Central Forensic Science Laboratory: దేశంలో ఎక్కడ ఎలాంటి నేరాలు జరిగినా నిందితులను పట్టుకునేందుకు దోహదపడే వ్యవస్థ సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబోరేటరీని అంతర్జాతీయస్థాయి ప్రమాణాలతో తీర్చిదిద్దడం అభినందనీయమని, పనితీరు బాగుందని కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ అన్నారు. మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ తో కలిసి హైదరాబాద్ రామాంతాపూర్ లోని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబోరేటరీ, నేషనల్ సైన్స్ ఫోరెన్సిక్ లాబోరేటరీ, సెంట్రల్ డిటెక్టివ్ ట్రైనింగ్ ఇన్ స్టిట్యూట్ సంస్థలను సందర్శించారు. ఆయా సంస్థల్లోని ప్రతి విభాగానికి వెళ్లి పరిశీలించారు. అధికారులతో సమావేశమై ఆయా విభాగాల పనితీరును అడిగి తెలుసుకున్నారు.
అంతర్జాతీయ ప్రమాణాలతో సీఎఫ్ఎస్ఎల్ సంస్థ..
ప్రధాని మోడీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ ప్రమాణాలతో సీఎఫ్ఎస్ఎల్ సంస్థను తీర్చిదిద్దిందని పేర్కొన్నారు. దక్షిణ భారత దేశంలోనే ఈ సంస్థలు హైదరాబాద్ లో ఉండడం గర్వకారణమన్నారు. దేశంలోని ఇతర రాష్ట్రాల నుంచి వేలాది కేసుల పరిష్కారానికి ఈ సంస్థలను సంప్రదిస్తున్నారని అధికారులు తెలిపారు. నేర పరిశోధనకు అవసరమైన ప్రామాణిక పత్రాలను సీఎఫ్ఎల్ఎల్ అందజేస్తోందని అధికారులు కేంద్ర మంత్రికి వివరించారు.
సంస్థ ఉన్నతాధికారులతో సమావేశం..
తొలుత సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబోరేటరీని బండి సంజయ్ సందర్శించారు. సంస్థ జాతీయ విభాగం డైరెక్టర్ ఎస్.కే.జైన్, హైదరాబాద్ ఇన్ చార్జి రాజీవ్ గిరోటీ బండికి స్వాగతం పలికారు. అనంతరం కేంద్రమంత్రి సంస్థ ఉన్నతాధికారులతో సమావేశమై సీఎఫ్ఎస్ఎల్ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. భవిష్యత్ కార్యాచరణపై అధికారులను అడిగి తెలుసుకోవడంతోపాటు కేంద్రం నుంచి అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు ప్రతిపాదనలను కోరారు. ఈ సందర్భంగా బండి సంజయ్, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ సంస్థ ఆవరణలో మొక్కలు నాటారు.
అనంతరం ఎన్సీఎఫ్ఎల్, సీడీటీఐ సంస్థలను కేంద్ర మంత్రి సందర్శించారు. ఆయా సంస్థల పనితీరుపై సంబంధిత శాఖ అధికారులు పవర్ పాయింట్ ఇచ్చారు. పోలీసులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లకు, న్యాయవాదులకు ఇప్పటి వరకు 39,167 మందికి సీటీడీఐ అధికారులు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్న విషయాన్ని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సంస్థ అధికారులను అభినందించారు.