ఫైన్ లెగ్ దిశగా సిక్సర్లు కొట్టాడు. ఇంప్యాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన డొనోవాన్ ఘోరంగా విఫలం కాగా, సాయి కిశోర్ వేసిన 20వ ఓవర్లో అశుతోష్ పెద్ద షాట్ ఆడి బౌండరీ లైన్ వద్ద అర్షద్‌కు క్యాచ్ ఇచ్చాడు. ఆఖరి బంతిని కుల్దీప్ యాదవ్ (4) నాటౌట్‌గా ఫోర్ కొట్టాడు. దీంతో ఢిల్లీ.. ఆతిథ్య జట్టుకు 204 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ ఓపెనర్లు బ్యాటర్లు శుభారంభాన్ని అందించారు. 6 ఓవర్లలో 67 పరుగులు చేసింది. క్రీజులో సాయి సుదర్శన్ 34, జోస్ బట్లర్ 25 ఉన్నారు. శుభమన్ గిల్ (7) పరుగులకే రనౌట్ అయ్యారు. ముఖేశ్ కుమార్ బౌలింగ్‌లో లేని రన్ కోసం వెళ్లి రనౌట్‌గా వెనుదిరిగాడు.