IAS Trainee Puja Khedkar: మహారాష్ట్రలోని ట్రైనీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్ తన వైకల్య ధృవీకరణ పత్రాన్ని పొందేందుకు పూణెలో నకిలీ చిరునామాను సమర్పించారు. ‘వైకల్య ధృవీకరణ పత్రం’ అధికారికంగా యశ్వంతరావు చవాన్ మెమోరియల్ హాస్పిటల్, పింప్రి ద్వారా జారీ చేయబడింది. పూజ తన రేషన్ కార్డును అడ్రస్ ప్రూఫ్‌గా జతచేసి నకిలీ అడ్రస్‌తో సర్టిఫికెట్ పొందింది. ఈ సర్టిఫికెట్‌లో పేర్కొన్న చిరునామా థర్మోవెర్టా ఇంజనీరింగ్ కంపెనీ చిరునామా. ఇదిలా ఉండగా, ఖేద్కర్‌కు చెందిన ఆడి కారు కూడా ఇదే కంపెనీ పేరు మీద రిజిస్టర్ చేయబడి ఉండటం గమనార్హం.
పూణే జిల్లా కలెక్టర్ పై ఖేద్కర్ ఫిర్యాదు..(IAS Trainee Puja Khedkar)
పూణే జిల్లా కలెక్టర్ సుహాస్ దివాసేపై తనను వేధింపులకు గురిచేసినట్లు పూజ ఖేద్కర్ ఫిర్యాదు చేసినట్లు మంగళవారం ఒక అధికారి తెలిపారు.మహిళా పోలీసు సిబ్బంది సోమవారం వాషిమ్‌లోని ఆమె నివాసంలో ఖేద్కర్‌ను కలిసారు. ఆమె పూణే జిల్లా కలెక్టర్ సుహాస్ దివాసేపై వేధింపుల ఫిర్యాదు చేసిందని ఆయన చెప్పారు.ఖేద్కర్ సివిల్ సర్వీసు పరీక్షలకు హాజరయినపుడు ఆమె సమర్పించిన వైకల్యం, ఓబీసీ సర్టిఫికేట్‌లపై కూడా ఇపుడు అధికారులు దృష్టి సారించినట్లు సమాచారం.ట్రైనీ ఐఏఎస్ అధికారిణిగా తనకు అర్హత లేని సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేయడం, ఉన్నతాధికారి ఛాంబర్‌ను ఆక్రమించడం వంటి ఆమె ప్రవర్తనపై దివాసే సీనియర్ అధికారులకు నివేదిక సమర్పించిన తర్వాత ఖేద్కర్‌ను పూణే నుంచి వాషిమ్‌కి బదిలీ చేశారు. ఖేద్కర్‌పై వచ్చిన ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ విచారణ జరుపుతోంది. మరోవైపు ప్రభుత్వం మంగళవారం అధికారి జిల్లా శిక్షణా కార్యక్రమాన్ని తాత్కాలికంగా నిలిపివేసి లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్‌కు తిరిగి పిలిపించింది.
పూణెలోని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) మంగళవారం సాయంత్రం పూజ ఖేద్కర్ తండ్రి దిలీప్ ఖేద్కర్ ఆస్తులపై సమగ్ర నివేదికను రాష్ట్ర ప్రధాన కార్యాలయానికి సమర్పించింది.2020లో పదవీ విరమణ చేసే వరకు మహారాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (ఎంపీసీబీ) డైరెక్టర్‌గా పనిచేసిన దిలీప్ ఖేద్కర్, తన పదవీ కాలంలో ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారని ఆరోపణలు వచ్చాయి. ఉన్నతాధికారులు కనుగొన్న అంశాలను పరిశీలించిన తర్వాత తదుపరి చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు.