RBI: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించింది. శుక్రవారం జరిగిన మానిటరీ పాలసీ కమిటీ సమావేశంలో రేపో రేటుని యథాతథంగా ఉంచుతున్నట్లు ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. అయితే ఆర్‌బీఐ పాలసీ రేట్లలో ఎలాంటి మార్పు చేయకుండా స్థిరంగా ఉంచడం ఇది వరుసగా ఐదోసారి కావడం గమనార్హం. పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్బీఐ గవర్నర్ చెబుతున్నారు. అందుకే కీలక వడ్డీ రేట్లను 6.5 శాతానికి పరిమితం చేయాలనే ప్రతిపాదనకు మానిటరీ పాలసీ కమిటీ ఏక గ్రీవంగా అంగీకారం తెలిపిందని చెప్పారు. స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ రేటును 6.25 శాతం వద్ద, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేటు, బ్యాంకు రేటును 6.75 శాతం వద్ద యథాతథంగా కొనసాగిస్తున్నట్లు శక్తికాంత దాస్ తెలిపారు.
మరో గ్లోబల్ ఆర్థిక వ్యవస్థ సాధారణ స్థితికి చేరుకోవడానికి సమయం పట్టనుంది. ఓ వైపు అప్పులు పెరగడం, మరోవైపు భౌగోళిక ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ కాస్త బలహీనంగా ఉన్నట్లు తెలుస్తున్నది. ఇక ఈ ఆర్థిక సంవత్సరం ద్రవ్యోల్బణం 5.4 శాతంగా ఉండవచ్చునన్నారు. ఆర్‌బీఐ మాత్రం ద్రవ్యోల్బణాన్ని నాలుగు శాతానికి పరిమితం చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుందన్నారు.ఇక ఈ ఆర్థిక సంవత్సరం జీడీపీ వృద్దిరేటును 6.5 శాతం నుంచి 7 శాతానికి అంచనా వేసింది. మూడో త్రైమాసికంలో 6.5 శాతం, నాలుగో త్రైమాసికంలో 6 శాతంగా ఉండవచ్చునని ఆర్‌బీఐ గవర్నర్ చెప్పారు. డిసెంబర్ 1వ తేదీ నాటికి రిజర్వుబ్యాంకు వద్ద విదేశీ మారకద్రవ్యం నిల్వలు 604 బిలియన్ డాలర్లకు చేరాయని ఆయన వివరించారు.