Congress meeting: గాంధీభవన్‌లో ఆదివారం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్ధాయి సమావేశం జరిగింది. పలు అంశాల పై పార్టీ ఎజెండాను ప్రకటించారు. అనంతరం టీపీసీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రాహుల్ పై అనర్హత వేటుకు నిరసనగా ఈ నెల 8న మంచిర్యాలలో నిరసన కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యలపై గళమెత్తే విధంగా 25న గజ్వేల్‌లో బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు రేవంత్ వెల్లడించారు. రేపు పోస్టుకార్డు ఉద్యమానికి కాంగ్రెస్ శ్రీకారం చుట్టింది.
ఈనెల 7తేదీన టీపీసీసీ ఆధ్వర్యంలో కులీ కుతబ్ షా మైదానంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేస్తున్నామని, 8తేదీన మంచిర్యాలలో సత్యాగ్రహ దీక్ష నిర్వహిస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు. 10 నుంచి 25 వరకు మళ్లీ పాదయాత్ర ప్రారంభమవుతుందని తెలిపారు. టీఎస్ పీఎస్సీ పై ఈడీ కేసు నమోదు చేసిందన్నారు రేవంత్ రెడ్డి.కాంగ్రెస్ సమావేశానికి ప్రధాన కార్యదర్శులు ఎవరూ రాకపోవడంపై తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జి మాణిక్ రావ్ ధాక్రే మండిపడ్డారు. వందమంది ప్రధాన కార్యదర్శలు ఉండి ఒక్కరూ రాకపోవడం దారుణమన్నారు. పనిచేయని నేతలను, బాధ్యతారాహిత్యంగా ఉండేవారిని పదవులనుంచి తొలగిస్తామని అన్నారు. ఇటువంటి వైఖరని సమర్దించే ప్రసక్తి లేదని స్పష్టం చేసారు.
మరోవైపు రైతు ఆత్మహత్యలపై తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సిఎం కేసీఆర్‌ని లక్ష్యంగా చేసుకుని ట్వీట్ చేశారు. ఒకటైతే నిజం… పచ్చి అబద్ధాన్ని కూడా ఇదే నిజం అనిపించేలా చెప్పడంలో నిన్ను మించినోడు లేడు కేసీఆర్ అంటూ విమర్శించారు. తెలంగాణలో రైతులు ఉరికొయ్యలకు వేలాడుతున్న లెక్కలు NCRB రికార్డుల్లో భద్రంగా ఉన్నాయని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. లెక్కకు రానివి ఇంతకు పదింతలున్నాయని ఆయన అన్నారు. రైతు స్వరాజ్య వేదిక సమక్షంలో ఇద్దరం కూర్చుందాం… ఆత్మహత్యలు లేవన్న నీ మాటల్లో నిజమెంతో నిగ్గుతేల్చుదాం. కేసీఆర్…సిద్ధమా?! అంటూ సవాల్ చేశారు.