Site icon Prime9

PAC Chairman: వైసీపీకి బిగ్ షాక్.. జనసేనకే పీఏసీ ఛైర్మన్‌

Janasena MLA Anjaneyulu As PAC Chairman: ప్రజాపద్దుల కమిటీ ఛైర్మన్‌ (పీఏసీ)గా భీమవరం జనసేన ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ఎన్నిక దాదాపు ఖరారైంది. ఈయన మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. నేటి ఎన్నిక సమయానికి తగినంత బలం లేకున్న బరిలో నిలిచిన వైసీపీ తన నామినేషన్‌‌ను ఉపసంహరించుకోకపోతే, అసెంబ్లీ కమిటీహాల్‌లో పీఏసీ సభ్యత్వానికి పోలింగ్‌ జరగనుంది. బ్యాలెట్‌ పద్ధతిలో సభ జరిగే సమయంలోనే పోలింగ్‌ ప్రక్రియ చేపట్టనున్నారు.

ఇదీ లెక్క
పీఏసీ సభ్యుడిగా ఎన్నిక కావాలంటే 19.44 ఓట్లు రావాల్సి ఉంది. అంటే సుమారు 20 ఓట్లు అవసరం అవుతాయి. అయితే ఇప్పుడు వైసీపీ వద్ద ఉన్న సంఖ్యాబలం కేవలం 11 మాత్రమే కావడంతో వైసీపీ నుంచి సభ్యుడు ఎన్నిక కావటం సాధ్యం కాని పరిస్థితి. ఈ నేపథ్యంలో నామినేషన్లు వేసిన వారిలోనే ఒకరిని పీఏసీ ఛైర్మన్‌గా ఎన్నుకోవాల్సి ఉంటుంది.

కూటమి కీలక నిర్ణయం
పీఏసీ ఎన్నికపై కూటమి పక్షాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. పీఏసీ ఎన్నికలో సంఖ్యాబలం ప్రకారం వెళ్లాలని నిర్ణయించాయి. పీఏసీ సభ్యత్వానికి కూటమి తరపున తొమ్మిది మంది ఎమ్మెల్యేలు నామినేషన్ దాఖలు చేశారు. వీరిలో టీడీపీ నుంచి జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి, తణుకు ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ, గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి, పత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు, వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు, ఎస్ కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి నామినేషన్‌లు వేయగా, జనసేన తరఫున పులపర్తి రామాంజనేయులు, బీజేపీ తరఫున విష్ణు కుమార్ రాజు నామినేషన్ వేశారు. ఇక.. తగిన సంఖ్యాబలం లేకున్నా విపక్షం నుంచి వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నామినేషన్ వేశారు. దీంతో కూటమి అభ్యర్థి ఎన్నిక లాంఛనం కానుంది.

జనసేనకు అవకాశం
ఈ క్రమంలో ఈసారి పీఏసీ కమిటీ ఛైర్మన్‌గా జనసేన నుంచి నామినేషన్ దాఖలు చేసిన భీమవరం ఎమ్మెల్యే పులవర్తి రామాంజనేయులు ఎన్నిక నేడు లాంఛనం కానుంది. ఎన్నిక ప్రక్రియ పూర్తయ్యాక నూతన పీఏసీ చైర్మన్‌గా పులపర్తి రామాంజనేయులు పేరును స్పీకర్ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు, ప్రభుత్వరంగసంస్థల కమిటీ (పీయూసీ) చైర్మన్ గా ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్, అంచనాల కమిటీ (ఎస్టిమేట్స్) ఛైర్మన్‌గా మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావును ఎంపిక చేయనున్నట్లు సమాచారం.

Exit mobile version