Private Gold Mine: కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరి లో బంగారు ఉత్పత్తి కోసం జియో మైసూర్ సర్వేస్ కంపెనీ వేగం పెంచింది.ఈ ఏడాది చివరినాటికి తవ్వకాలు ప్రారంభించనున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు.ఈ ప్లాంట్‌లో కార్యకలాపాలు మొదలైతే ప్రతి సంవత్సరం 750 కిలోల బంగారం వెలికి తీసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.బంగారు తవ్వకాలు కోసం ఇప్పటికే 200 కోట్లు ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది.బంగారు ఉత్పత్తి కోసం ప్రస్తుతం 250 ఎకరాల భూమి సేకరణ చేసిన జియో మైసూర్ సర్విసెస్ కంపెనీ ఇప్పటికే 60 శాతం పనులను పూర్తి చేసింది.చాలా ఏళ్ల అన్వేషణ తర్వాత ఈ ప్రాంతంలోని 1500 ఎకరాల్లో బంగారు నిక్షేపాలున్నట్లు గుర్తించారు.
మన దేశంలో, ప్రైవేటు రంగంలో తొలి బంగారం గని ఇదే కావడం ప్రత్యేకత. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు, అనంతపురం జిల్లాల్లోనూ కొన్ని బంగారం గనులను గుర్తించి,అభివృద్ధి చేసే ప్రయత్నాలు కొంతకాలంగా జరుగుతున్నాయి. ఈ గనులను తవ్వేందుకు ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎన్ఎండీసీ లిమిటెడ్ ఆసక్తిగా ఉంది. కొంతకాలం క్రితం ఈ గనులను తమకు అప్పగించాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎన్ఎండీసీ కోరింది.ఈ అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉంది.కర్నూలు జిల్లా జొన్నగిరి గనులతో పాటు, ఈ గనులు కూడా అభివృద్ధి చేసిన పక్షంలో ఆంధ్రప్రదేశ్‌కు బంగారం గనుల రాష్ట్రంగా జాతీయ స్థాయిలో గుర్తింపు వస్తుందని ఏపి ప్రభుత్వం ఆశిస్తోంది.