Patnam Narender Reddy Wife Petition in TG High Court: వికారాబాద్ జిల్లాలోని లగచర్ల ఘటనలో పోలీసులపై హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలైంది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా తన భర్త పట్నం నరేందర్ రెడ్డి అరెస్టు జరిగిందని గురువారం పట్నం శృతి హైకోర్టులో పిటిషన్ ధాఖలు చేశారు. పోలీసులపై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలని పిటిషన్‌లో పేర్కొన్నారు.
నిబంధనలు పాటించలే..
ఒక వ్యక్తిని అరెస్టు చేసే సమయంలో అనుసరించాల్సిన నిబంధనలు పాటించలేదని పిటిషనర్ శృతి పేర్కొన్నారు. డీ.కే బసు కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పిటిషన్‌లో శృతి ప్రస్తావించారు. ప్రతివాదులుగా ఐజీ వి.సత్యనారాయణ, వికారాబాద్ ఎస్పీ కె. నారాయణరెడ్డి, బొమ్మరాస్పేట ఇన్స్పెక్టర్ శ్రీధర్‌రెడ్డి, ఎస్సై మహమ్మద్ అబ్దుల్ రవూఫ్ పిటిషనర్ చేర్చారు. ప్రతివాదులుగా ఉన్న పోలీసులపై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలంటూ పట్నం శృతి కోరారు. ఈ పిటిషన్‌ను హైకోర్టు రేపు(శుక్రవారం) విచారించే అవకాశం కనిపిస్తోంది.
కేసు నేపథ్యం
కాగా.. వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్‌పై దాడి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ దాడిలో పాల్గొన్న నిందితుల్లో ఒకరు.. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ నేత పట్నం నరేందర్‌రెడ్డితో ఎక్కువసార్లు ఫోన్‌లో మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ఈ కేసులో మాజీ ఎమ్మెల్యేను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్క్‌లో మార్నింగ్ వాక్ చేస్తుండగా ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం చర్లపల్లి జైల్లో నరేందర్ రెడ్డి ఉన్నారు.