Kyrgyzstan: ఇండియా నుంచి మెడిసిన్ చదవడానికి వెళ్లిన విద్యార్థులు ప్రస్తుతం కిర్గిస్తాన్‌లో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కు బిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. కిర్గిస్తాన్ రాజధాని బిష్కెక్‌లో పరిస్థితులు దారుణంగా తయారయ్యాయి. స్థానికులతో పాటు పోలీసులు కూడా తోడై భారతీయులు, పాకిస్తానీయులు, బంగ్లాదేశ్, నేపాలీ విద్యార్థులు ఉంటున్న హాస్టల్‌పై పడి భౌతిక దాడులకు పాల్పడుతున్నారు. ఇక ఇండియా నుంచి వెళ్లిన విద్యార్థినులను లైంగికంగా వేధించారని అక్కడ మెడిసిన్ చదువుతున్న విద్యార్థి ప్రైమ్ 9తో ఫోన్‌లో తన గోడు వెలిబుచుకున్నాడు. జై శంకర్ ఒక ట్విట్ చేశారని.. తమకు వెంటనే విమానాలు పంపితే తమ డబ్బుతో టిక్కెట్లు కొనుగోలు చేసుకొని తిరిగి మాతృదేశానికి వస్తామని చెబుతున్నారు విద్యార్థులు.
ఈజిప్షియన్ యువతులను వేధించడంతో..(Kyrgyzstan)
ఇదిలా ఉండగా విదేశీ విద్యార్థులపై దాడులకు దారి తీసిన ఘటన విషయానికి వస్తే.. ఈజిప్షియన్ యువతులను స్థానికులు వేధించడవతో ఈజిప్టుకు చెందిన విద్యార్థులు స్థానిక యువకులపై దాడి చేశారు. దీంతో స్థానికులు పెద్ద గుంపుగా ఏర్పడి విదేశాల నుంచి ఉన్నత చదువు కోసం వచ్చిన వారిపై భారీ ఎత్తున దాడులకు పాల్పడుతున్నారు. సాయం చేయాల్సిన పోలీసులు చోద్యం చూస్తున్నారు తప్ప బాధితులను ఆదుకోవడానికి ముందుకు రావడం లేదు. ఇక అక్కడి భారతీయ విద్యార్థులు ఉన్న హాస్టళ్లలోజొరబడి రక్తం కారేట్లు చితకబాదిన వీడియోలను ప్రైమ్ 9కు పంపారు. మరి కేంద్రప్రభుత్వం వెంటనే ప్రత్యేక విమానాలు పంపి వారిని సురక్షితంగా మాతృదేశానికి రప్పించాలని బాధిత తల్లిదండ్రలు విజ్ఞప్తి చేస్తున్నారు.
విద్యార్థులు హాస్టల్స్‌కే పరిమితం కావాలి..
ప్రస్తుతం పరిస్థితులు అదుపులోకి వచ్చాయని చెబుతున్నారు. విద్యార్థులు హాస్టల్స్‌కే పరిమితం కావాలని ఇండియన్ కౌన్సిలెట్ ట్విట్ చేసింది. అయితే శుక్రవారం రాత్రి విదేశీ విద్యార్థులపై జరిపిన దాడుల వీడియోలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్ అయ్యాయి. స్థానికులకు ఈజిప్షియన్ విద్యార్థులకు మధ్య జరిగిన గొడవల కారణంగా స్థానికులు ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌ల నుంచి వచ్చిన విద్యార్థులను లక్ష్యంగా చేసుకొని చితకబాదుతున్నారు. ఈ దాడుల్లో ఆరుగురు విద్యార్థులు చనిపోయారన్న వార్తలు వస్తున్నాయి. అయితే వారు దేశానికి చెందిన వారనే విషయం తెలియరాలేదు. కాగా కిర్గిస్తాన్ ప్రభుత్వం మాత్రం ప్రస్తుతం పరిస్థితులు అదుపులోకి వచ్చాయని చెబుతోంది. నిరసనకారులతో పోలీసులు చర్చలు జరుపుతున్నారని తెలిపింది. కాగా కిర్గిస్తాన్‌లో సుమారు 14,500 మంది విద్యార్థులు చదువుతున్నారని విదేశాంగ శాఖ తెలిపింది.
ఇక్కడ ఎంబీబీఎస్ 5-6 సంవత్సరాల కోర్సుకు సుమారు రూ.22 లక్షల రూపాయల ఫీజు అవుతుంది. అదే ఇండియాలో అయితే కోటి రూపాయలపై మాటే. అదీ కాకుండా ఇండియాలో కేవలం 99వేల ఎంబీబీఎస్ సీట్లు మాత్రమే అందుబాటులో ఉంటాయి. అందుకే ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌కు చెందిన విద్యార్థులు కిర్గిస్తాన్‌లో ఎంబీబీఎస్ చదువుకోడానికి మొగ్గు చూపుతారు.