Air India Flight: ఇక నుండి విజయవాడ గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి ముంబైకి నేరుగా విమాన సర్వీస్ లు నడపనున్నారు .ఆంధ్ర ప్రాంతం నుంచి దేశ వాణిజ్య రాజధాని ముంబైకి ప్రతి రోజు చాలా మంది వ్యాపార నిమిత్తం ,ఇతర కార్యక్రమాలకు వెళ్తూ వుంటారు . ఇప్పటి వరుకు విజయవాడ నుంచి విమాన మార్గంలో ముంబై వెళ్లాలంటే వయా హైదరాబాద్ మీదుగా వెళ్లాల్సి వుండేది. మధ్యలో హైదరాబాద్ లో ఆగి వెళ్ళాలి .దీంతో ప్రయాణ సమయం ఎక్కువగా పడుతోంది . అయితే ఇప్పుడు డైలీ విమాన సర్వీసు డైరెక్ట్ గా ముంబైకి ప్రారంభం కాబోతోంది. దీనికి సంబంధించి జూన్ 15న ఎయిర్ ఇండియా సంస్థ 180 మంది ప్రయాణికుల సామర్థ్యం గల భారీ బోయింగ్ ఏ320 విమాన సర్వీసును ప్రారంభించనుంది.
తొలిసారిగా గన్నవరం నుంచి ముంబైకి డైరెక్ట్ విమాన సర్వీస్ నడుపుతున్న నేపథ్యంలో ప్రయాణికులకు ఎయిర్ ఇండియా బంపర్ ఆఫర్ ప్రకటించింది . టికెట్ ధరను రూ.5600గా ఎయిర్‌ఇండియా నిర్ణయించింది.ఇది సాధారణ ధరలతో పోల్చుకుంటే రూ.4600 తక్కువగా వుంది . కొంతకాలం తర్వాత డిమాండ్ బాగా ఉంటే ఈ రేటు మారే అవకాశం ఉంటుంది . ప్రతి రోజూ రాత్రి 7.10 గంటలకు విజయవాడ గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి విమానం బయలుదేరి రాత్రి 9 గంటల కల్లా ముంబైకి చేరుతుంది. అంటే ప్రయాణ సమయం కేవలం గంటా యాభై నిమిషాలు మాత్రమే.
విజయవాడ నుంచి ముంబైకి నేరుగా విమాన సర్వీసు కావాలని నగరంలోని వ్యాపారులు, ఇతర వర్గాల నుంచి ఎప్పటి నుంచో ఉన్న డిమాండ్ నేపథ్యంలో ఎయిర్ ఇండియా ఈ నిర్ణయం తీసుకుంది . విజయవాడ నుంచి ముంబైకి నేరుగా విమాన సర్వీసును ప్రారంభించేందుకు ముందుకు వచ్చిన ఎయిర్ ఇండియా సంస్థకు పలువురు అభినందనలు తెలియచేసారు . ప్రారంభ ఆఫర్‌గా కేవలం రూ.5600లకే ముంబైకి ప్రయాణించే అవకాశాన్ని కల్పించింది.
రాష్ట్రము విడిపోయిన తర్వాత గన్నవరం ఎయిర్‌పోర్ట్ కు ప్రాధాన్యత పెరిగింది . దేశ విదేశాల నుంచి పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తుంటారు.ముఖ్యంగా విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. వ్యాపారపరంగా కీలకమైన గుంటూరు, విజయవాడ ప్రాంతాలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్ చాలా ముఖ్యమైనది. ఈ నేపథ్యంలో విజయవాడ-ముంబై మధ్య నేరుగా విమాన సర్వీసు ప్రారంభం కానుండటంపై హర్షం వ్యక్తమవుతోంది.