Telangana Assembly Sessions Schedule Released: తెలంగాణ శీతాకాల సమావేశాలకు రంగం సిద్ధమైంది. వచ్చే డిసెంబర్ 9వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని పాలక పక్షం నిర్ణయించింది. ఈ మేరకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఒక ప్రకటన చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తికానున్న నేపథ్యంలో ఈ ఏడాది ప్రజాపాలనలో చేపట్టిన పథకాలు, అభివృద్ధి పథకాలను అసెంబ్లీ వేదికగా ప్రజలకు వివరిస్తామని ఆయన తెలిపారు.
చర్చకు రానున్న కీలక బిల్లులు
రాబోయే శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో రెవెన్యూ సంస్కరణల్లో కీలకమైన ఆర్వోఆర్ చట్టాన్ని ఆమోదిస్తారు. దీని ద్వారా భూ సమస్యలకు చెక్ పెట్టొచ్చని ప్రభుత్వం భావిస్తోంది. అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కులగణనపై చర్చించి ఆమెదించనున్నారు. దీని ఆధారంగానే స్థానిక సంస్థల రిజర్వేషన్లు ఖరారయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రైతు భరోసా, ఆసరా పింఛన్ల పెంపుపైనా అసెంబ్లీలో తీర్మానించే అవకాశం ఉంది.
విపక్షాల కసరత్తు..
ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షాలు కూడా కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలు, ఎన్నికల హామీల గురించి నిలదీసేందుకు సిద్ధంగా ఉన్నాయి. ముఖ్యంగా పెండింగ్‌లో ఉన్న రైతు రుణమాఫీ,పింఛన్ల పెంపు, నిరుద్యోగ భృతి, రైతు బంధు నిధుల విడుదల తదితర పెండింగ్ హామీల అమలుపై ఈ పార్టీలు ప్రభుత్వాన్ని ఇరుకునబెట్టనున్నాయి.