Electric Buses: విశాఖపట్టణం లోని ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రం సింహాచలం అప్పన్న దేవాలయంలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించారు . ఈ బస్సులను శనివారం ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ అశోక్ గజపతిరాజు, ఈవో శ్రీనివాసమూర్తి ప్రారంభించారు. ప్రస్తుతం రెండు బస్సులను కొనుగోలు చేసి తిప్పుతున్నట్లు అశోక్ గజపతి రాజు తెలిపారు. అయితే బస్సు టికెట్ ధర మాత్రం పాతదే కావడం విశేషం .గతంలో కొండ పైకి సాధారణ బస్సు టికెట్ రేటు 15 రూపాయలు ఉంటే..ఇప్పుడు అదే టికెట్ రేటుతో ఏసీ బస్సు లో భక్తులు కొండపైకి వెళ్లనున్నారు . ఈ బస్సు సాధ్యాసాధ్యాలను పరిశీలించి, మరికొన్ని వాహనాలను కొనుగోలు చేస్తామని అశోక్ గజపతి రాజు తెలిపారు .
పర్యావరణం పరిరక్షణకే..(Electric Buses)
ఒక్కో ఎలక్ట్రిక్ బస్సు ఖరీదు రూ.కోటి 65 లక్షలు అని తెలుస్తోంది. ఎలక్ట్రిక్ బస్సులు కావడంతో ఒక్కో బస్సును రెండున్నర గంటల పాటు చార్జింగ్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి ఛార్జింగ్ చేస్తే 225 కిలోమీటర్ల పాటు ప్రయాణం చేస్తుంది.ఈ సందర్భంగా అశోక్ గజపతి రాజు మాట్లాడుతూ.. భక్తుల సౌకర్యార్ధం ప్రకృతి వనరులను కాపాడుకునేందుకు.. కాలుష్యాన్ని తగ్గించేందుకు కరెంట్‌తో నడిచే వాహనాలు అవసరమన్నారు.దీన్ని పైలట్ ప్రాజెక్ట్ గా తీసుకుని విజయ వంతం అయితే రాష్ట్రంలోని మిగతా గిరి దేవాలయాలకు కూడా ఎలక్ట్రిక్ బస్సు లను నడిపే అవకాశాలు వున్నాయి .